క్వార్టర్స్‌కు సాత్విక్‌–చిరాగ్‌ జోడీ | Satwik and Chirag pair into quarters at Swiss Open badminton tournament | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌కు సాత్విక్‌–చిరాగ్‌ జోడీ

Mar 13 2026 1:45 AM | Updated on Mar 13 2026 1:45 AM

Satwik and Chirag pair into quarters at Swiss Open badminton tournament

స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌

బాసెల్‌: స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు.  గురువారం హోరాహోరీగా జరిగిన పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో టాప్‌ సీడ్‌ భారత జంట 21–15, 15–21, 28–26తో హిరోకి ఒకముర–క్యొహే యామషిత (జపాన్‌) ద్వయంపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో తరుణ్‌ మన్నెపల్లి ప్రిక్వార్టర్స్‌ చేరగా, మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్‌కు తొలిరౌండ్లోనే చుక్కెదురైంది. 

ప్రపంచ 43వ ర్యాంకర్‌ తరుణ్‌ 16–21, 21–16, 7–2తో తనకన్నా మెరుగైన ప్రత్యర్థి, ఐదో సీడ్‌ కెంట నిషిమొటో (జపాన్‌)పై ఆధిక్యంలో ఉండగా భుజం గాయంతో జపాన్‌ ఆటగాడు రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. ప్రిక్వార్టర్స్‌లో కిరణ్‌ జార్జ్‌ 18–21, 21–16, 16–21తో జాసన్‌ గునవన్‌ (హాంకాంగ్‌) చేతిలో ఓటమి పాలయ్యాడు. 

మహిళల సింగిల్స్‌ మొదటి రౌండ్‌లో మాళవిక బన్సోద్‌ 11–21, 15–21తో థాయ్‌లాండ్‌కు చెందిన ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ పొర్న్‌పవీ చొచువాంగ్‌ చేతిలో పరాజయం చవిచూసింది. పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో ఎమ్‌.ఆర్‌.అర్జున్‌–హరిహరన్‌ జోడీ 17–21, 11–21తో చెన్‌ చెంగ్‌ కున్‌–లిన్‌ బింగ్‌ వీ (చైనీస్‌ తైపీ) జంట చేతిలో ఓడింది.   

Advertisement
 
Advertisement
Advertisement