WC 2026: భారత బౌలర్లు విఫలం.. అఫ్గనిస్తాన్‌ భారీ స్కోరు | U19 WC 2026 IND v AFG Semis: Faisal Uzairullah Centuries Afg Record | Sakshi
Sakshi News home page

WC 2026 IND vs AFG: భారత బౌలర్లు విఫలం.. అఫ్గనిస్తాన్‌ భారీ స్కోరు

Feb 4 2026 4:58 PM | Updated on Feb 4 2026 5:29 PM

U19 WC 2026 IND v AFG Semis: Faisal Uzairullah Centuries Afg Record

శతక్కొట్టిన ఫైజల్‌ (PC: ICC)

ఐసీసీ అండర్‌-19 వరల్డ్‌కప్‌-2026 టోర్నమెంట్‌ సెమీ ఫైనల్లో భారత బౌలర్లు తేలిపోయారు. అఫ్గనిస్తాన్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఇందుకు తోడు భారత జట్టు ఫీల్డింగ్‌ తప్పిదాలతో అఫ్గన్‌ బ్యాటర్లుకు లైఫ్‌ ఇచ్చింది. ఫలితంగా అఫ్గనిస్తాన్‌ భారీ స్కోరు సాధించింది.

శతక్కొట్టిన ఫైజల్‌ షినోజాదా
జింబాబ్వేలోని హరారే వేదికగా వరల్డ్‌కప్‌ రెండో సెమీస్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన అఫ్గనిస్తాన్‌ బ్యాటింగ్‌ ఎంచుకుని.. భారత్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు ఒస్మాన్‌ సదాత్‌ (39), ఖలీద్‌ అహ్మద్‌జాయ్‌ (31) శుభారంభం అందించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఫైజల్‌ షినోజాదా (Faisal Shinozada) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

ఉజైరుల్లా అజేయ శతకం
మొత్తంగా 93 బంతులు ఎదుర్కొన్న ఫైజల్‌.. 15 ఫోర్ల సాయంతో 110 పరుగులు సాధించాడు. మరోవైపు.. రనౌట్‌ ప్రమాదాల నుంచి తప్పించుకున్న నాలుగో నంబర్‌ బ్యాటర్‌ ఉజైరుల్లా నియాజాయ్‌ (Uzairullah Niazai) సైతం శతకం పూర్తి చేసుకున్నాడు. కేవలం 86 బంతుల్లోనే 12 ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 101 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఫైజల్‌- ఉజైరుల్లా కలిసి మూడో వికెట్‌కు 130 బంతుల్లో 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా అఫ్గనిస్తాన్‌ ఆఖరి పది ఓవర్లలో ఏకంగా 111 పరుగులు రాబట్టింది. మొత్తంగా నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయిన అఫ్గన్‌ జట్టు ఏకంగా 310 పరుగులు సాధించింది.

ఈ ఎడిషన్‌లో ఇదే  అత్యధిక స్కోరు
అండర్‌-19 వరల్డ్‌కప్‌ నాకౌట్‌ మ్యాచ్‌లలో తాజా ఎడిషన్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇక భారత బౌలర్లలో దీపేశ్‌ దేవేంద్రన్‌, కనిష్క్‌ చౌహాన్‌ చెరో రెండు వికెట్లు తీశారు. అఫ్గన్‌ విధించిన 311 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తేనే భారత్‌ ఫైనల్లో అడుగుపెట్టగలదు.ఇదిలా ఉంటే.. మంగళవారం నాటి తొలి సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లండ్‌ ఫైనల్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.

చదవండి: WC 2026: ఆసీస్‌ అవుట్‌.. వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement