టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో భారత్‌తో మ్యాచ్ బహిష్కరించడంపై పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా స్పందించాడు. తాము కేవలం కాంట్రాక్టు ఆటగాళ్లమని.. ప్రభుత్వం నిర్ణయానుసారమే నడుచుకుంటామని తెలిపాడు.
వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియాతో మ్యాచ్ ఆడరాదని తమ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. ఇందులో ఆటగాళ్లు చేసేదేమీ లేదని పేర్కొన్నాడు. ఎవరైనా ప్రభుత్వ ఆదేశానికి కట్టుబడి ఉండాల్సిందేనని సల్మాన్ ఆఘా వ్యాఖ్యానించాడు.
ఆసీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి..
అదే విధంగా.. గ్రూప్ దశలో మ్యాచ్ రద్దు కారణంగా పాయింట్లు కోల్పోయే అంశం మీద కూడా సల్మాన్ ఆఘా స్పందించాడు. లీగ్ దశలో మిగిలిన మ్యాచ్‌లలో గెలిచి ముందడుగు వేస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
కాగా ప్రపంచకప్ టోర్నీకి ముందు సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో పాకిస్తాన్ మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆసీస్ జట్టు దాదాపు ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగగా.. పాక్ ఈ మేర విజయం సాధించింది.
ప్రపంచకప్ అంటే భారత్‌తో మ్యాచ్ మాత్రమే కాదు
ఈ నేపథ్యంలో ఆసీస్‌తో మూడో టీ20లో విజయం తర్వాత సల్మాన్ ఆఘా (Salman Agha) భారత్‌తో మ్యాచ్ (IND vs PAK) రద్దు విషయం గురించి మాట్లాడాడు. ‘‘‘మేం బోర్డుతో కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లం. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి మేం కట్టుబడి ఉండాల్సిందే. ప్రపంచకప్ అంటే భారత్‌తో మ్యాచ్ మాత్రమే కాదు కదా!..
లీగ్ దశలో మరో మూడు మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ గెలిచి ముందంజ వేసేందుకు ప్రయత్నిస్తాం’ అని సల్మాన్ పేర్కొన్నాడు. కాగా టీమిండియాతో ఆడరాదనే పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయాన్ని పాక్ మాజీ క్రికెటర్లు షాహిత్ ఆఫ్రిది, యూసుఫ్, రషీద్ లతీఫ్, మొయిన్ ఖాన్, సర్ఫరాజ్ అహ్మద్ సమర్థించారు.
మిగిలిన మూడు జట్లు అవే
కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య భారత్- శ్రీలంక వేదికలుగా టీ20 ప్రపంచకప్ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. ఇరవై జట్లు పాల్గొంటున్న ఈ ఈవెంట్లో భారత్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్‌తో పాటు పాకిస్తాన్ గ్రూప్-‘ఎ’లో ఉంది.
అయితే, భారత్‌లో తమకు భద్రత లేదంటూ బంగ్లాదేశ్.. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలంటూ ఓవరాక్షన్ చేయగా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిరాకరించింది. దీంతో బంగ్లాకు మద్దతుగా పాకిస్తాన్ కూడా ముందుగా టోర్నీ నుంచి వైదొలుగుతామని బీరాలు పలికింది. చివరగా భారత్‌తో మ్యాచ్ ఆడకూడదని నిర్ణయం తీసుకుంది.
అపుడు అమెరికా చేతిలో ఓడి
అయితే, ఈ విషయంపై ఐసీసీకి ఇంతవరకు అధికారికంగా తెలియజేయకపోవడం పాక్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024లో పసికూన అమెరికా చేతిలో లీగ్ మ్యాచ్‌లో పాక్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే.


