టీ20 ప్రపంచకప్-2026 నుంచి తమ జట్టును తప్పించడంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) సవాలు చేయబోవడం లేదు. ఈ మేరకు బీసీబీ మీడియా కమిటీ చైర్మన్ అంజాద్ హుస్సేన్ ఒక ప్రకటన విడుదల చేశారు.
డీఆర్‌సీని సంప్రదించినా..
వచ్చే నెల 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఆతిథ్య భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు నిరాకరించడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) బంగ్లాదేశ్‌ను తప్పించింది. బంగ్లాదేశ్ స్థానంలో ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్ జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీనిపై బంగ్లా బోర్డు ఐసీసీ వివాద పరిష్కారాల కమిటీ (డీఆర్‌సీ)ని సంప్రదించినా ఫలితం లేకపోయింది.
అంగీకరిస్తున్నాం
ఈ క్రమంలో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్ (CAS)కు వెళ్లాలని ముందు అనుకున్న బీసీబీ... ప్రస్తుతం అలాంటి ప్రయత్నాలు విరమించుకుంది. ‘ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాం. ముందు నుంచి భారత్‌లో ఆడబోమని చెబుతూనే ఉన్నాం. అయినా మా వాదన వినిపించుకోలేదు. దీనిపై ఆర్బిట్రేషన్‌కు వెళ్లే ఉద్దేశం లేదు’ అని అంజాద్ అన్నారు.
ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకొనే భారత్‌లో మ్యాచ్‌లు ఆడకూడదని నిర్ణయించుకున్నామని... ఇది తమ ప్రభుత్వ నిర్ణయమని పేర్కొన్నారు. ‘ఐసీసీ బోర్డు మీటింగ్ జరిగిన తర్వాత మంత్రివర్గ భేటీలో వరల్డ్‌కప్ మ్యాచ్‌ల కోసం భారత్‌లో పర్యటించే అంశంపై చర్చ జరిగింది. భారత్‌లో ఆడేందుకు క్యాబినెట్ అంగీకరించలేదు. అదే విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లాం’ అని అంజాద్ వివరించారు.
చదవండి: హరీస్ రవూఫ్‌పై వేటు


