ప్రపంచంలోనే అత్యంత భారీ అణు విద్యుత్ ప్లాంట్ ‘కాషివాజాకి కరివా’ త్వరలో తెరుచుకోనుంది. జపాన్‌లోని ఈ ప్లాంట్ గత 15 ఏళ్లుగా పలు కారణాలతో మూతపడివుంది. ఇప్పుడు జపాన్ ఇంధన అవసరాలను తీర్చేందుకు సిద్ధం అవుతోంది. అణు విపత్తు మిగిల్చిన భయానక జ్ఞాపకాలు వెంటాడుతున్నా, దేశ ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తున్న విద్యుత్ ఖర్చులను తగ్గించుకునేందుకు జపాన్ ఈ ప్లాంట్‌ను తిరిగి తెరిచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నిర్ణయం ప్రపంచ ఇంధన రంగంలోనే జపాన్‌కు అతిపెద్ద ‘టర్నింగ్ పాయింట్’గా మారనుంది.
పెను విపత్తు తర్వాత..
2011లో సంభవించిన సునామీ కారణంగా ఫుకుషిమా అణు ప్లాంట్‌లో కూలింగ్ వ్యవస్థ విఫలమైంది. ఫలితంగా రేడియోధార్మికత వెలువడింది. ఈ నేపధ్యంలో లక్షలాది మంది ప్రజలు ఇక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి వచ్చింది. అనంతరం మూతపడిన జపాన్ అణు ఇంధన రంగం మళ్లీ ప్రాణం పోసుకుంటోంది. నీగాటా ప్రాంతంలోని ‘కాషివాజాకి-కరివా’ అణు విద్యుత్ ప్లాంట్ పునఃప్రారంభంపై తాజాగా జరిగిన ప్రిఫెక్చురల్ అసెంబ్లీ ఓటింగ్ ఒక కీలక మైలురాయిగా నిలిచింది. టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ సారధ్యంలో ఈ ప్లాంట్‌ను తిరిగి ప్రారంభించేందుకు గవర్నర్ హిడెయో హనాజుమి నిర్ణయం తీసుకున్నారు. దీనికి అసెంబ్లీలో ఆమోదం లభించింది. ఇది కేవలం ఒక ప్లాంట్ ప్రారంభం మాత్రమే కాదు, జపాన్ ఇంధన విధానంలో వస్తున్న పెను మార్పుకు సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు.
విపత్తు జ్ఞాపకాలు.. నిరసనల హోరు
ఒకవైపు జపాన్ ప్రభుత్వం ప్లాంట్‌ను తిరిగి తెరిచేందుకు సన్నాహాలు చేస్తుండగా, మరోవైపు స్థానికుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నీగాటా అసెంబ్లీ వెలుపల దాదాపు 300 మంది నిరసనకారులు.. ముఖ్యంగా వృద్ధులు 'నో న్యూక్స్' (అణుశక్తి వద్దు) అంటూ గొంతెత్తారు. ఫుకుషిమా ప్రమాదం కారణంగా నాడు తమ ఇళ్లను వదిలి వెళ్లిన బాధితులు ఇప్పటికీ ఆ భయానక జ్ఞాపకాలతో పోరాడుతున్నారు. 60 శాతానికి పైగా నివాసితులు టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ నిర్వహణపై అపనమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అణు ప్రమాదాల వల్ల కలిగే నష్టం మాకు ప్రత్యక్షంగా తెలుసు, ఇలాంటివి మరెక్కడా జరగకూడదు" అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్ధిక భారాన్ని మోసేందుకు..
శిలాజ ఇంధనాల నుండి విముక్తి పొందేందుకే జపాన్ ఈ నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న విద్యుత్ ఖర్చులు, ఇంధన భద్రత మొదలైనవి జపాన్‌కు అత్యంత భారంగా పరిణమించాయి. గత ఏడాది జపాన్ శిలాజ ఇంధనాల దిగుమతి కోసం ఏకంగా 10.7 ట్రిలియన్ యెన్ల (రూ. 6,08,947 కోట్లు) భారీ మొత్తాన్ని ఖర్చు చేసింది. దేశ విద్యుత్ అవసరాలకు 60-70 శాతం మేరకు బొగ్గు, గ్యాస్ దిగుమతి చేసుకోవలసి రావడంతో ఆర్థిక వ్యవస్థపై మరింత భారం పడుతోంది. ఈ నేపథ్యంలో సొంతంగా చౌకైన విద్యుత్తును ఉత్పత్తి చేసుకునుందుకు అణుశక్తిని పునరుద్ధరించడం తప్పనిసరి అని ప్రధాన మంత్రి సనే తకైచి ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది.
టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీదే బాధ్యత
గతంలో ఫుకుషిమా ప్లాంట్‌ను నిర్వహించిన ‘టెప్కో’ సంస్థే ఈ కాషివాజాకి-కరివా అణు విద్యుత్ ప్లాంట్‌ను నడపనుంది. ప్రజల్లో పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించేందుకు ‘టెప్కో’ రాబోయే 10 ఏళ్లలో నీగాటా ప్రాంతంలో 100 బిలియన్ యెన్ల పెట్టుబడి పెడతామని హామీనిచ్చింది. భద్రతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడబోమని, ఫుకుషిమా వంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. జనవరి 20 నాటికి ఈ ప్లాంట్‌లోని మొదటి రియాక్టర్‌ను యాక్టివ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
పెరుగుతున్న విద్యుత్ డిమాండ్
జపాన్ జనాభా కొంతమేరకు తగ్గుతున్నప్పటికీ, విద్యుత్ డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), భారీ డేటా సెంటర్ల స్థాపన వల్ల విద్యుత్ అవసరాలు మరింతగా పెరుగుతున్నాయి. 2040 నాటికి దేశ విద్యుత్ పరిశ్రమలో అణుశక్తి వాటాను 20 శాతానికి పెంచాలని జపాన్ లక్ష్యంగా పెట్టుకుంది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి 'డీకార్బనైజేషన్' లక్ష్యాలను చేరుకోవడానికి కూడా అణుశక్తి అత్యంత కీలకమైన వనరుగా మారింది. ఈ ప్లాంట్ ప్రారంభించేందుకు జపాన్ ముందు ఇప్పుడు రెండు సవాళ్లు ఉన్నాయి. ఒకటి అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ప్లాంట్లను నడపడం, రెండోది ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించడం. ఈ దిశగా జపాన్ ముందుకు సాగుతోంది.
ఇది కూడా చదవండి: విజయ్ ‘మైనారిటీ’ వ్యూహం.. స్టాలిన్ సర్కార్ వణుకు


