ఇండియన్‌వెల్స్ (అమెరికా): భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రీ తొలిసారి ఏటీపీ మాస్టర్స్–1000 టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. స్వీడెన్ ప్లేయర్ గొరన్సన్‌తో జోడీ కట్టిన భారత ఆటగాడు క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రత్యర్థి జంటపై గెలుపొందింది. గురువారం ఇక్కడ జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్–స్వీడెన్ ద్వయం 6–3, 7–6తో అలెగ్జాండర్ ఎర్లెర్ (ఆ్రస్టేలియా)–అండ్రియా వవసొరి (ఇటలీ) జంటపై విజయం సాధించింది. సరిగ్గా గంటన్నర పాటు జరిగిన ఈ పోరులో యూకీ జోడీ అద్భుతంగా రాణించింది.
రెండో సెట్‌లో ఆసీస్–ఇటాలీయన్ జంట పుంజుకోవడంతో పోటీ నువ్వానేనా అన్నట్లు సాగింది. కీలకమైన సమయంలో వరుసగా పాయింట్లు సాధించడంతో టైబ్రేక్‌కు దారితీయకుండా మ్యాచ్‌లో విజయం సాధించారు. గతంలో ఏటీపీ మాస్టర్స్–1000 టోర్నీలో క్వార్టర్స్ దశలోనే యూకీ వెనుదిరిగాడు. రెండు సార్లు క్వార్టర్స్‌తోనే సరిపెట్టుకున్న యూకీ ఇప్పుడు స్వీడెన్ ఆటగాడితో కలిసి సెమీస్ చేరాడు.


