గౌతమ్ గంభీర్.. భారత క్రికెట్ చరిత్రలో ఒక ప్లేయర్‌గా, హెడ్‌కోచ్‌గా ప్రత్యేక పేజీలను లిఖించుకున్నాడు. సభ్యునిగా టీ20 ప్రపంచకప్-2007, వన్డే ప్రపంచకప్-2011 గెలుచుకున్న గంభీర్.. ఇప్పుడు కోచ్‌గా టీమిండియాకు రెండు ఐసీసీ టైటిల్స్‌ను అందించాడు. అతడి నేతృత్వంలో భారత జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025తో పాటు ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది.
దీంతో రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన తొలి భారత కోచ్‌గా అతడు చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. గంభీర్‌కు వన్డే ప్రపంచకప్-2027 అసలైన సవాల్ ఎదురుకానుందని గంగూలీ అభిప్రాయపడ్డాడు.
వైట్‌వాల్ క్రికెట్‌లో గంభీర్‌కు అసలైన పరీక్షకు వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో ఎదురుకానుంది. అక్కడి పరిస్థితులు జట్టును, కోచ్‌ను తీవ్రంగా పరీక్షిస్తాయి. అయితే గంభీర్ వద్ద ఉన్న జట్టుపై నాకు పూర్తి నమ్మకం ఉంది. అతడు కోచ్‌గా మరోసారి ఖచ్చితంగా సాధిస్తాడని గంగూలీ పేర్కొన్నాడు.
కాగా వన్డే వరల్డ్‌కప్-2023 టైటిల్‌ను తృటిలో కోల్పోయిన భారత జట్టు.. వచ్చే ఏడాది జరగనున్న 50 ఓవర్ల ప్రపంచకప్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. అంతేకాకుండా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఇదే చివరి వన్డే వరల్డ్ కప్ కానుండడంతో భారత్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే టెస్టుల్లో మాత్రం గంభీర్ తన శైలిని మార్చుకోవాలని గంగూలీ సూచించాడు. "టెస్టుల్లో గంభీర్ ఇంకా మెరుగుపడాలి. ముఖ్యంగా పిచ్ ఎలా ఉంటుందనే ఆలోచనను పక్కన పెట్టాలి. పిచ్‌ను ఒక భూతంలా చూడటం మానేయాలి. స్వదేశంలో జరిగే మ్యాచుల కోసం స్పిన్నర్లకు అనుకూలించే టర్నింగ్ వికెట్లు అవసరం లేదు.
మంచి వికెట్లపై ఆడితేనే మంచి ఫలితాలు వస్తాయి. ఇంగ్లండ్ సిరీస్ ఫలితాలే అందుకు నిదర్శనమని గంగూలీ చెప్పుకొచ్చాడు. కాగా గంభీర్ నేతృత్వంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లను భారత్ కోల్పోయింది.
చదవండి: BAN vs PAK: ప్రతీకారం తీర్చుకున్న పాకిస్తాన్


