టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో టీమిండియాతో తమ జట్టు మ్యాచ్ ఆడబోదని పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ పునురుద్ఘాటించారు. క్రీడల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని.. అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇస్లామాబాద్‌లో ఫెడరల్ క్యాబినెట్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ..
అందుకే టీమిండియాతో మ్యాచ్ ఆడము
‘‘టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఇండియాతో మ్యాచ్ ఆడవద్దని నిర్ణయించుకున్నట్లు మరోసారి స్పష్టం చేస్తున్నాం. ఎందుకంటే.. క్రీడా మైదానంలో రాజకీయాలకు తావు ఉండకూడదనేది మా వాదన. అందుకే మేము కచ్చితమైన నిర్ణయం తీసుకున్నాం.
బంగ్లాదేశ్‌కు మద్దతుగా మేము ఈ పని చేస్తున్నాం. ఇది అత్యంత గొప్ప, సరైన నిర్ణయమని నేను భావిస్తున్నాను’’ అని షెబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) పేర్కొన్నారు. కాగా పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్‌గా పాక్ మంత్రి మొహ్సిన్ నక్వీ (Mohsing Naqvi) ఉన్న సంగతి తెలిసిందే.
మీ వేషాలు మామూలుగా లేవండి!
ఇప్పుడు వరల్డ్‌కప్‌లో భారత్‌తో మ్యాచ్ బహిష్కరణ గురించి ఏకంగా ప్రధాని ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయాలను క్రీడలతో కలగలిపి దౌత్యపరంగా లబ్ది పొందాలని చూస్తుంది మీరేనంటూ షెబాజ్ షరీఫ్‌పై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
బంగ్లాదేశ్‌కు లేని బాధ మీకు ఎందుకని.. ఉద్దేశపూర్వకంగా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తే నష్టపోయేది మీరేనంటూ చురకలు అంటిస్తున్నారు. ఏదేమైనా.. ‘‘మీ వేషాలు మామూలుగా లేవండి’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.
తటస్థ వేదికపై దాయాదుల పోరు
కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకి పాక్ ఆతిథ్యం ఇవ్వగా.. టీమిండియా తటస్థ వేదికైన దుబాయ్‌లో మ్యాచ్‌లు ఆడింది. ఈ నేపథ్యంలో అప్పుడే భారత్- పాక్‌లలో ఒకటి ఆతిథ్య దేశంగా ఉంటే.. తటస్థ వేదికను ఏర్పాటు చేయాలనే ఒప్పందం జరిగింది. అందుకు తగ్గట్లే టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. పాక్ శ్రీలంకతో తమ మ్యాచ్‌లు ఆడనుంది.
ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ కొన్నాళ్లుగా భారత్‌ను రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్‌ను బీసీసీఐ తొలగించింది. దీంతో భారత్‌తో తమకు భద్రత లేదని.. తమ వేదికను శ్రీలంకకు మార్చాలని బంగ్లా బోర్డు ఐసీసీ దగ్గర పట్టుపట్టింది.
బంగ్లాదేశ్‌కు గట్టిగానే షాక్ తగిలింది
అయితే, భారత్‌లో భద్రత విషయంలో బంగ్లా జట్టుకు వచ్చిన ఎలాంటి ముప్పేమీ లేదని ఐసీసీ చెప్పగా.. బంగ్లా మొండివైఖరి వీడలేదు. దీంతో ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించింది. అయితే, పాకిస్తాన్ మాత్రం తమకు తటస్థ వేదిక ఉన్నా.. లంకలో భారత్‌తో మ్యాచ్‌కు భద్రతా సమస్యలు ఉన్నాయంటూ కొత్తరాగం ఎత్తుకుంది.
అయితే, లీగ్ దశలో మిగిలిన మ్యాచ్‌లకు లేని భద్రతా కారణాలు.. భారత్‌తో మ్యాచ్‌కు మాత్రమే ఎందుకు ఉంటాయనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పాక్ ప్రధాని స్వయంగా మరోసారి ఈ విషయం గురించి ప్రకటన చేయడం విశేషం.
ఒకవేళ పాక్ టీమిండియాతో మ్యాచ్‌ను బహిష్కరిస్తే ఆర్థికంగా భారీగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే ఐసీసీ ఆదాయం తగ్గి.. ఇతర సభ్య దేశాల బోర్డులపై కూడా ప్రభావం పడుతుంది.
చదవండి: IND vs PAK: పాక్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన బంగ్లాదేశ్.. పొట్టకొట్టేలా..


