అండర్ 19 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 1) జరిగిన మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్‌పై 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సెమీఫైనల్‌కు కూడా అర్హత సాధించింది.
బులవాయో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. వేదాంత్ త్రివేది (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఆఖర్లో కనిష్క్ చౌహాన్ (35), ఖిలన్ పటేల్ (21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.
భారత బ్యాటర్లలో ఆరోన్ జార్జ్ (16), కెప్టెన్ ఆయుశ్ మాత్రే (0), అభిగ్యాన్ కుందు (16), దీపేశ్ దేవేంద్రన్ (1) విఫలం కాగా.. వైభవ్ సూర్యవంశీ (30), విహాన్ మల్హోత్రా (21), అంబ్రిష్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్ 3, మొహమ్మద్ సయ్యద్ 2, అలీ రజా, అహ్మద్ హుసేన్, మొమిన్ ఖమార్, అలీ హస్సన్ బలోచ్ తలో వికెట్ తీశారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో పాక్ తొలుత విజయం దిశగా సాగింది. అయితే మధ్యలో భారత స్పిన్నర్లు ఖిలన్ పటేల్ (9.2-1-35-3), ఆయుశ్ మాత్రే (8-0-21-3), కనిష్క్ చౌహాన్ (10-1-30-1), విహాన్ మల్హాత్రా (4-0-15-1) చెలరేగడంతో పాక్‌కు ఓటమి తప్పలేదు. పేసర్లు అంబ్రిష్ (5-0-26-1), హెనిల్ పటేల్ (5-0-30-1) కూడా రాణించడంతో పాక్ 46.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది.
పాక్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖాన్ (66) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. హమ్జా జహూర్ (42), కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ (38) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ ఓటమితో పాక్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించగా.. గ్రూప్-2 నుంచి భారత్, ఇంగ్లండ్ సెమీస్‌కు అర్హత సాధించాయి.
గ్రూప్-1 నుంచి ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ బెర్త్‌లు దక్కించుకున్నాయి. ఫిబ్రవరి 4న జరిగే రెండో సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ భారత్‌ను ఢీకొంటుంది. 3న జరిగే తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా,ఇంగ్లండ్ తలపడతాయి.


