అల్‌కరాజ్‌ కొత్త చరిత్ర | Alcaraz won his first Australian Open title | Sakshi
Sakshi News home page

అల్‌కరాజ్‌ కొత్త చరిత్ర

Feb 2 2026 2:19 AM | Updated on Feb 2 2026 2:20 AM

Alcaraz won his first Australian Open title

‘కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌’ పూర్తి చేసుకున్న స్పెయిన్‌ స్టార్‌

ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు

తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ హస్తగతం

ఫైనల్లో సెర్బియా దిగ్గజం జొకోవిచ్‌పై విజయం

రూ. 26 కోట్ల 55 లక్షల ప్రైజ్‌మనీ సొంతం

మెల్‌బోర్న్‌: పురుషుల టెన్నిస్‌ చరిత్రలో స్పెయిన్‌ స్టార్, ప్రపంచ నంబర్‌వన్‌ అల్‌కరాజ్‌ కొత్త రికార్డు నెలకొల్పాడు. టెన్నిస్‌లోని నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల టైటిల్స్‌ను సాధించిన అతిపిన్న వస్కుడిగా (22 ఏళ్ల 272 రోజులు) అల్‌కరాజ్‌ చరిత్ర సృష్టించాడు. ఆదివారం ముగిసిన ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ టోర్నీలో ఈ స్పెయిన్‌ స్టార్‌ తొలిసారి విజేతగా అవతరించాడు. 

10 సార్లు చాంపియన్, 24 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన సెర్బియా దిగ్గజం జొకోవిచ్‌తో జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో అల్‌కరాజ్‌ 2–6, 6–2, 6–3, 7–5తో గెలుపొందాడు. విజేత అల్‌కరాజ్‌కు 41,50,000 ఆ్రస్టేలియన్‌ డాలర్లు (రూ. 26 కోట్ల 55 లక్షలు), రన్నరప్‌ జొకోవిచ్‌కు 21,50,000 ఆ్రస్టేలియన్‌ డాలర్లు (రూ. 13 కోట్ల 75 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.  అల్‌కరాజ్‌ కెరీర్‌లో ఇది ఏడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. 

ఇప్పటికే అతను ఫ్రెంచ్‌ (2024, 2025), వింబుల్డన్‌ (2023, 2024), యూఎస్‌ ఓపెన్‌ (2022, 2025)లను రెండుసార్లు చొప్పున గెలిచాడు. తాజా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌తో అల్‌కరాజ్‌ ‘కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌’ పూర్తి చేసుకున్న అతిపిన్న వయసు్కడిగా గుర్తింపు పొందాడు. 

వరాల్‌గా డాన్‌ బడ్జ్‌ (అమెరికా; 22 ఏళ్ల 363 రోజులు; 1938లో) పేరిట ఉన్న రికార్డును.... ఓపెన్‌ శకం (1968) మొదలయ్యాక నాదల్‌ (స్పెయిన్‌; 24 ఏళ్ల 88 రోజులు; 2010లో) పేరిట ఉన్న రికార్డులను ఈ స్పెయిన్‌ స్టార్‌ సవరించాడు. తాజా ఓటమితో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ (25) నెగ్గిన ఏకైక ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాలని ఆశించిన జొకోవిచ్‌కు నిరాశ ఎదురైంది.  

తొలి సెట్‌ కోల్పోయినా... 
ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరిన 10 సార్లూ విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు తుది పోరులో తొలి సారి ఓటమి ఎదురైంది. సెమీస్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ సినెర్‌ (ఇటలీ)పై ఐదు సెట్‌ల పోరులో గెలిచిన జొకోవిచ్‌ తొలి సెట్‌ను గెలిచి ఫైనల్లో శుభారంభం చేశాడు. అయితే 38 ఏళ్ల జొకోవిచ్‌తో పోలిస్తే ఎక్కువ ఫిట్‌గా ఉన్న అల్‌కరాజ్‌ రెండో సెట్‌ నుంచి తన అసలు ఆటతీరును ప్రదర్శించాడు. 

రెండో సెట్‌లో రెండుసార్లు... మూడో సెట్‌లో రెండుసార్లు జొకోవిచ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి అతను ఈ రెండు సెట్‌లు గెలిచాడు. నాలుగో సెట్‌లోని 12వ గేమ్‌లో జొకోవిచ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన అల్‌కరాజ్‌ సెట్‌తోపాటు విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.  

9 పురుషుల టెన్నిస్‌లో ‘కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌’ పూర్తి చేసుకున్న 9వ ప్లేయర్‌ అల్‌కరాజ్‌. ఈ జాబితాలో ఫ్రెడ్‌ పెర్రీ (బ్రిటన్‌; 1935లో), డాన్‌ బడ్జ్‌ (అమెరికా; 1938లో), రాడ్‌ లేవర్‌ (ఆస్ట్రేలియా; 1962లో), రాయ్‌ ఎమర్సన్‌ (ఆస్ట్రేలియా; 1964లో), అగస్సీ (అమెరికా; 1999లో), ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌; 2009లో),  నాదల్‌ (స్పెయిన్‌; 2010లో), జొకోవిచ్‌ (సెర్బియా; 2016లో) ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement