టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పొట్టి క్రికెట్ మజాను ఆస్వాదించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే, అంతకంటే ముందుగానే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB).. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)ల మధ్య వ్యవహారం ఈ ఐసీసీ ఈవెంట్‌పై మరింత చర్చకు దారితీసింది.
భారత్- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు వరల్డ్‌కప్ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తమ ఆటగాళ్లను భారత్‌కు పంపబోమని.. తమ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడించాలని బీసీబీ ఐసీసీకి విజ్ఞప్తి చేసింది.
బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించిన ఐసీసీ
అయితే, భారత్‌లో బంగ్లా జట్టుకు వచ్చిన ఇబ్బందేమీ లేదని చెప్పిన ఐసీసీ.. తుది నిర్ణయం తీసుకోవాల్సిందిగా బీసీబీకి గడువు ఇచ్చింది. అయితే, బీసీబీ మాత్రం మొండిపట్టు పట్టింది. తమ ప్రభుత్వం చెప్పినట్లుగానే తమ ఆటగాళ్లను భారత్‌కు పంపబోమని స్పష్టం చేసింది. ఇందుకు స్పందనగా బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించి ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను చేరుస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
పీసీబీ ఓవరాక్షన్
ఈ ఎపిసోడ్ మొత్తంలో బీసీబీ కంటే కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అతి చేసింది. బంగ్లాదేశ్‌కు ఐసీసీ అన్యాయం చేసిందంటూ.. బోర్డు మొత్తం ఒకవైపు ఉంటే.. పాక్ మాత్రం బంగ్లాకు అనుకూలంగా ఓటు వేసింది.
అంతేకాదు బంగ్లాదేశ్‌ను ఆడించకపోతే తామూ టోర్నీ బహిష్కరిస్తామంటూ బెదిరింపులకు దిగింది. నిజానికి ముందుగా అనుకున్న ఒప్పందం (భారత్- పాక్ వేదికల హైబ్రిడ్ మోడల్) ప్రకారం.. పాక్‌కు ఇప్పటికే తటస్థ వేదికగా శ్రీలంకను ఏర్పాటు చేసింది ఐసీసీ.
అయినప్పటికీ బంగ్లాదేశ్‌కు వత్తాసు పలుకుతూ భారత్ మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తోందని పాక్ బోర్డుపై ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో తమ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం.. ఈ శుక్రవారం లేదంటే వచ్చే సోమవారం నాటికి టోర్నీలో ఆడే విషయంపై నిర్ణయం వెల్లడిస్తామంటూ పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ సోమవారం ట్వీట్ చేశాడు.
ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ పాక్ టోర్నీ నుంచి తప్పుకొంటే.. ఆ స్థానంలో బంగ్లాదేశ్ రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. హిందుస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం..
ఊహించని ట్విస్టు
‘‘ఒకవేళ పాకిస్తాన్ టోర్నీ నుంచి వైదొలగాలని భావిస్తే.. గ్రూప్-ఎలో ఆ జట్టు స్థానాన్ని బంగ్లాదేశ్ భర్తీ చేసే అవకాశం ఉంది. పాక్ తప్పుకొంటే... బీసీబీ ముందు నుంచి కోరినట్లుగా పాక్ స్థానంలో బంగ్లాదేశ్ శ్రీలంకలో తమ మ్యాచ్‌లు ఆడేందుకు వీలు కలుగుతుంది.
అయితే, ఈ ప్రక్రియలో కొన్ని సమస్యలు తలెత్తినా అంతిమంగా ఓ పరిష్కారం అయితే దొరుకుతుంది’’ అని ఐసీసీ సన్నిహిత వర్గాలు విశ్లేషించాయి.
ఒప్పందం అతిక్రమిస్తే.
అంతేకాదు.. ‘‘ఇప్పటికే భారత్- పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల మ్యాచ్‌లకు తటస్థ వేదికలను ఐసీసీ ఏర్పాటు చేస్తోంది. ఇప్పుడు కూడా టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్‌కు బదులు శ్రీలంకలో పాక్ తమ మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ సిద్ధం చేశారు.
అయినప్పటికీ పాక్ తప్పుకొంటే.. ఒప్పందాన్ని పాక్ బోర్డు ఉల్లంఘించినట్లే అవుతుంది. కాబట్టి వారికి మున్ముందు మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఏదో చేయబోతే ఇంకేదో అయింది అన్నట్లు.. బీసీసీఐ మీదకు బంగ్లాదేశ్‌ను రెచ్చగొట్టే ప్రయత్నంలో తమ నెత్తి మీద తామే పిడుగు వేసుకున్నట్లు పాక్ పరిస్థితి మారిందని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
బీసీబీ- పీసీబీ.. ఈ రెండింటిలో భస్మాసురహస్తం ఎవరిదో అంటూ నెటిజన్లు జోకులు వేస్తున్నారు. మరోవైపు.. పాక్‌ది మేకపోతు గాంభీర్యం మాత్రమేనని.. ఏదో ఓవరాక్షన్ చేసినా అంతిమంగా టోర్నీలో ఆడేందుకు మొగ్గు చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చదవండి: ICC: వెనక్కి తగ్గిన బంగ్లాదేశ్.. ఆ పని చేయబోము
ICC vs Bangladesh: అసలేం జరిగింది.. కథనాల కోసం క్లిక్ చేయండి


