వరల్డ్‌కప్‌ టోర్నీకి ముందు టీమిండియాకు మరో షాక్‌! | T20 WC 2026, India Faces Injury Woes As Tilak Varma Returns, Washington Sundar And Harshit Rana Struggle With Fitness | Sakshi
Sakshi News home page

వరల్డ్‌కప్‌ టోర్నీకి ముందు టీమిండియాకు మరో షాక్‌!

Feb 5 2026 12:51 PM | Updated on Feb 5 2026 1:58 PM

IND vs SA Injury scare for India days before T20 WC Harshit Rana limps off

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు ముందు టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే స్టార్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ గాయం వల్ల న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ మొత్తానికి దూరం కాగా.. ఇటీవల యూఎస్‌తో వార్మప్‌ మ్యాచ్‌ సందర్భంగా పునరాగమనం చేశాడు. భారత- ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి సత్తా చాటాడు. తాజాగా సౌతాఫ్రికాతో వార్మప్‌ మ్యాచ్‌లోనూ టీమిండియా తరఫున అదరగొట్టాడు.

ఇక తిలక్‌ వర్మ (Tilak Varma) కోలుకోవడం టీమిండియాకు సానుకూలాంశంగా పరిణమించగా.. ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (Washington Sundar) ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేదు. 

లీగ్‌ దశ మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా స్టార్‌ పేసర్‌ హర్షిత్‌ రాణా కూడా గాయం వల్ల బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్‌ సన్నాహకాల్లో భాగంగా భారత జట్టు బుధవారం సౌతాఫ్రికాతో తలపడిన విషయం తెలిసిందే.

దంచికొట్టిన ఇషాన్‌, తిలక్‌
నవీ ముంబై వేదికగా తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఇషాన్‌ కిషన్‌ (20 బంతుల్లో 53; 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీతో కదంతొక్కగా... హైదరాబాదీ బ్యాటర్‌ తిలక్‌ వర్మ (19 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచి కొట్టాడు.

ఇక కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (16 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షర్‌ పటేల్‌ (23 బంతుల్లో 35 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), హార్దిక్‌ పాండ్యా (10 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్‌ షాట్‌లతో ఆకట్టుకున్నారు. క్రీజులో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ చూడచక్కటి షాట్‌లతో చెలరేగారు.

మరోవైపు.. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో విఫలమైన వికెట్‌కీపర్‌ సంజూ శాంసన్‌ ఈమ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగలేదు. అతడి స్థానంలో ఆడిన ఇషాన్‌ కిషన్‌ మెరుపు హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో ప్రపంచకప్‌ ప్రారంభపోరులో శనివారం అమెరికాపై అభిషేక్‌తో కలిసి ఇషాన్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించడం దాదాపు ఖాయమే.

210 పరుగులు
అనంతరం భారీ లక్ష్యఛేదనలో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లకు 210 పరుగులు చేసింది. కెప్టెన్‌ మార్క్‌రమ్‌ (19 బంతుల్లో 38; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), రికెల్టన్‌ (21 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), జాసన్‌ స్మిత్‌ (23 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్‌), స్టబ్స్‌ (21 బంతుల్లో 45 నాటౌట్‌; 1 ఫోర్, 4 సిక్స్‌లు) తలాకొన్ని పరుగులు చేశారు. 9 మంది భారత బౌలర్లు బౌలింగ్‌ చేయగా... అభిషేక్‌ శర్మకు రెండు వికెట్లు దక్కాయి.

మోకాలి నొప్పి?
అయితే, ఈ మ్యాచ్‌లో హర్షిత్‌ రాణా ఒక్క ఓవర్‌ మాత్రమే వేసి నిష్క్రమించాడు. తన ఓవర్లో పదహారు పరుగులు సమర్పించుకున్న ఈ రైటార్మ్‌ పేసర్.. బౌలింగ్‌ చేసే సమయంలో అసౌకర్యానికి గురయ్యాడు. మోకాలి నొప్పితో అతడు బాధపడినట్లు కనిపించింది. తన ఓవర్‌ పూర్తి చేసుకున్న వెంటనే హర్షిత్‌ రాణా మైదానం వీడాడు. అతడు కోలుకోవడానికి ఇంకో రెండు రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే, హర్షిత్‌ గాయం గురించి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు. కాగా లోయర్‌ ఆర్డర్‌లో ఎనిమిదో స్థానంలో చక్కగా బ్యాటింగ్‌ చేయడంతో పాటు.. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతినిచ్చిన సమయంలో హర్షిత్‌ రాణా సేవలు అందిస్తున్నాడు. ప్రధాన మ్యాచ్‌లలో బుమ్రాకు తోడుగా అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా రొటేషన్‌ పద్ధతిలో తుదిజట్టులోకి వస్తున్నారు. 

చదవండి: భారత్‌ను పదోసారి ఫైనల్‌కు చేర్చిన ఈ 'ఆరోన్‌ జార్జ్‌' ఎవరు..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement