బలూచిస్తాన్‌లో ఇంతవరకూ తమ ఇంటిలోని పురుషుల అదృశ్యాలతో గుండెకోతకు గురైన మహిళలు.. ఇప్పుడు నిత్యం వారే పాక్ దళాల కిడ్నాప్‌కు బలి అవుతున్నారు. తరతరాలుగా తమ వారి ఆచూకీ కోసం పోరాడుతున్న బలూచ్ మహిళల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. అపహరణలు, నిర్బంధాల రూపంలో పాక్ సాగిస్తున్న ఈ అణచివేత ఒక జాతి మనుగడను, ఆత్మగౌరవాన్ని కాలరాస్తోంది. మరోవైపు గడప దాటి బయటకు వచ్చి, న్యాయం అడుగుతున్న ఆడబిడ్డల గొంతు నొక్కే ప్రయత్నాలు సర్వసాధారణమయ్యాయి. బలూచ్ పోరాట పటిమను నీరుగార్చాలనే పాక్ కుట్రలు ఆ ప్రాంతాన్ని కన్నీ సంద్రంగా మార్చివేస్తున్నాయి.
గతంలో బలూచ్ సంప్రదాయాల దృష్ట్యా మహిళలను నిర్బంధించడం చాలా అరుదుగా జరిగేది. కానీ ఇప్పుడు బలూచిస్తాన్ మానవ హక్కుల మండలి (హెచ్‌ఆర్‌సీబీ)నివేదిక ప్రకారం.. మహిళలను అపహరించడం అనేది పాకిస్తాన్ భద్రతా దళాలైన కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్(సీటీడీ), ఫ్రాంటియర్ కార్ప్స్ (ఎఫ్‌సీ), మిలిటరీ ఇంటెలిజెన్స్ (ఎంఐ)లకు ఒక దైనందిన కార్యక్రమంగా మారింది. హక్కుల కోసం గొంతెత్తుతున్న మహిళలను భయపెట్టడం ద్వారా, బలూచ్ ప్రతిఘటనను అణచివేయడమే పాక్ సర్కార్ లక్ష్యంగా కనిపిస్తోంది.

హెచ్‌ఆర్‌సీబీ వెల్లడించిన కేసుల్లో కొన్ని..
గుల్జాది.. ఒకే ఏడాదిలో మూడుసార్లు వేధింపులు..
మానవ హక్కుల కార్యకర్త అయిన గుల్జాది జీవితం నేటి బలూచిస్తాన్ దయనీయ స్థితికి అద్దం పడుతోంది. 2025, ఏప్రిల్ 7న క్వెట్టాలో ఆమెను సిటిడి బలగాలు కుటుంబ సభ్యుల ముందే ఈడ్చుకెళ్లాయి. మార్చిలో రెండుసార్లు ఆమె ఇంటిపై దాడి చేసిన బలగాలు.. చివరికి ఆమెపై 16 తప్పుడు కేసులు బనాయించాయి. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ఆమెను 3-MPO (మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్) కింద జైలులో నిర్బంధించారు. ఒక సామాన్య మహిళను ఉగ్రవాదిగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని హెచ్‌ఆర్‌సీబీ పేర్కొంది.
మహజబీన్ బలోచ్.. విద్యార్థిని అని కూడా చూడకుండా..
యూనివర్శిటీ ఆఫ్ బలూచిస్తాన్‌లో బీఎస్‌సీ లైబ్రరీ సైన్స్ చదువుతున్న 24 ఏళ్ల మహజబీన్, 2025, మే 29న క్వెట్టా సివిల్ హాస్పిటల్ హాస్టల్ నుంచి అదృశ్యమైంది. అర్ధరాత్రి మూడు గంటలకు హాస్టల్ గదుల్లోకి చొరబడిన బలగాలు ఆమెను ఎక్కడికి తీసుకెళ్లాయో నేటికీ వెల్లడి కాలేదు. బలూచ్‌లో విద్యార్థినులకు కూడా రక్షణ లేదని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా నిలిచింది.
రొబినా బలోచ్.. ఆరోగ్య కార్యకర్తపై అమానుషం..
2025, జూన్ 30న టర్బత్‌లోని ఓవర్‌సీస్ కాలనీలో నివసిస్తున్న ప్రభుత్వ హెల్త్ విజిటర్ రొబినా ఇంటిని ఫ్రాంటియర్ కార్ప్స్ ధ్వంసం చేసింది. ఆమెను ఎటువంటి కారణం లేకుండా అపహరించి, తీవ్ర మానసిక వేదనకు గురిచేసి విడుదల చేశారు.
సఫియా బీబీ.. సామూహిక శిక్షకు బలి
2025, అక్టోబర్ 5న ఖుజ్దార్‌లోని జెహ్రీలో భారీ సైనిక ఆపరేషన్ జరిగింది. ఆ ఊరంతా కర్ఫ్యూ విధించి, ఇంటింటిలో సోదాలు చేసిన బలగాలు సఫియా బీబీని రహస్య ప్రదేశానికి తరలించారు. గ్రామాన్ని మొత్తం ముట్టడించి భయాందోళనకు గురిచేయడంలో భాగంగానే ఈ అపహరణ జరిగింది.

నజియా షఫీ.. కస్టడీలో మృతి..
2025, అక్టోబర్ 28న పంజ్‌గూర్‌లో జరిగిన ఈ ఘటన అత్యంత క్రూరమైనదిగా నిలిచింది. తల్లి పారి బలోచ్, కుమార్తె నజియాలను పాక్ బలగాలు తుపాకీతో బెదిరించి తమతో పాటు తీసుకెళ్లాయి. మరుసటి రోజు నజియాను తీవ్ర గాయాలతో ఆసుపత్రి సమీపంలో పడేశారు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇది నేరుగా ప్రభుత్వ కస్టడీలో జరిగిన హత్యేనని హెచ్‌ఆర్‌సీబీ చెబుతోంది. మృతురాలి తల్లి పారి బలోచ్ కూడా బలగాల చేతుల్లో చిత్రహింసలకు గురైన తర్వాత విడుదలైంది.
నస్రీన్.. 15 ఏళ్ల బాలిక అదృశ్యం
అవరాన్‌కు చెందిన నస్రీన్ అనే 15 ఏళ్ల మైనర్ బాలికను నవంబర్ 22న హబ్ చౌకీ వద్ద అపహరించారు. సిటిడి, మిలిటరీ ఇంటెలిజెన్స్ బలగాలు ఆమెను అపహరించాయి. చిన్నపిల్లలపై ఈ తరహా దాడులు అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలకు వ్యతిరేకం.
ఫర్జానా జెహ్రీ.. బహిరంగంగా కిడ్నాప్
2025, డిసెంబర్ 1న ఖుజ్దార్‌లో ఆసుపత్రి నుండి వస్తున్న ఫర్జానాను దారి మధ్యలో పాక్ బలగాలు అపహరించాయి. ఇది జరిగింది ఎక్కడో గదుల్లోనే కాదు.. బహిరంగ ప్రదేశాల్లో కూడా మహిళలకు రక్షణ లేదని ఈ ఘటన రుజువు చేసింది.
రహిమా: గృహిణులు కూడా టార్గెట్
2025, డిసెంబర్ 9న దల్బందిన్‌లో 20 ఏళ్ల గృహిణి రహిమాను, ఆమె 18 ఏళ్ల తమ్ముడిని అర్ధరాత్రి దాడుల్లో భాగంగా తీసుకెళ్లారు. నేటికీ వారి ఆచూకీ లభించలేదు.
చట్టం కనుమరుగు.. అణచివేత రాజ్యం
పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 (వ్యక్తిగత స్వేచ్ఛ), ఆర్టికల్ 10 (నిర్బంధంపై రక్షణ), ఆర్టికల్ 14 (మానవ గౌరవం)లను భద్రతా సంస్థలు బహిరంగంగా ఉల్లంఘిస్తున్నాయి. మహిళల హక్కుల కోసం ఏర్పడిన అంతర్జాతీయ సంస్థల, ఐక్యరాజ్యసమితి నిబంధనలను ఏమాత్రం గౌరవించడం లేదు. మానవ హక్కుల కార్యకర్తలను, ఆరోగ్య సిబ్బందిని, చివరకు గృహిణులను కూడా వదలని ఈ నిరంకుశ పోకడలు బలూచిస్తాన్‌ను ఒక బహిరంగ జైలుగా మారుస్తున్నాయి. జవాబుదారీతనం లేని బలూచ్‌లో న్యాయం కనుమరుగవుతోంది. ఈ దుర్భర స్థితిపై అంతర్జాతీయంగా వచ్చే స్పందన కోసం వివిధ మానవహక్కుల సంఘాలు ఎదురుచూస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Japan: నిరసనల మధ్య అణు ప్లాంట్ పునఃప్రారంభం


