"పెళ్లి" అంటే నూరేళ్ల పంట..ఎన్నో జన్మల బంధం అని చెబుతుంటారు. కానీ ఇప్పుడు అది అబద్దమా అనిపిస్తుంది. చాలామంది ఆ అనుభవాన్ని గడించిన వివాహిత మహిళలు ఆ పేరు ఎత్తితేనే..హడలిపోతున్నారు.,విముఖత చూపిస్తున్నారు. సరదాకైనా..మళ్లీ వయసు వెనక్కి వెళ్లితే.. పెళ్లి చేసుకుంటారా అని మాటవరసకు అడిగితేనే..బాబోయ్ అన్నట్లుగా ఇస్తున్న సమాధానాల తీరు చూస్తే..పెళ్లీడుకి వచ్చిన వాళ్లు సైతం చేసుకోవాలా? వద్దా? అనేలా ఉన్నాయి వారి మాటలు.
బాలీవుడ్ నటి, ట్రావెల్ వ్లాగర్ షెహనాజ్ తన పర్యాటక అనుభవాలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంటారామె. కంటెంట్ క్రియేటర్‌గా ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేస్తుంటారామె. అలానే ఈసారి పెళ్లై ఎన్నో వసంతాలు గడిచిపోయినా.. వృద్ద మహిళలను ఆటపట్టించే కొంటే ప్రశ్నతో పలకరించారు. అయితే వాళ్లందరి సమాధానాలు చూసి షెహనాజ్ విస్తుపోయింది. ఇంతకీ ఆ వివాహిత వృద్ధ మహిళను ఆమె ఏం అడిగారంటే..ఈ రోజు గనుక మీ ఏజ్ వెనక్కి వచ్చి..20 ఏళ్లు అయితే "మళ్లీ పెళ్లి చేసుకుంటారా"? అని ప్రశ్నించింది.
అందుకు ఒకరేమో..ఒక్కసారి చాలు..ఇంకోసారి అస్సలు వద్దు అని చెప్పగా, మరొకరు పైళ్లిపై అంతగా ఆసక్తి లేదని, అది బానిసత్వానికి మరోపేరు అని తేల్చి చెప్పేశారు. ఇంకొందరు..మంచి పాఠం నేర్చుకోవాలంటే తప్పకుండా పెళ్లిచేసుకోవాలని అన్నారు. దానికి షెహనాజ్ ఏ పాఠం అని కుతుహలంగా ప్రశ్నించగా..అచ్చం కభీ ఖుషీ కభీ గమ్ మూవీలా కొన్ని సార్లు సంతోషం, కొన్నిసార్లు దుఃఖం అని చెప్పారు. చాలామటుకు పెళ్లిని అదొక సర్దుబాటుగా అభివర్ణించారు.
ఒకరు మాత్రం ఆర్మీ ఆఫీసర్‌ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాను, ఎందుకంటే..జీవితంపై పూర్తి అవగాహన ఉంటుందని అన్నారామె. అయితే ఆ సీనియర్ మహిళలంతా పెళ్లిపై అలా ఎందుకు చెప్పారంటే..వాళ్ల కాలంలో చాలామంది మహిళలు ఉద్యోగాలు చేయకుండా గృహిణులుగా జీవితం గడిపామని, ఇంట్లో చాలా బాధ్యతలు ఉండేవని చెప్పడం విశేషం. ఆ సమాధానాలన్ని విని షెహనాజ్ చమత్కారంగా అందుకే తాను పెళ్లిచేసుకోలేదని అంది. వెంటనే అక్కడున్న మహిళ నవ్వుతూ..ఆ..! అది సరైన నిర్ణయం అని సమర్థించడం విశేషం.
(చదవండి: సేవలో అతడికి సాటిలేరెవ్వరూ..! చేసేది డెలివరీ బాయ్ జాబ్ కానీ..)


