భారత్‌ను పదోసారి ఫైనల్‌కు చేర్చిన ఈ 'ఆరోన్‌ జార్జ్‌' ఎవరు..? | Special story on team India under 19 world cup semi final hero Aaron George | Sakshi
Sakshi News home page

భారత్‌ను పదోసారి ఫైనల్‌కు చేర్చిన ఈ 'ఆరోన్‌ జార్జ్‌' ఎవరు..?

Feb 5 2026 9:26 AM | Updated on Feb 5 2026 9:41 AM

Special story on team India under 19 world cup semi final hero Aaron George

అండర్‌ 19 ప్రపంచకప్‌లో భారత్‌ పదోసారి ఫైనల్‌కు చేరింది. ఈ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టూ ఇన్ని సార్లు ఫైనల్స్‌కు చేరలేదు. ఇందులో టీమిండియా ఐదు సార్లు (2000, 2008, 2012, 2018, 2022) ఛాంపియన్‌గా నిలిచి, నాలుగు సందర్భాల్లో (2006, 2016, 2020, 2024) రన్నరప్‌గా నిలిచింది. ఏ జట్టూ ఇన్ని సార్లు ఛాంపియన్‌గా, రన్నరప్‌గానూ నిలవలేదు. యంగ్‌ ఇండియా మరోసారి ఫైనల్‌కు చేరి అండర్‌ 19 ప్రపంచకప్‌ చరిత్రలో తిరుగులేని జట్టుగా తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది.

నిన్న జరిగిన 2026 ఎడిషన్‌ రెండో సెమీఫైనల్లో భారత్‌ ఆఫ్ఘనిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ ఆరోన్‌ జార్జ్‌ అద్భుత శతకం (104 బంతుల్లో 115; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించి భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. 311 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆరోన్‌ ఏమాత్రం తడబడకుండా ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. 

మరో ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీతో (33 బంతుల్లో 68; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) కలిసి తొలి వికెట్‌కు 90 పరుగులు, వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఆయుశ్‌ మాత్రేతో (59 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) కలిసి రెండో వికెట్‌కు 114 పరుగులు, ఆతర్వాత వేదాంత్‌ మల్హోత్రాతో (47 బంతుల్లో 38 నాటౌట్‌; 3 ఫోర్లు) కలిసి 96 పరుగులు జోడించి, భారత్‌ గెలుపు ఖరారయ్యాక మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. మొత్తంగా ఆరోన్‌ వన్‌మ్యాన్‌ షో కారణంగా భారత్‌ 41.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

అత్యుత్తమ ఛేదన
ఈ ఛేదన అండర్‌ 19 వరల్డ్‌కప్‌ చరిత్రలోనే అత్యధికం, అత్యుత్తమం. గతంలో ఏ జట్టూ ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించలేదు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్‌ పేరిట ఉండేది. 2006 ఎడిషన్‌లో ఐర్లాండ్‌ నిర్దేశించిన 305 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ ఛేదించింది.

ఆఫ్ఘన్‌ ఆటగాళ్లు శతకాలు వృధా
అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్‌ టాస్‌ గెలిచి తొలి బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 310 పరుగులు సాధించింది. ఫైజల్‌ షినోజాదా (110), ఉజైరుల్లా నియాజాయ్‌ (101 నాటౌట్‌) శతకాలతో రాణించారు. భారత బౌలర్లలో దీపేశ్‌ దేవేంద్రన్‌, కనిష్క్‌ చౌహాన్‌ తలో 2 వికెట్లు తీశారు. ఆరోన్‌ అద్భుత సెంచరీతో భారత్‌ను గెలిపించడంతో ఫైజల్‌, ఉజైరుల్లా శతకాలు వృధా అయ్యాయి.

ఇంగ్లండ్‌తో అమీతుమీ
తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌ ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. బులవాయోలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 27 పరుగుల తేడాతో  ఆసీస్‌ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మొదట ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసింది.

ఇంగ్లండ్‌ కెప్టెన్‌ థామస్‌ ర్యూ (107 బంతుల్లో 110; 14 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ సాధించాడు. అనంతరం 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 47.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్‌ ఒలివర్‌ పీక్‌ (88 బంతుల్లో 100; 10 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. ఇక శుక్రవారం (ఫిబ్రవరి 6) జరిగే ఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకుంటాయి.

భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన ఈ ఆరోన్‌ జార్జ్‌ ఎవరు..?
ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన సెమీఫైనల్లో సూపర్‌ సెంచరీతో భారత్‌ను ఫైనల్స్‌కు చేర్చిన ఆరోన్‌ జార్జ్‌ గురించి తెలుసుకునేందుకు క్రికెట్‌ అభిమానులు తెగ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. తాజా సెంచరీ తర్వాత చాలామంది ఆరోన్‌ గురించిన సమాచారం కోసం గూగుల్‌ చేస్తున్నారు.

మన హైదరాబాదీనే..!
19 ఏళ్ల ఆరోన్ జార్జ్ పుట్టింది కేరళలో అయినా.. జానియ‌ర్ స్దాయిలో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. జార్జ్‌కు అద్భుత‌మైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఈ మిడిలార్డ‌ర్ ఆట‌గాడికి ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టు ఆడే స‌త్తా ఉంది. ముఖ్యంగా జ‌ట్టు క‌ష్టాల్లో ఉందంటే అంద‌రి చూపు జార్జ్‌పైనే ఉంటుంది.

సంజూ శాంసన్‌లా..!
అత‌డి బ్యాటింగ్ శైలి టీమిండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్‌ను పోలి ఉంటుంది. అదేవిధంగా అత‌డికి మంచి కెప్టెన్సీ స్కిల్స్ కూడా ఉన్నాయి. దాదాపు 38 ఏళ్ల తర్వాత కెప్టెన్‌గా హైద‌రాబాద్‌కు వినూ మాన్కడ్ ట్రోఫీని ఆరోన్ అందించాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీ(2022-23)లో బీహార్‌పై ట్రిపుల్ సెంచరీ సాధించి తొలిసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు.

పరుగుల వరద
గత రెండు సీజన్లలో కలిపి 700 పైగా పరుగులు చేసి హైదరాబాద్ జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. అంతేకాకుండా గత నెలలో  బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరిగిన అండర్-19 ట్రై-సిరీస్‌లో ఇండియా-బి జట్టుకు కెప్టెన్‌గా కూడా  వ్యవహరించాడు.

అప్పడు పాక్‌పై..
ఆసియాకప్ 2025లోనూ పాకిస్తాన్‌పై 85 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఐపీఎల్‌-2026 వేలంలో మాత్రం జార్జ్ అమ్ముడుపోలేదు. రూ.30 ల‌క్ష‌ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వ‌చ్చిన అత‌డిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూప‌లేదు. ఒక‌వేళ ఎవ‌రైనా గాయ‌ప‌డితే జార్జ్‌ను ప్ర‌త్న‌మ్నాయంగా తీసుకునే అవ‌కాశ‌ముంది.
 

Advertisement
 
Advertisement
Advertisement