క్రికెట్ అభిమానులను ఇది కన్‌ఫ్యూజ్ చేసే వార్త. ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. అదేంటి.. ఆ రోజు భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను పాక్ ప్రభుత్వం రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది కాదా అనుకుంటున్నారా..? అవును ఇది నిజమే. అంతకుముందు వార్త కూడా నిజమే.
వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 15న భారత్-పాక్ మధ్య రెండు మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నాయి. పాక్ ప్రభుత్వం పురుషుల టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా జరగాల్సిన మ్యాచ్‌ను రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. మరో మ్యాచ్ మహిళల ఏసీసీ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భాగంగా జరగాల్సి ఉంది.
ఈ మ్యాచ్‌కు పాక్ ప్రభుత్వం నుంచి కాని, ఆ దేశ క్రికెట్ బోర్డు నుంచి కాని ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఈ మ్యాచ్‌తో పాటు టోర్నీ మొత్తం కోసమే పీసీబీ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఉమ్మె-హాని ఎంపికైంది.
ఈ జట్టులో ఎమాన్ నసీర్, గుల్ రుఖ్, హఫ్సా ఖలీద్, హురైనా సజ్జాద్, షావాల్ జుల్ఫికార్ కీలక బ్యాటర్లు. వికెట్ కీపర్లుగా కోమల్ ఖాన్, యుస్రా ఆమిర్ ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్లుగా నూరీన్ యాకూబ్, ఉమ్మె-హాని ఉన్నారు. బౌలింగ్ విభాగంలో అనోషా నసీర్, లుబ్నా బెహ్రామ్, నేహా షర్మిన్ నదీమ్ , సయిదా మసూమా జాఫ్రీ , వహీదా అఖ్తర్ ఆ జట్టు బలంగా ఉంది.
రిజర్వ్ ప్లేయర్లుగా జునాష్ అబ్దుల్ సత్తార్, మహమ్ అనీస్, అంబర్ కైనాత్, ఆయేషా బిలాల్ ఎంపికయ్యారు.
ఈ టోర్నీలో పాక్ షెడ్యూల్ ఇలా ఉంది.
ఫిబ్రవరి 13 – పాకిస్తాన్ ‘A’ vs నేపాల్ (ఉదయం 9.30)
ఫిబ్రవరి 15 – పాకిస్తాన్ ‘A’ vs ఇండియా ‘A’ (మధ్యాహ్నం 2.00)
ఫిబ్రవరి 17 – పాకిస్తాన్ ‘A’ vs UAE (మధ్యాహ్నం 2.00)
అన్ని మ్యాచ్‌లు బ్యాంకాక్‌లో జరగనున్నాయి.
ఇదిలా ఉంటే, ఈ టోర్నీలో భారత ఏ జట్టు కూడా ఫిబ్రవరి 13నే తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, మలేసియా, థాయ్‌లాండ్ గ్రూప్-బిలో ఉండగా.. పాక్, భారత్, యూఏఈ, నేపాల్ జట్లు గ్రూప్-ఏలో ఉన్నాయి. గ్రూప్ దశలో భారత్ ఫిబ్రవరి 13న యూఏఈతో, 15న పాకిస్తాన్‌తో, 17న నేపాల్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టును కూడా ఇదివరకే ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ రాధా యాదవ్ వ్యవహరించనుంది.


