ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ యూకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. మెల్‌బోర్న్‌లో బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో పదో సీడ్ యూకీ బాంబ్రీ (భారత్)–ఆండ్రీ గొరాన్‌సన్ (స్వీడన్) ద్వయం 6–3, 6–4తో జేమ్స్ డక్‌వర్త్–క్రూజ్ హెవిట్ (ఆస్ట్రేలియా) జంటపై నెగ్గింది.
57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో–స్వీడిష్ జోడీ ఆరు ఏస్‌లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. తమసర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోకుండా ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. 26 విన్నర్స్ కొట్టిన యూకీ–గొరాన్‌సన్ మూడు అనవసర తప్పిదాలు చేశారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ విభాగంలో యూకీ ఆడటం ఇది ఐదోసారి.
తొలిసారి మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జతగా 2014లో ఆడిన యూకీ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. తొమ్మిదేళ్ల తర్వాత 2023లో సాకేత్ మైనేని (భారత్)తో కలిసి మళ్లీ ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడిన యూకీ తొలి రౌండ్ దాటలేదు. 2024లో రాబిన్ హాస్ (నెదర్లాండ్స్)తో, 2025లో అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్)తో కలిసి బరిలోకి దిగిన యూకీ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాడు.
డబ్ల్యూపీఎల్‌లో నేడు
యూపీ వారియర్స్ x గుజరాత్ జెయింట్స్
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం


