ఈ ఏడాది ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరుగనున్న మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు స్కాట్లాండ్, ఐర్లాండ్ అర్హత సాధించాయి. నేపాల్‌లో జరుగుతున్న క్వాలిఫయర్ పోటీల ద్వారా ఈ రెండు జట్లు ప్రపంచకప్ బెర్త్ దక్కించుకున్నాయి. ఈ టోర్నీ నుంచి బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు కూడా ప్రపంచకప్ అర్హత సాధించాయి.
ఇవాళ (ఫిబ్రవరి 1) జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో అమెరికా పై విజయం సాధించడంతో స్కాట్లాండ్ ప్రపంచకప్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకుంది. ఈ మ్యాచ్‌లో స్కాట్లండ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటి అమెరికాను మట్టికరిపించింది.
మరోవైపు థాయ్‌లాండ్‌పై గెలుపుతో ఐర్లాండ్ ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ తక్కువ స్కోరే చేసిన, దాన్ని విజయవంతంగా కాపాడుకుంది. కాగా, ఈ గ్లోబల్ క్వాలిఫయర్ టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొనగా.. బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, ఐర్లాండ్ టాప్-4లో నిలిచి ప్రపంచకప్ టికెట్ దక్కించుకున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్తాన్, శ్రీలంక నేరుగా ప్రపంచకప్ అర్హత సాధించాయి.
కాగా, జూన్ 12న బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్-శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్‌తో మహిళల టీ20 ప్రపంచకప్ 2026 మొదలవుతుంది. ఈ టోర్నీలో జూన్ 14న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. ఈ టోర్నీలో న్యూజిలాండ్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. చివరిగా జరిగిన 2024 ఎడిషన్‌లో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌కు ఇదే తొలి టైటిల్. ఆ ఎడిషన్ ఫైనల్లో న్యూజిలాండ్ సౌతాఫ్రికాను ఓడించి, జగజ్జేతగా అవతరించింది.


