అనూహ్య పరిస్థితుల్లో స్కాట్లాండ్ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. భద్రతా కారణాలు చూపుతూ బంగ్లాదేశ్ తీసుకున్న నిర్ణయం స్కాట్లాండ్ పాలిట వరంగా మారింది. ర్యాంకుల ఆధారంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఈ జట్టును ప్రపంచకప్ టోర్నీలో చేర్చింది.
రిచీ బెరింగ్టన్ సారథ్యంలో
ఈ నేపథ్యంలో స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు వరల్డ్‌కప్ టోర్నీ కోసం పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. రిచీ బెరింగ్టన్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. జైనుల్లా ఎహ్సాన్‌కు తొలిసారి జట్టులో చోటు దక్కింది. అఫ్గనిస్తాన్‌లో జన్మించిన ఈ ఫాస్ట్‌బౌలర్ ఇటీవలే స్కాట్లాండ్ తరఫున ఆడేందుకు అర్హత సాధించాడు.
న్యూజిలాండ్ మాజీ ఆటగాడు సైతం
అంతేకాకుండా న్యూజిలాండ్ మాజీ ఆటగాడు టామ్ బ్రూస్ కూడా ఈ జట్టులో స్థానం సంపాదించాడు. అతడి రాకతో స్కాటిష్ జట్టు బ్యాటింగ్ లైనప్ బలపడినట్లయింది. 34 ఏళ్ల టామ్ న్యూజిలాండ్ తరఫున 17 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
ఇదిలా ఉంటే.. స్కాట్లాండ్ టీ20 ప్రపంచకప్ టోర్నీలో భాగం కానుండటం ఇది ఏడోసారి. అయితే, ఈసారి ఈ యూరోపియన్ జట్టు నేరుగా అర్హత సాధించకుండా.. బంగ్లాదేశ్‌ను ఐసీసీ తొలగించడం ద్వారా తమ ర్యాంకు ఆధారంగా క్వాలిఫై అయింది.
బంగ్లాదేశ్ ఆటగాళ్ల పట్ల సానుభూతి
ఈ విషయంపై క్రికెట్ స్కాట్లాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రూడీ లిండ్‌బ్లేడ్ స్పందించారు. బంగ్లాదేశ్ జట్టు పట్ల తమకు సానుభూతి ఉందని ఆమె తెలిపారు. ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘ఈ విధంగా వరల్డ్‌కప్ టోర్నీలో పాల్గొనాలని మేము అనుకోలేదు.
క్వాలిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసి ఈవెంట్లో అడుగుపెట్టాలని భావించాము. అయితే, అనుకోని విధంగా మాకు ఆహ్వానం వచ్చింది. ఏదేమైనా బంగ్లాదేశ్ ఆటగాళ్ల పట్ల మాకు సానుభూతి ఉంది. వారి విషయంలో జరిగిన దానికి మేము చింతిస్తున్నాం’’ అని ట్రూడీ తెలిపారు.
మేమేమీ తక్కువ కాదు
అయితే, తమ జట్టు కూడా తక్కువేమీ కాదని.. ప్రపంచంలో తాము పద్నాలుగో ర్యాంకులో ఉన్నట్లు ట్రూడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కష్టం లేకుండానే తాము టీ20 వరల్డ్‌కప్ ఆడబోతున్నామంటూ వస్తున్న విమర్శలు సరికావని.. గత కొన్నేళ్లుగా తాము అద్భుత విజయాలు సాధిస్తూ ఈ స్థాయికి చేరుకున్నామని తెలిపారు.
కాగా భారత్‌తో తమకు భద్రత లేదంటూ.. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాల్సిందిగా బంగ్లాదేశ్ పట్టు పట్టింది. ఇందుకు నిరాకరించిన ఐసీసీ.. బంగ్లాను టోర్నీ నుంచి తొలగించి స్కాట్లాండ్‌తో ఆ స్థానాన్ని భర్తీ చేసింది. ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు భారత్- శ్రీలంక వేదికలుగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీ జరుగనుంది.
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి స్కాట్లాండ్ జట్టు
రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), టామ్ బ్రూస్, మాథ్యూ క్రాస్, బ్రాడ్లీ క్యూరీ, ఆలివర్ డేవిడ్సన్, క్రిస్ గ్రీవ్స్, జైనుల్లా ఎహ్సాన్, మైకేల్ జోన్స్, మైకేల్ లీస్క్, ఫిన్లే మెక్‌క్రీత్, బ్రాండన్ మెకల్లెన్, జార్జ్ మున్సే, సఫ్యాన్ షరీఫ్, మార్క్ వాట్, బ్రాడ్లీ వీల్.
ట్రావెలింగ్ రిజర్వ్‌లు: జాస్పర్ డేవిడ్‌సన్, జాక్ జార్విస్
నాన్-ట్రావెలింగ్ రిజర్వ్‌లు: మెకెంజీ జోన్స్, క్రిస్ మెక్‌బ్రైడ్, చార్లీ టియర్.
చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్ అవుట్.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్!


