ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కోసం జొకోవిచ్, అల్‌కరాజ్ ‘ఢీ’
సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్‌పై సెర్బియా దిగ్గజం విజయం
5 గంటల 27 నిమిషాల పోరులో జ్వెరెవ్‌పై స్పెయిన్ స్టార్ గెలుపు
మెల్‌బోర్న్: ఒక్క విజయం సాధిస్తే... సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్... ప్రపంచ నంబర్‌వన్, స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్‌కరాజ్ చరిత్ర పుటల్లో తమ పేరును లిఖించుకుంటారు. టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో జొకోవిచ్ 11వసారి... అల్‌కరాజ్ తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆదివారం జరిగే ఫైనల్లో జొకోవిచ్‌తో అల్‌కరాజ్ తలపడతాడు. తుది పోరులో జొకోవిచ్ గెలిస్తే టెన్నిస్ చరిత్రలోనే అత్యధికంగా 25 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన ఏకైక ప్లేయర్‌గా అవతరిస్తాడు.
అల్‌కరాజ్ నెగ్గితే ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టిస్తాడు. శుక్రవారం జరిగిన రెండు అసాధారణ సెమీఫైనల్స్‌లో అద్భుత ఫలితాలు వచ్చాయి. 5 గంటల 27 నిమిషాలపాటు జరిగిన మొదటి సెమీఫైనల్లో అల్‌కరాజ్ 6–4, 7–6 (7/5), 6–7 (3/7), 6–7 (4/7), 7–5తో మూడో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ)పై విజయం సాధించాడు.
నిర్ణాయక ఐదో సెట్‌లో 5–4తో ఆధిక్యంలో నిలిచిన జ్వెరెవ్ పదో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని ఉంటే గెలిచేవాడు. కానీ పదో గేమ్‌లో జ్వెరెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన అల్‌కరాజ్ స్కోరును 5–5తో సమం చేశాడు. ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకొని 12వ గేమ్‌లో జ్వెరెవ్ సర్వీస్‌ను మరోసారి బ్రేక్ చేసి 7–5తో గెలుపు సొంతం చేసుకున్నాడు.
అతిపెద్ద వయస్కుడిగా...
డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినెర్ (ఇటలీ)తో 4 గంటల 9 నిమిషాలపాటు జరిగిన రెండో సెమీఫైనల్లో 10సార్లు విజేత జొకోవిచ్ 3–6, 6–3, 4–6, 6–4, 6–4తో విజయం సాధించాడు. 12 ఏస్‌లు సంధించిన జొకోవిచ్ 46 విన్నర్స్ కొట్టాడు. 16 సార్లు తన సర్వీస్‌లో బ్రేక్ పాయింట్లను కాపాడుకున్నాడు.
ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన 10 సార్లూ టైటిల్ గెలిచిన జొకోవిచ్ ఈ టోర్నీ చరిత్రలో తుది పోరుకు అర్హత పొందిన అతిపెద్ద వయస్కుడిగా (38 ఏళ్ల 241 రోజులు) రికార్డు సృష్టించాడు. కెన్ రోజ్‌వాల్ (37 ఏళ్ల 54 రోజులు –1972లో) పేరిట ఉన్న రికార్డును అతను బద్దలు కొట్టాడు.
నేడు ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్
సబలెంకా x రిబాకినా
మధ్యాహ్నం 2 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం


