breaking news
Australian Open 2026
-
ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ ఫైనల్.. ఎవరు గెలిచినా చరిత్రే
ఆస్ట్రేలియా ఓపెన్-2026లో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది. ఆదివారం మెల్బోర్న్లోని రాడ్ లేవర్ ఎరీనాలో జరగనున్న మెన్స్ సింగిల్స్ ఫైనల్లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్, టాప్‌సీడ్ కార్లోస్ అల్కరాజ్ అమీతుమీ తెల్చుకోనున్నారు. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచినా చరిత్రే అవుతుంది. ఈ తుది పోరులో జొకోవిచ్ గెలిస్తే తన 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను సాధిస్తాడు.తద్వారా జోకోవిచ్ టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ గెలిచిన ప్లేయర్‌గా మార్గరెట్ కోర్ట్ (24 టైటిల్స్)ను అధిగమిస్తాడు. అదేవిధంగా అతడికి ఇది 11వ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ అవుతుంది. మరోవైపు 22 ఏళ్ల అల్కరాజ్ ఈ టైటిల్‌ను కైవసం చేసుకుంటే, టెన్నిస్ చరిత్రలో నాలుగు వేర్వేరు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టిస్తాడు.ఇప్పటివరకు వీరిద్దరూ 9 సార్లు తలపడగా, జొకోవిచ్ 5-4తో స్వల్ప ఆధిక్యంలో ఉన్నాడు. అయితే గ్రాండ్ స్లామ్ ఫైనల్స్‌లో అల్కరాజ్ 2-0తో (రెండు సార్లు వింబుల్డన్‌లో) జొకోవిచ్పై పైచేయి సాధించాడు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రారంభమవుతుంది. -
ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల విజేతగా రిబకినా
ఆస్ట్రేలియా ఓపెన్-2026 మహిళల సింగిల్స్ విజేతగా కజకిస్తాన్ స్టార్ ఎలెనా రిబకినా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్ పోరులో ప్రపంచ నంబర్ 1 ఆర్యనా సబలెంకాపై 6-4, 4-6, 6-4 తేడాతో విజయం సాధించిన రిబకినా.. తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్ ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగింది.తొలి సెట్లో నిలకడైన ఆటతో 6-4 తేడాతో రిబకినా గెలచుకుంది. అనంతరం సబలెంకా తన మార్కు పవర్ హిట్టింగ్తో పుంజుకుంది. ఈ సెట్లో రిబకినాను 6-4 తేడాతో ఓడించిన సబలెంక.. మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో సెట్‌కు తీసుకెళ్లింది. నిర్ణయాత్మక సెట్లో కూడా సబలెంకా సత్తా చాటింది. వరుస గేమ్‌లు గెలుస్తూ 3-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లి టైటిల్ దిశగా సాగింది. అయితే ఆదే సమయంలో ఎలెనా రిబకినా అద్భుతమైన పోరాట పటిమ కనబరిచింది. సబలెంకా సర్వీస్‌ను వరుసగా రెండుసార్లు బ్రేక్ చేసిన రిబకినా, 6-4 తేడాతో సెట్‌ను సొంతం చేసుకుంది. తద్వారా తొలి ఆసీస్ ఓపెన్ టైటిల్ ఆమె ఖాతాలో చేరింది. -
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం.. 37 ఏళ్ల రికార్డు బద్దలు
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026లో సంచలనం నమోదైంది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో స్థానిక జోడీ ఒలివియా గడెకీ-జాన్ పియర్స్ టైటిల్ గెలిచింది. ఇదే జోడీ గతేడాది కూడా టైటిల్ ఎగరేసుకుపోయింది. తద్వారా వరుసగా రెండు ఎడిషన్లలో టైటిల్ గెలిచిన జోడీగా 37 ఏళ్ల కిందటి రికార్డును బద్దలు కొట్టింది. 1988-89లో యానా నవోత్న-జిమ్ పగ్ జోడీ వరుసగా రెండు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిళ్లు గెలిచింది.తాజా టైటిల్‌తో ఒలివియా గడెకీ-జాన్ పియర్స్ మరో రికార్డు కూడా సొంతం చేసుకుంది. మార్గరెట్ కోర్ట్-కెన్ ఫ్లెచర్ జోడీ (1963-64) తర్వాత స్వదేశంలో వరుసగా రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్ టైటిళ్లు సాధించిన జోడీగా చరిత్ర సృష్టించింది.రాడ్ లేవర్ ఎరీనాలో ఇవాళ జరిగిన ఫైనల్లో ఒలివియా గడెకీ-జాన్ పియర్స్ జోడీ ఫ్రెంచ్ జంట క్రిస్టినా మ్లాడెనోవిక్-మాన్యుయెల్ గినార్డ్పై 4-6, 6-3, 10-8 తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో గడెకీ-పియర్స్ జోడీ టైబ్రేక్‌లో 5-7 వెనుకబడినప్పటికీ, చివరి ఆరు పాయింట్లలో ఐదు గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. -
అల్కరాజ్ అదరహో.. ఫైనల్లో అడుగుపెట్టిన స్పెయిన్ సంచలనం
ఆస్ట్రేలియన్ ఓపెన్-2026లో స్పెయిన్ సంచలనం, ప్రపంచ నంబర్ 1 కార్లోస్ అల్కరాజ్ తన జోరును కొనసాగిస్తున్నాడు. అల్కరాజ్ శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టాడు. హోరాహోరీ సాగిన ఈ పోరులో 6-4, 7-6(5), 6-7(3), 6-7(4), 7-5 తేడాతో అల్కరాజ్ విజయం సాధించాడు.మొదటి రెండు సెట్లను అల్కరాజ్ గెలుచుకున్నప్పటికి.. జ్వెరెవ్ గట్టి పోటీనిస్తూ తర్వాతి రెండు సెట్లను టై బ్రేకర్లలో సొంతం చేసుకున్నాడు. దీంతో విజేతను తేల్చేందుకు ఐదో సెట్‌ను నిర్వహించారు.అల్కరాజ్ అద్బుత పోరాటం..అయితే ఈ మ్యాచ్ మూడో సెట్లో అల్కరాజ్ కుడి కాలికి గాయం కావడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఒక దశలో కదలడానికి కూడా ఇబ్బంది పడిన అల్కరాజ్.. మ్యాచ్ మధ్యలోనే వైదొలగడతాడని అంతా భావించారు. కానీ అల్కరాజ్ మాత్రం అద్భుతమైన పోరాటం కనబరిచాడు.మెడికల్ టైమ్ అవుట్ తీసుకుని తిరిగి కోర్టులో అడుగుపెట్టాడు. నిర్ణయాత్మక ఐదో సెట్లో 3-5తో అల్కరాజ్ వెనుకబడినప్పటికీ.. తర్వాత తన మార్క్ షాట్లతో పుంజుకుని సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరగనున్న ఫైనల్ పోరులో అల్కరాజ్.. రెండు సార్లు డిఫెండింగ్ ఛాంపియన్ జానిక్ సినర్ లేదా నోవాక్ జోకోవిచ్‌లతో తలపడే అవకాశముంది. సెకెండ్ సెమీఫైనల్లో శనివారం జానిక్ సినర్, జోకోవిచ్‌లు అమీతుమీ తెల్చుకోనున్నారు. -
నన్ను అవమానిస్తున్నారా?: టెన్నిస్ దిగ్గజం ఫైర్
సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌కు కోపమొచ్చింది. విలేఖరి అడిగిన ప్రశ్న తనను అవమానించేలా ఉందంటూ అతడు తీవ్ర అసహనానికి లోనయ్యాడు. జొకోవిచ్ ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఓపెన్-2026తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అదృష్టవశాత్తూ..ఈ క్రమంలో పురుషుల సింగిల్స్ విభాగంలో అతడు సెమీ ఫైనల్‌కు చేరాడు. ఇప్పటికే ఈ టోర్నీలో పదిసార్లు చాంపియన్‌గా నిలిచిన జొకోవిచ్ (Novak Djokovic) బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో ఇటలీ స్టార్ లొరెంజో ముసెట్టితో తలపడ్డాడు.ముసెట్టితో జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ తొలి రెండు సెట్లను 4–6, 3–6తో కోల్పోయాడు. మూడో సెట్లో మాత్రం 3–1తో ఆధిక్యంలో ఉన్నాడు. ఈ దశలో ముసెట్టి కాలికి గాయం కావడంతో అతడు వైదొలిగాడు. దాంతో ఓడిపోయే అవకాశాలున్న చోట జొకోవిచ్ అదృష్టవశాత్తూ విజయతీరానికి చేరాడు.సెమీస్‌లో సినెర్‌తో జొకోవిచ్మరోవైపు... డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినెర్ (ఇటలీ) కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో 6–3, 6–4, 6–4తో ఎనిమిదో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా)పై సినెర్ విజయం సాధించాడు. ఈ క్రమంలో శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో జ్వెరెవ్ (జర్మనీ)తో అల్కరాజ్; సినెర్‌తో జొకోవిచ్ తలపడతారు. టెన్నిస్ దిగ్గజం ఫైర్అయితే, సెమీస్ చేరిన తర్వాత మీడియాతో మాట్లాడిన జొకోవిచ్‌కు.. ఇప్పుడు సెనెర్, కార్లెస్ అల్కరాజ్లను మీరు ఛేజ్ చేస్తున్నారా? అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు చిర్రెత్తిపోయిన జొకోవిచ్.. ‘‘నేను సెనెర్, కార్లోస్‌ను ఛేజ్ చేస్తున్నానా? ఏ ఉద్దేశంతో ఈ ప్రశ్న అడిగారు?.. నేనెప్పుడూ ఛేజర్గానే ఉంటానా?నన్నెవరూ ఛేజ్ చేయరా? 24 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన నాకు అంత సత్తా లేదంటారా? ఇలా అడిగి నన్ను అవమానిస్తున్నారా? మీ మాటలు నన్ను కించపరిచేవిగా ఉన్నాయి. ఒకప్పుడు రఫా (రఫెల్ నాదల్), రోజర్ ఫెడరర్‌ను ఛేజ్ చేస్తున్నా అన్నారు. ఇప్పుడు సినెర్, కార్లోస్లను చేస్తున్నా అంటున్నారు.ఆ కోణంలో చూడటం లేదా?పదిహేనేళ్ల కెరీర్లో గ్రాండ్‌స్లామ్‌లలో మేటి విన్నర్‌గా ఉన్నా.. మీరు ఆ కోణంలో చూడటం లేదా?’’ అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా ఆస్ట్రేలియా ఓపెన్‌లో పదిసార్లు చాంపియన్‌గా నిలిచిన ఘనత జొకోవిచ్ సొంతం. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచాడు 38 ఏళ్ల ఈ టెన్నిస్ స్టార్. అయితే, ఆస్ట్రేలియా ఓపెన్‌లో గత రెండు పర్యాయాలుగా జొకోవిచ్‌కు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. సెనెర్ చాంపియన్‌గా అవతరించగా.. జొకోవిచ్ ఫైనల్ కూడా చేరలేకపోయాడు.చదవండి: అల్కరాజ్ తొలిసారి... -
స్వియాటెక్ అవుట్
మెల్బోర్న్: అందని ద్రాక్షగా ఉన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను సాధించి ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత సాధించాలని ఆశించిన పోలాండ్ టెన్నిస్ స్టార్ ఇగా స్వియాటెక్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీగా జరిగే ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో ఎనిమిదోసారి బరిలోకి దిగిన స్వియాటెక్ ఈసారి క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది. కజకిస్తాన్ స్టార్, ప్రపంచ ఐదో ర్యాంకర్ ఎలెనా రిబాకినా 7–5, 6–1తో ప్రపంచ రెండో ర్యాంకర్ స్వియాటెక్‌ను బోల్తా కొట్టించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో రిబాకినా చేతిలో స్వియాటెక్ ఓడిపోవడం ఇది రెండోసారి. 2023లో ప్రిక్వార్టర్ ఫైనల్లో రిబాకినా 6–4, 6–4తో స్వియాటెక్‌ను ఓడించింది. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో స్వియాటెక్‌పై రెండుసార్లు నెగ్గిన ఏకైక ప్లేయర్‌గా రిబాకినా నిలిచింది. స్వియాటెక్‌తో 95 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో రిబాకినా 11 ఏస్‌లు సంధించింది. మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తొలి సర్వీస్‌లో 29 పాయింట్లకు 23 పాయింట్లు... రెండో సర్వీస్‌లో 30 పాయింట్లకు 17 పాయింట్లు సంపాదించింది. 26 విన్నర్స్ కొట్టిన 2023 రన్నరప్... 19 అనవసర తప్పిదాలు చేసింది. నెట్ వద్దకు ఏడుసార్లు దూసుకొచ్చి ఆరుసార్లు పాయింట్లు గెలిచిన రిబాకినా తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, స్వియాటెక్ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు స్వియాటెక్ 10 విన్నర్స్ కొట్టి, 25 అనవసర తప్పిదాలు చేసింది. 24 ఏళ్ల స్వియాటెక్ నాలుగుసార్లు (2020, 2022, 2023, 2024) ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను... ఒకసారి (2025) వింబుల్డన్ టైటిల్‌ను...ఒకసారి (2022) యూఎస్ ఓపెన్ టైటిల్‌ను సాధించింది. వచ్చే ఏడాది స్వియాటెక్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను సాధిస్తే... మరియా షరపోవా (2012లో) తర్వాత ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ పూర్తి చేసుకున్న రెండో క్రీడాకారిణిగా... ఓవరాల్‌గా 11వ క్రీడాకారిణిగా గుర్తింపు పొందుతుంది. అనిసిమోవా నిష్క్రమణ గత ఏడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచిన ప్రపంచ నాలుగో ర్యాంకర్ అనిసిమోవా (అమెరికా) ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మాత్రం అద్భుతం చేయలేకపోయింది. అమెరికాకే చెందిన ఆరో సీడ్ జెస్సికా పెగూలాతో జరిగిన మ్యాచ్‌లో అనిసిమోవా 2–6, 6–7 (1/7)తో ఓడిపోయింది. అనిసిమోవాపై గెలుపుతో పెగూలా తన కెరీర్లో తొలిసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో పెగూలా ఆరు ఏస్‌లు సంధించింది. మరోవైపు అనిసిమోవా ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. అనిసిమోవా 18 విన్నర్స్‌తో పోలిస్తే 20 విన్నర్స్ కొట్టిన పెగూలా 21 అనవసర తప్పిదాలు చేసింది. అనిసిమోవా 44 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. నాలుగుసార్లు అనిసిమోవా సర్వీస్‌ను బ్రేక్ చేసిన పెగూలా తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది.నేటి మహిళల సెమీఫైనల్స్సబలెంకా x స్వితోలినా పెగూలా x రిబాకినా మధ్యాహ్నం 2 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారంజొకోవిచ్ను గట్టెక్కించిన ముసెట్టి గాయంపురుషుల సింగిల్స్ విభాగంలో 10 సార్లు చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినెర్ (ఇటలీ) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో జొకోవిచ్‌కు ప్రత్యర్థి లొరెంజో ముసెట్టి (ఇటలీ) గాయం గట్టెక్కించగా... సినెర్ 6–3, 6–4, 6–4తో ఎనిమిదో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా)పై విజయం సాధించాడు. ముసెట్టితో జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ తొలి రెండు సెట్లను 4–6, 3–6తో కోల్పోయాడు. మూడో సెట్లో మాత్రం 3–1తో ఆధిక్యంలో ఉన్నాడు. ఈ దశలో ముసెట్టి కాలికి గాయం కావడంతో అతను వైదొలిగాడు. దాంతో ఓడిపోయే అవకాశాలున్న చోట జొకోవిచ్ అదృష్టవశాత్తూ విజయతీరానికి చేరాడు. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో జ్వెరెవ్ (జర్మనీ)తో అల్కరాజ్; సినెర్‌తో జొకోవిచ్ తలపడతారు. 1 ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో తొలి రెండు సెట్లు గెలిచి, ఆ తర్వాత గాయం కారణంగా వైదొలిగిన తొలి ప్లేయర్‌గా లొరెంజో ముసెట్టి నిలిచాడు.5 ఓపెన్ శకంలో (1968 నుంచి) వరుసగా ఆరు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సెమీఫైనల్‌కు చేరిన ఐదో ప్లేయర్‌గా సినెర్ గుర్తింపు పొందాడు. గతంలో ఇవాన్ లెండిల్, ఫెడరర్, జొకోవిచ్, నాదల్ ఈ ఘనత సాధించారు.6 ఓపెన్ శకంలో (1968 నుంచి) ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వరుసగా నాలుగుసార్లు సెమీఫైనల్‌కు చేరిన ఆరో ప్లేయర్‌గా జొకోవిచ్ నిలిచాడు. గతంలో గిలెర్మో విలాస్, ఇవాన్ లెండిల్, స్టీఫెన్ ఎడ్బర్గ్, ఫెడరర్, ఆండీ ముర్రే ఈ ఘనత సాధించారు.103 ఆ్రస్టేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్‌గా జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. 102విజయాలతో ఫెడరర్ పేరిట ఉన్న రికార్డునుజొకోవిచ్ బద్దలు కొట్టాడు.2 ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరిన రెండో అతిపెద్ద వయసు్కడిగా జొకోవిచ్ (38 ఏళ్ల 241 రోజులు) గుర్తింపు పొందాడు. కెన్ రోజ్‌వాల్ (1977లో; 42 ఏళ్ల 60 రోజులు) ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. -
అల్కరాజ్ తొలిసారి...
మెల్బోర్న్: తనకు అచ్చిరాని గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో ప్రపంచ నంబర్‌వన్ కార్లోస్ అల్కరాజ్ తొలిసారి క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించాడు. గత రెండేళ్లు క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగిన ఈ స్పెయిన్ స్టార్ ఈసారి మాత్రం సాధికారిక ఆటతీరుతో తొలిసారి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ అల్కరాజ్ 7–5, 6–2, 6–1తో ఆరో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆస్ట్రేలియా)పై గెలుపొందాడు. 2 గంటల 16 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ ఐదు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తొలి సర్వీస్‌లో 48 పాయింట్లకు 37... రెండో సర్వీస్‌లో 35 పాయింట్లకు 19 పాయింట్లు సంపాదించాడు. 26 విన్నర్స్ కొట్టిన ఈ స్పెయిన్ స్టార్ 32 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. నెట్ వద్దకు 22 సార్లు దూసుకొచ్చి 18 సార్లు పాయింట్లు సాధించాడు. సెమీఫైనల్ చేరే క్రమంలో అల్కరాజ్ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. ఫైనల్లో చోటు కోసం సెమీఫైనల్లో మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో అల్కరాజ్ ఆడతాడు. మరో క్వార్టర్ ఫైనల్లో జ్వెరెవ్ 6–3, 6–7 (5/7), 6–1, 7–6 (7/3)తో లెర్నర్ టియెన్ (అమెరికా)పై విజయం సాధించాడు. 3 గంటల 10 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్ ఏకంగా 24 ఏస్‌లు సంధించడం విశేషం. ఒక్క డబుల్ ఫాల్ట్ మాత్రమే చేసిన జ్వెరెవ్ 56 విన్నర్స్ కొట్టాడు. 22 అనవసర తప్పిదాలు చేశాడు. తనసర్వీస్ను ఒక్కసారి కూడా కోల్పోని జ్వెరెవ్ ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. నెట్ వద్దకు 31 సార్లు దూసుకొచ్చి 23 సార్లు పాయింట్లు గెలిచాడు. మరోవైపు లెర్నర్ 53 విన్నర్స్ కొట్టి, 43 అనవసర తప్పిదాలు చేశాడు. 11 ఏస్‌లు కొట్టిన లెర్నర్ 9 డబుల్ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. కోకో గాఫ్‌కు షాక్ మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా (బెలారస్), 12వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. క్వార్టర్ ఫైనల్లో సబలెంకా 6–3, 6–0తో ఇవా జోవిచ్ (అమెరికా)ను అలవోకగా ఓడించగా ... స్వితోలినా 6–1, 6–2తో మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా)ను బోల్తా కొట్టించడం విశేషం. కోకో గాఫ్‌తో 59 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో స్వితోలినా ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. వరుసగా నాలుగో ఏడాది సెమీఫైనల్ చేరిన సబలెంకా క్వార్టర్ ఫైనల్లో కేవలం మూడు గేమ్‌లు కోల్పోయింది. 2 మిర్యానా లూసిచ్ (2017లో; 34 ఏళ్ల 313 రోజులు) తర్వాత ఆ్రస్టేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్ చేరిన రెండో అతి పెద్ద వయసు్కరాలిగా స్వితోలినా (31 ఏళ్ల 218 రోజులు) నిలిచింది.13 ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో 13వ ప్రయత్నంలో స్వితోలినా తొలిసారి సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. ఎలీనా దెమెంతియెవా (రష్యా; 2009లో 11వ ప్రయత్నంలో) పేరిట ఉన్న రికార్డును స్వితోలినా అధిగమించింది.10 గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సెమీఫైనల్‌కు చేరడం అల్కరాజ్కిది పదోసారి. ఓపెన్ శకంలో (1968 నుంచి) పది గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సెమీఫైనల్‌కు చేరిన రెండో అతి పిన్న వయసు్కడిగా అల్కరాజ్ (22 ఏళ్ల 258 రోజులు) గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో రాఫెల్ నాదల్ (2009లో; 22 ఏళ్ల 7 నెలల 25 రోజులు) అగ్రస్థానంలో ఉన్నాడు.3 టెన్నిస్‌లోని నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ సెమీఫైనల్ చేరిన మూడో అతి పిన్న వయసు్కడిగా అల్కరాజ్ నిలిచాడు. ఈ జాబితాలో నొవాక్ జొకోవిచ్ (20 ఏళ్ల 237 రోజులు), రాఫెల్ నాదల్ (22 ఏళ్ల 83 రోజులు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. -
డిఫెండింగ్ చాంపియన్‌కు భారీ షాక్!
మెల్బోర్న్: అమెరికా స్టార్, డిఫెండింగ్ చాంపియన్ మాడిసన్ కీస్ ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ప్రిక్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. మహిళల సింగిల్స్‌లో అమెకు సహచర క్రీడాకారిణి జెస్సికా పెగులా షాక్ ఇచ్చింది. ఈ విభాగంలో టాప్ సీడ్, పోలాండ్ స్టార్ స్వియాటెక్, నాలుగో సీడ్ అనిసిమోవ, ఐదో సీడ్ రిబాకినా క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు.పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినెర్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. అతనితో పాటు ఐదో సీడ్ ముసెట్టి, ఎనిమిదో సీడ్ షెల్టన్లు కూడా క్వార్టర్స్ చేరాడు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆరో సీడ్ పెగులా (అమెరికా) 6–3, 6–4తో తన దేశానికే చెందిన డిఫెండింగ్ చాంపియన్, తొమ్మిదో సీడ్ మాడిసన్ కీస్‌ను కంగుతినిపించింది.స్వియాటెక్ గెలుపుగత సెమీఫైనలిస్ట్ ఇగా స్వియాటెక్ 6–0, 6–3తో స్థానిక క్వాలిఫయర్ మాడిసన్ ఇన్‌గ్లిస్ (ఆసీస్)పై అలవోక విజయం సాధించగా, 2023 రన్నరప్ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్) 6–1, 6–3తో ఎలీస్ మెర్టన్స్ (బెల్జియం)ను ఓడించింది. అమెరికాకు చెందిన నాలుగో సీడ్ అమెండా అనిసిమోవ 7–6 (7/4), 6–4,తో జిన్యూ వాంగ్ (చైనా)పై గెలిచి తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరింది. అమెండా గతంలో మూడుసార్లు (2019, 2022, 2024) ప్రిక్వార్టర్స్‌తోనే సరిపెట్టుకుంది. సినెర్ జోరు పురుషుల సింగిల్స్‌లో యానిక్ సినెర్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ‘హ్యాట్రిక్’ లక్ష్యంగా దూసుకెళుతున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో గత రెండేళ్లు టైటిల్ సాధించిన ఈ డిఫెండింగ్ చాంపియన్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్ ఇటాలియన్ స్టార్ 6–1, 6–3, 7–6 (7/2)తో తన దేశానికే చెందిన 22వ సీడ్ ల్యూసియానో డర్డెరిపై గెలుపొందాడు.గతేడాది సెమీఫైనలిస్ట్, ఎనిమిదో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా) 3–6, 6–4, 6–3, 6–4తో నార్వేకు చెందిన 12వ సీడ్ కాస్పర్ రూడ్‌పై చెమటోడ్చి నెగ్గాడు. ఐదో సీడ్ లారెంజో ముసెట్టి (ఇటలీ) 6–2, 7–5, 6–4తో తొమ్మిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)ను ఓడించి తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు.పురుషుల డబుల్స్‌లో భారత డబుల్స్ ప్లేయర్ యూకీ బాంబ్రీ పోరాటం మూడో రౌండ్లోనే ముగిసింది. స్వీడెన్కు చెందిన ఆండ్రీ గొరాన్సన్తో కలిసి పదో సీడ్‌గా బరిలోకి దిగిన యూకీ బాంబ్రీ మూడో రౌండ్లో 6–7 (7/9), 3–6తో బ్రెజిల్ ద్వయం ఒర్లాండో లుజ్–రాఫెల్ మాటొస్ చేతిలో ఓడారు. -
అల్కరాజ్ అదరహో
మెల్బోర్న్: ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ పూర్తి చేసుకోవాలనే లక్ష్యంతో ఆ్రస్టేలియన్ ఓపెన్ టోర్నీలో బరిలోకి దిగిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ అల్కరాజ్ ఆ దిశగా మరో అడుగు వేశాడు. వరుసగా నాలుగో మ్యాచ్‌లో మూడు సెట్లలో విజయాన్ని అందుకొని వరుసగా మూడో ఏడాది క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. 19వ సీడ్ టామీ పాల్ (అమెరికా)తో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ అల్కరాజ్ 7–6 (8/6), 6–4, 7–5తో గెలుపొందాడు. 2 గంటల 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో స్పెయిన్ స్టార్ రెండు ఏస్‌లు సంధించి, 35 విన్నర్స్ కొట్టాడు. తన సర్వీ స్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆస్ట్రేలియా)తో అల్కరాజ్ తలపడతాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో డిమినార్ 6–4, 6–1, 6–1తో పదో సీడ్ అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)ను ఓడించాడు. మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–2, 6–4, 6–4తో సెరున్‌డోలో (అర్జెంటీనా)పై గెలుపొందగా... లెర్నర్ టియెన్ (అమెరికా) 6–4, 6–0, 6–3తో 11వ సీడ్ మెద్వెదెవ్ (రష్యా)ను బోల్తా కొట్టించాడు. ఈ క్రమంలో అమెరికా తరఫున ఆండీ రాడిక్ (2001లో యూఎస్ ఓపెన్) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరిన పిన్న వయసు్కడిగా లెర్నర్ టియెన్ (20 ఏళ్లు) గుర్తింపు పొందాడు. సబలెంకా జోరు మహిళల సింగిల్స్ విభాగంలో రెండుసార్లు చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ బెలారస్ స్టార్ 6–1, 7–6 (7/1)తో విక్టోరియా ఎంబాకో (కెనడా)పై గెలిచింది. 86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకా ఆరు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 31 విన్నర్స్ కొట్టిన ఆమె, 24 అనవసర తప్పిదాలు చేసింది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో 12వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–2, 6–4తో ఎనిమిదో సీడ్ మిరా ఆంద్రీవా (రష్యా)ను బోల్తా కొట్టించింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–1, 3–6, 6–3తో కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)పై, ఇవా జోవిచ్ (అమెరికా) 6–0, 6–1తో పుతింత్సెవా (కజకిస్తాన్)పై గెలుపొంది క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. జొకోవిచ్ 16వసారి.... రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటలో ఉన్న సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ కోర్టులో అడుగు పెట్టకుండానే క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. జాకుబ్ మెన్సిఖ్ (చెక్ రిపబ్లిక్)తో నేడు జొకోవిచ్ ప్రిక్వార్టర్ ఫైనల్ జరగాల్సింది. అయితే గాయం కారణంగా మెన్సిఖ్ ఈ టోర్నీ నుంచి వైదొలిగాడు. దాంతో జొకోవిచ్ ‘వాకోవర్’ లభించింది. ఫలితంగా ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో 16వసారి ఈ సెర్బియా స్టార్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తద్వారా ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో అత్యధికసార్లు క్వార్టర్ ఫైనల్ చేరిన ప్లేయర్‌గా రోజర్ ఫెడరర్ (15) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ బద్దలు కొట్టాడు. -
జొకోవిచ్ @ 400
మెల్బోర్న్: స్టార్ ఆటగాడు, వరల్డ్ మాజీ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ తన 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటలో మరో అడుగు ముందుకు వేశాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో ఈ సెర్బియా దిగ్గజం ప్రిక్వార్టర్స్‌లోకి అడుగు పెట్టాడు. శనివారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో జొకోవిచ్ 6–3, 6–4, 7–6 (7/4)తో బాటిల్ వాన్ డి జాండ్‌షల్ప్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డును అతను తన ఖాతాలో వేసుకున్నాడు. గ్రాండ్‌స్లామ్ కెరీర్లో జొకోవిచ్‌కు ఇది 400వ విజయం కావడం విశేషం. దీంతో పాటు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అత్యధిక మ్యాచ్‌లు నెగ్గిన రోజర్ ఫెడరర్ (102 మ్యాచ్‌లు) రికార్డును కూడా అతను సమం చేశాడు. వరల్డ్ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినెర్ (ఇటలీ) కూడా ముందంజ వేశాడు. తీవ్ర వేడి కారణంగా అలసటకు గురై ఇబ్బంది పడిన సినెర్ చివరకు విజయాన్ని దక్కించుకున్నాడు. మూడో రౌండ్లో అతను 4–6, 6–3, 6–4, 6–4తో ఇలియట్ స్పిజారి (అమెరికా)పై గెలుపొందాడు. తొమ్మిదో సీడ్ టేలర్ ఫ్రిజ్ (అమెరికా) మూడో రౌండ్లో 7–6 (7/5), 2–6, 6–4, 6–4తో వావ్రింకా (స్విట్జర్లాండ్)పై గెలుపొందాడు. మహిళల విభాగంలో రెండు సార్లు విజేత నవోమీ ఒసాకా (జపాన్) గాయంతో మూడో రౌండ్‌కు ముందు టోర్నీనుంచి తప్పుకుంది. ఇతర మ్యాచ్‌లలో రెండో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్) 6–1, 1–6, 6–1తో కలిన్సకయా (రష్యా)పై, మాడిసన్ కీస్ (అమెరికా) 6–3, 6–3తో ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై, పెగులా 6–3, 6–2తో సలెక్మెన్టొవా (రష్యా)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరారు. యూకీ బాంబ్రీ ముందంజ... పురుషుల డబుల్స్ భారత ఆటగాడు యూకీ బాంబ్రీ మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు. బాంబ్రీ – ఆండ్రీ గొరాన్సన్ (స్వీడన్) తమ రెండో రౌండ్ పోరులో 4–6, 7–6 (7/5), 6–3తో సాంటియాగో గొనాలెజ్ – డేవిడ్ పెల్ జంటపై విజయం సాధించారు. అయితే మరో భారత ఆటగాడు శ్రీరామ్ బాలాజీ పరాజయంతో ని్రష్కమించాడు. రెండో రౌండ్లో బాలాజీ – నీల్ ఒబర్లీనర్ (ఆ్రస్టేలియా) 5–7, 1–6తో నాలుగో సీడ్ మార్సెల్ అరెవాలో – మేట్ పావిక్ చేతిలో ఓటమి పాలయ్యారు. -
శ్రమించిన సబలెంకా
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో బెలారస్ టెన్నిస్ స్టార్, ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా తొలిసారి కఠిన పరీక్ష ఎదుర్కొంది. తొలి రెండు రౌండ్లలో అలవోకగా నెగ్గిన ఈ మాజీ చాంపియన్‌కు మూడో రౌండ్లో మాత్రం తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ప్రపంచ 55వ ర్యాంకర్ అనస్తాసియా పొటపోవా (ఆ్రస్టియా)తో జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ సబలెంకా 7–6 (7/4), 7–6 (9/7)తో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 2 గంటల 2 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకా రెండు సెట్లను టైబ్రేక్‌లో సొంతం చేసుకోవడం గమనార్హం. మూడు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసిన గత ఏడాది రన్నరప్... 34 విన్నర్స్ కొట్టి 44 అనవసర తప్పిదాలు చేసింది. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను కూడా నాలుగుసార్లు బ్రేక్ చేసింది. క్వార్టర్ ఫైనల్లో చోటు కోసం 17వ సీడ్ విక్టోరియా ఎంబోకో (కెనడా)తో సబలెంకా తలపడుతుంది. మూడో రౌండ్లో ఎంబోకో 7–6 (7/5), 5–7, 6–3తో 14వ సీడ్ క్లారా టౌసన్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. 2023, 2024లలో ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సబలెంకా గత ఏడాది ఫైనల్లో మాడిసన్ కీస్ (అమెరికా) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా), ఎనిమిదో సీడ్ మిరా ఆంద్రీవా (రష్యా), 12వ సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో కోకో గాఫ్ 3–6, 6–0, 6–3తో హైలీ బాప్టిస్ట్ (అమెరికా)పై, ఆంద్రీవా 6–3, 6–4తో ఎలీనా రూస్ (రొమేనియా)పై, స్వితోలినా 7–6 (7/4), 6–3తో డయానా ష్నయిడర్ (రష్యా)పై గెలుపొందారు. ఏడో సీడ్ జాస్మిన్ పావోలిని (ఇటలీ) మాత్రం మూడో రౌండ్ అడ్డంకిని దాటలేకపోయింది. మూడో రౌండ్లో పావోలిని 2–6, 6–7 (3/7)తో ఇవా జోవిచ్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. ఏడోసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో ఆడిన పావోలిని నాలుగుసార్లు తొలి రౌండ్లో, రెండుసార్లు మూడో రౌండ్లో, ఒకసారి నాలుగో రౌండ్లో నిష్క్రమించింది. అల్కరాజ్ జోరు... పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ అల్కరాజ్ మరో అలవోక విజయంతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. శుక్రవారం జరిగిన మూడో రౌండ్లో అల్కరాజ్ 6–2, 6–4, 6–1తో కొరెన్‌టిన్ ముటెట్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. 2 గంటల 5 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో స్పెయిన్ స్టార్ 30 విన్నర్స్ కొట్టి, తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేశాడు. ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను రెండుసార్లు చొప్పున సాధించిన 22 ఏళ్ల అల్కరాజ్కు ఆ్రస్టేలియన్ ఓపెన్ మాత్రం కలిసిరావడం లేదు. ఐదోసారి ఈ టోర్నీలో ఆడుతున్న ఈ స్పెయిన్ స్టార్ గత రెండేళ్లలో క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగాడు. ఈసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అల్కరాజ్ విజేతగా నిలిస్తే... ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత సాధించిన అతిపిన్న వయసు్కడిగా చరిత్ర సృష్టిస్తాడు. మరోవైపు మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఆరో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆస్ట్రేలియా), 10వ సీడ్ అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్), 11వ సీడ్ మెద్వెదెవ్ (రష్యా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో జ్వెరెవ్ 7–5, 4–6, 6–3, 6–1తో కామెరాన్ నోరి (బ్రిటన్)పై, డిమినార్ 6–3, 6–4, 7–5తో ఫ్రాన్సెస్ టియాఫో (అమెరికా)పై, బుబ్లిక్ 7–6 (7/4), 7–6 (7/5), 6–4తో టొమాస్ ఎచ్వెరీ (అర్జెంటీనా)పై, మెద్వెదెవ్ 6–7 (5/7), 4–6, 7–5, 6–0, 6–3తో ఫాబియన్ మరోజ్‌సన్ (హంగేరి)పై గెలిచారు. 13వ సీడ్ రుబ్లెవ్ (రష్యా) 3–6, 6–7 (4/7), 3–6తో ఫ్రాన్సిస్కో సెరున్‌డోలో (అర్జెంటీనా) చేతిలో ఓడిపోయాడు. -
‘వావ్’రింకా...
మెల్బోర్న్: నాలుగు పదుల వయసు దాటినా తనలో సత్తా తగ్గలేదని స్విట్జర్లాండ్ వెటరన్ టెన్నిస్ స్టార్ స్టానిస్లాస్ వావ్రింకా నిరూపించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన మాజీ చాంపియన్ మరో అద్భుత విజయంతో మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో వావ్రింకా 4–6, 6–3, 3–6, 7–5, 7–6 (10/3)తో క్వాలిఫయర్ ఆర్థర్ గియా (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. తద్వారా కెన్ రోజ్‌వాల్ (ఆ్రస్టేలియా–1978లో 44 ఏళ్లు) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మూడో రౌండ్‌కు చేరుకున్న అతిపెద్ద వయస్కుడిగా వావ్రింకా (40 ఏళ్ల 296 రోజులు) గుర్తింపు పొందాడు. అంతేకాకుండా 1987లో నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో 128 మందితో ‘డ్రా’ రూపొందించడం మొదలయ్యాక ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన అతిపెద్ద వయసు్కడిగానూ వావ్రింకా ఘనత వహించాడు. దాంతోపాటు గ్రాండ్‌స్లామ్ టోర్నీల చరిత్రలో అత్యధిక ఐదు సెట్ల మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గానూ వావ్రింకా రికార్డు నెలకొల్పాడు. ‘గ్రాండ్’ టోర్నీల్లో వావ్రింకా ఐదు సెట్ల మ్యాచ్‌లు ఆడటం ఇది 49వసారి కాగా... స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ (48 సార్లు) పేరిట ఉన్న రికార్డును వావ్రింకా బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో నొవాక్ జొకోవిచ్ (47 సార్లు), లీటన్ హెవిట్ (45 సార్లు), ఫెర్నాండో వెర్డాస్కో (45 సార్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా వావ్రింకా కెరీర్లో ఐదు సెట్ల మ్యాచ్‌లు ఆడటం ఇది 58వసారి. ఇది కూడా రికార్డే. ఇందులో అతను 31 సార్లు గెలిచి, 27 సార్లు ఓడిపోయాడు. ఈ ఏడాది తర్వాత టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్న వావ్రింకాకు ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు ‘వైల్డ్ కార్డు’ కేటాయించారు. ఈ అవకాశాన్ని వదులుకోకుండా తన శక్తినంతా ధారపోసి ఆడుతున్న వావ్రింకాకు మూడో రౌండ్లో కఠినపరీక్ష ఎదురుకానుంది. మూడో రౌండ్లో తొమ్మిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)తో వావ్రింకా తలపడతాడు. ఆర్థర్ గియాతో జరిగిన మ్యాచ్‌లో వావ్రింకా 11 ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 63 విన్నర్స్ కొట్టడంతోపాటు 69 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. నిర్ణాయక ఐదో సెట్ ‘సూపర్ టైబ్రేక్’లో వావ్రింకా పైచేయి సాధించి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. జొకోవిచ్ 399వ విజయం పురుషుల సింగిల్స్‌లోనే డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినెర్ (ఇటలీ) మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు. రెండో రౌండ్లో సినెర్ 6–1, 6–4, 6–2తో జేమ్స్ డక్‌వర్త్ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. 10సార్లు చాంపియన్, మాజీ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 6–3, 6–2, 6–2తో ఫ్రాన్సిస్కో మెస్ట్రెలి (ఇటలీ)పై నెగ్గాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో జొకోవిచ్‌కిది 399వ విజయం. మరో మ్యాచ్‌లో గెలిస్తే గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో పురుషుల సింగిల్స్‌లో 400 విజయాలు నమోదు చేసుకున్న తొలి ప్లేయర్‌గా జొకోవిచ్ రికార్డు సృష్టిస్తాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ ముసెట్టి (ఇటలీ) 6–3, 6–3, 6–4తో లొరెంజో సొనెగో (ఇటలీ)పై, ఎనిమిదో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా) 6–3, 6–2, 6–2తో స్వీనీ (ఆ్రస్టేలియా)పై, టేలర్ ఫ్రిట్జ్ 6–1, 6–4, 7–6 (7/4)తో విట్ కొప్రివా (చెక్ రిపబ్లిక్)పై, 12వ సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) 6–3, 7–5, 6–4తో మునార్ (స్పెయిన్)పై గెలిచారు. నిశేష్ నిష్క్రమణ వరుసగా రెండో ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో ఆడిన తెలుగు సంతతికి చెందిన అమెరికన్ ప్లేయర్ నిశేష్ బసవారెడ్డి పోరాటం ముగిసింది. రెండో రౌండ్లో నిశేష్ 1–6, 4–6, 3–6తో 15వ సీడ్ ఖచనోవ్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రెండో రౌండ్‌కు చేరిన నిశేష్ 1 గంట 57 నిమిషాల్లో ఖచనోవ్ చేతిలో ఓటమి చవిచూశాడు. 10 ఏస్‌లు సంధించిన నిశేష్, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 31 విన్నర్స్ కొట్టి, 37 అనవసర తప్పిదాలు చేశాడు. నెట్ వద్దకు 25 సార్లు దూసుకొచ్చి 18 సార్లు పాయింట్లు గెలిచిన నిశేష్ తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయాడు. రెండో రౌండ్లో ఓడిన నిశేష్ కు 2,25,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 1 కోటీ 40 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ‘మిక్స్డ్’లో యూకీ జోడీ ఓటమి భారత డబుల్స్ నంబర్‌వన్ యూకీ బాంబ్రీకి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో నిరాశ ఎదురైంది. తొలి రౌండ్లో యూకీ (భారత్)–నికోల్ మెలిచార్ మారి్టనెజ్ (అమెరికా) ద్వయం 6–3, 1–6, 6–10తో ఆరో సీడ్ టిమ్ పుట్జ్ (జర్మనీ)–జాంగ్ షుయె (చైనా) జంట చేతిలో ఓడిపోయింది.పదో సీడ్ బెన్‌చిచ్ అవుట్ మహిళల సింగిల్స్ విభాగంలో పదో సీడ్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్) రెండో రౌండ్లో నిష్క్రమించగా... డిఫెండింగ్ చాంపియన్ మాడిసన్ కీస్ (అమెరికా), రెండో ర్యాంకర్ ఇగా స్వియాటెక్ (పోలాండ్), మాజీ విజేత నయోమి ఒసాకా (జపాన్) మూడో రౌండ్లోకి ప్రవేశించారు. బెన్‌చిచ్ 3–6, 6–0, 4–6తో క్వాలిఫయర్ నికోలా బర్తున్కోవా (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడిపోయింది. కీస్ 6–1, 7–5తో ఆష్లిన్ క్రుగెర్ (అమెరికా)పై, స్వియాటెక్ 6–2, 6–3తో బుజ్కోవా (చెక్ రిపబ్లిక్)పై, ఒసాకా 6–3, 4–6, 6–2తో సొరానా కిర్‌స్టియా (రొమేనియా)పై నెగ్గారు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ అనిసిమోవా (అమెరికా) 6–1, 6–4తో సినియకోవా (చెక్ రిపబ్లిక్)పై, ఐదో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) 7–5, 6–2తో వర్వరా గ్రాచెవా (ఫ్రాన్స్)పై, ఆరో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) 6–0, 6–2తో మెకార్ట్నీ కెస్లెర్ (అమెరికా)పై గెలిచారు. -
అల్కరాజ్ ముందంజ...
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ అల్కరాజ్ మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ అల్కరాజ్ 7–6 (7/4), 6–3, 6–2తో యానిక్ హాంఫ్మన్ (జర్మనీ)పై గెలిచాడు. 2 గంటల 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో స్పెయిన్ స్టార్ 12 ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తొలి సర్వీస్‌లో 71 పాయింట్లకు 49... రెండో సర్వీస్‌లో 40 పాయింట్లకు 24 సాధించాడు. 41 విన్నర్స్ కొట్టిన అతను 30 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. ఇప్పటికే ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన అల్కరాజ్... ఆ్రస్టేలియన్ ఓపెన్ కూడా సాధిస్తే ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ పూర్తి చేసుకుంటాడు. మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఆరో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా), పదో సీడ్ అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్), 11వ సీడ్ మెద్వెదెవ్ (రష్యా), 13వ సీడ్ రుబ్లెవ్ (రష్యా) కూడా మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్లో జ్వెరెవ్ 6–3, 4–6, 6–3, 6–4తో అలెగ్జాండర్ ముల్లర్ (ఫ్రాన్స్)పై, డిమినార్ 6–7 (5/7), 6–2, 6–2, 6–1తో హమాద్ మెజెదోవిచ్ (సెర్బియా)పై, బుబ్లిక్ 7–5, 6–4, 7–5తో ఫుచువోచిస్ (హంగేరి)పై, మెద్వెదెవ్ 6–7 (9/11), 6–3, 6–4, 6–2తో క్వెంటిన్ హేలిస్ (ఫ్రాన్స్)పై, రుబ్లెవ్ 6–4, 6–3, 4–6, 7–5తో క్వాలిఫయర్ జేమీ ఫారియా (పోర్చుగల్)పై విజయం సాధించారు.ఇతర మ్యాచ్‌ల్లో 14వ సీడ్ డేవిడోవిచ్ ఫోకినా (స్పెయిన్) 6–3, 7–6 (7/3), 5–7, 4–6, 6–4తో రీలీ ఒపెల్కా (అమెరికా)పై, 19వ సీడ్ టామీ పాల్ (అమెరికా) 6–3, 6–4, 6–2తో టిరాన్టి (అర్జెంటీనా)పై నెగ్గారు. సబలెంకా సాఫీగా... మహిళల సింగిల్స్ విభాగంలో రెండుసార్లు చాంపియన్, టాప్ సీడ్ సబలెంకా (బెలారస్) మూడో రౌండ్లో బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 72 నిమిషాలపాటు జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో సబలెంకా 6–3, 6–1తో జావోజువాన్ బాయ్ (చైనా)పై గెలిచింది. మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా), ఏడో సీడ్ జాస్మిన్ పావోలిని (ఇటలీ), ఎనిమిదో సీడ్ మిరా ఆంద్రీవా (రష్యా), 12వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) కూడా మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో కోకో గాఫ్ 6–2, 6–2తో ఓల్గా డానిలోవిచ్ (సెర్బియా)పై, పావోలిని 6–2, 6–3తో మగ్ధలీనా ఫ్రీచ్ (పోలాండ్)పై, మిరా ఆంద్రీవా 6–0, 6–4తో మరియా సాకరి (గ్రీస్)పై, స్వితోలినా 7–5, 6–1తో లిండా క్లిమోవికోవా (పోలాండ్)పై గెలుపొందారు. -
యూకీ జోడీ శుభారంభం
ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ యూకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. మెల్బోర్న్లో బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో పదో సీడ్ యూకీ బాంబ్రీ (భారత్)–ఆండ్రీ గొరాన్సన్ (స్వీడన్) ద్వయం 6–3, 6–4తో జేమ్స్ డక్‌వర్త్–క్రూజ్ హెవిట్ (ఆస్ట్రేలియా) జంటపై నెగ్గింది. 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో–స్వీడిష్ జోడీ ఆరు ఏస్‌లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. తమసర్వీస్ను ఒక్కసారి కూడా కోల్పోకుండా ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. 26 విన్నర్స్ కొట్టిన యూకీ–గొరాన్సన్ మూడు అనవసర తప్పిదాలు చేశారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ విభాగంలో యూకీ ఆడటం ఇది ఐదోసారి. తొలిసారి మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జతగా 2014లో ఆడిన యూకీ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. తొమ్మిదేళ్ల తర్వాత 2023లో సాకేత్ మైనేని (భారత్)తో కలిసి మళ్లీ ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడిన యూకీ తొలి రౌండ్ దాటలేదు. 2024లో రాబిన్ హాస్ (నెదర్లాండ్స్)తో, 2025లో అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్)తో కలిసి బరిలోకి దిగిన యూకీ తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. డబ్ల్యూపీఎల్‌లో నేడు యూపీ వారియర్స్ x గుజరాత్ జెయింట్స్ రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
సినెర్ గెలుపు బోణీ.. కీస్, ఒసాకా ముందంజ
మెల్బోర్న్: ‘హ్యాట్రిక్’ టైటిల్‌పై గురి పెట్టిన ప్రపంచ రెండో ర్యాంకర్ యానిక్ సినెర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో శుభారంభం చేశాడు. 2024, 2025లలో విజేతగా నిలిచిన ఈ ఇటలీ స్టార్ ఈసారీ గెలిస్తే జొకోవిచ్ (సెర్బియా), జాక్ క్రాఫోర్డ్ (ఆస్ట్రేలియా), రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా) తర్వాత ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన నాలుగో ప్లేయర్‌గా ఘనత వహిస్తాడు. హుగో గాస్టన్ (ఫ్రాన్స్)తో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సినెర్ తొలి రెండు సెట్లను 6–2, 6–1తో సొంతం చేసుకున్నాడు. మూడో సెట్ మొదలుకావాల్సిన దశలో హుగో గాస్టన్ గాయం కారణంగా మ్యాచ్‌ను కొనసాగించలేనని చైర్ అంపైర్‌కు తెలిపాడు. అనవసర తప్పిదాలుదాంతో మూడో సెట్ జరగకుండానే సినెర్‌కు విజయం ఖరారైంది. 68 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సినెర్ కేవలం మూడు గేమ్‌లు మాత్రమే కోల్పోయాడు. ఆరు ఏస్‌లు సంధించిన ఈ మాజీ నంబర్‌వన్ 19 విన్నర్స్ కొట్టి, 15 అనవసర తప్పిదాలు చేశాడు. రెండో రౌండ్లో జేమ్స్ డక్‌వర్త్ (ఆస్ట్రేలియా)తో సినెర్ తలపడతాడు. మరోవైపు ఐదో సీడ్ లొరెంజో ముసెట్టి (ఇటలీ), ఎనిమిదో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా), తొమ్మిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) కూడా రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. రాఫెల్ కాలిగ్నన్ (బెల్జియం)తో జరిగిన మ్యాచ్‌లో ముసెట్టి తొలి సెట్‌ను 4–6తో చేజార్చుకున్నాడు. అనంతరం 7–6 (7/5), 7–5తో వరుసగా రెండో సెట్లు గెలిచి నాలుగో సెట్లో 3–2తో ఆధిక్యంలో ఉన్నాడు. ఈ దశలో కాలిగ్నన్ గాయంతో మ్యాచ్ నుంచి వైదొలిగాడు. బెన్ షెల్టన్ 6–3, 7–6 (7/2), 7–6 (7/5)తో యుగో హుంబెర్ట్ (ఫ్రాన్స్)పై, ఫ్రిట్జ్ 7–6 (7/5), 5–7, 6–1, 6–3తో వాలెంటిన్ రోయెర్ (ఫ్రాన్స్)లపై గెలిచారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 15వ సీడ్ ఖచనోవ్ (రష్యా) 4–6, 6–4, 6–3, 5–7, 6–3తో మిచెల్సన్ (అమెరికా)పై, 16వ సీడ్ మెన్సిక్ (చెక్ రిపబ్లిక్) 7–5, 4–6, 2–6, 7–6 (7/1), 6–3తో కరెనో బుస్టా (స్పెయిన్)పై, 31వ సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 4–6, 6–3, 6–2, 6–2తో షింటారో మొచిజుకీ (జపాన్)పై, 22వ సీడ్ లుసియానో దర్దెరి (ఇటలీ) 7–6 (7/5), 7–5, 7–6 (7/3)తో క్రిస్టియన్ గారిన్ (చిలీ)పై విజయం సాధించారు. మోన్ఫిల్స్ ఓటమి ఈ ఏడాది తర్వాత టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించిన ఫ్రాన్స్ సీనియర్ స్టార్ గేల్ మోన్ఫిల్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. 20వసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలో దిగిన 39 ఏళ్ల మోన్ఫిల్స్ 7–6 (7/3), 5–7, 4–6, 5–7తో డేన్ స్వీనీ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు. 3 గంటల 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మోన్ఫిల్స్ 14 ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 56 విన్నర్స్ కొట్టిన ఈ ఫ్రాన్స్ స్టార్ ఏకంగా 77 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. కీస్, ఒసాకా ముందంజమహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ మాడిసన్ కీస్ (అమెరికా), మాజీ విజేత నయోమి ఒసాకా (జపాన్) తొలి రౌండ్ అధిగమించేందుకు శ్రమించారు. తొలి రౌండ్లో కీస్ 1 గంట 40 నిమిషాల్లో 7–6 (8/6), 6–1తో ఒలినికోవా (ఉక్రెయిన్)పై, ఒసాకా 2 గంటల 22 నిమిషాల్లో 6–3, 3–6, 6–4తో అంటోనియా రుజిక్ (క్రొయేషియా)పై విజయం సాధించారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) 6–4, 6–3తో కాయా యువాన్ (స్లొవేనియా)పై, పదో సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్) 6–0, 7–5తో కేటీ బూల్టర్ (బ్రిటన్)పై గెలుపొందారు. -
చరిత్ర సృష్టించిన జొకోవిచ్
మెల్బోర్న్: కెరీర్లో 25వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ లక్ష్యంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలో దిగిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 10 సార్లు చాంపియన్ జొకోవిచ్ 6–3, 6–2, 6–2తో పెడ్రో మారి్టనెజ్ (స్పెయిన్)పై గెలిచి రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. ఓవరాల్‌గా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జొకోవిచ్‌కిది 100 విజయం కావడం విశేషం. ఫెడరర్ (స్విట్జర్లాండ్–102) తర్వాత ఆ్రస్టేలియన్ ఓపెన్ ‘సెంచరీ’ విజయాలు సాధించిన రెండో ప్లేయర్‌గా ఈ సెర్బియా స్టార్ గుర్తింపు పొందాడు. అంతేకాకుండా మూడు వేర్వేరు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో 100 అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల్లో గెలిచిన ఏకైక ప్లేయర్‌గా జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో 101 మ్యాచ్‌ల్లో... వింబుల్డన్‌లో 102 మ్యాచ్‌ల్లో విజయం సాధించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అత్యధికసార్లు ఆడిన ప్లేయర్‌గా ఫెడరర్ (21 సార్లు) పేరిట ఉన్న రికార్డును సమం చేసిన జొకోవిచ్... అత్యధిక గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో (81 సార్లు) ఆడిన ప్లేయర్లుగా ఫెడరర్, ఫెలిసియానో లోపెజ్ (స్పెయిన్) పేరిట ఉన్న రికార్డునూ అందుకున్నాడు. పెడ్రో మార్టినెజ్‌తో 2 గంటల్లో ముగిసిన మ్యాచ్‌లో జొకోవిచ్ 14 ఏస్‌లు సంధించాడు. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. 49 విన్నర్స్ కొట్టిన అతను 21 అనవసర తప్పిదాలు చేశాడు. తన సరీ్వస్‌ను ఒక్కసారి కూడా కోల్పోని ఈ సెర్బియా యోధుడు ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. వావ్రింకా బోణీ... ఈ ఏడాది తర్వాత టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన 2014 చాంపియన్, స్విట్జర్లాండ్ స్టార్ వావ్రింకా రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. తొలి రౌండ్లో వావ్రింకా 5–7, 6–3, 6–4, 7–6 (7/4)తో లాస్లో జెరె (సెర్బియా)పై గెలిచాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజయం సాధించిన రెండో అతిపెద్ద వయసు్కడిగా వావ్రింకా (40 ఏళ్ల 296 రోజులు) గుర్తింపు పొందాడు. ఈ రికార్డు ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా–40 ఏళ్ల 326 రోజులు) పేరిట ఉంది. మరోవైపు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మూడుసార్లు రన్నరప్‌గా నిలిచిన మెద్వెదెవ్ (రష్యా) కూడా గెలుపు బోణీ కొట్టాడు. తొలి రౌండ్లో 11వ సీడ్ మెద్వెదెవ్ 7–5, 6–2, 7–6 (7/2)తో జెస్పెర్ డి జాంగ్ (నెదర్లాండ్స్)పై నెగ్గాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఆరో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా) 6–2, 6–2, 6–3తో మెక్‌డొనాల్డ్ (అమెరికా)పై, 12వ సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) 6–1, 6–2, 6–4తో మటియా బెలూచి (ఇటలీ)పై, 13వ సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–4, 6–2, 6–3తో మటియో అర్నాల్డి (ఇటలీ)పై, 14వ సీడ్ డేవిడోవిచ్ ఫొకీనా (స్పెయిన్) 6–2, 6–3, 6–3తో ఫిలిప్ మిసోలిచ్ (ఆస్ట్రియా)పై గెలిచారు. -
వీనస్ విలియమ్స్‌కు షాక్
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ పెను సంచలనాలు లేకుండానే ప్రారంభమైంది. ఫేవరెట్స్ స్థాయికి తగ్గ ఆటతీరు కనబరిచి శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా (బెలారస్), ఏడో సీడ్ జాస్మిన్ పావోలిని (ఇటలీ), 12వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు.ఎనిమిదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడుతున్న సబలెంకా తొలి రౌండ్లో 6–4, 6–1తో టియాంట్సోవా రకోటొమాంగా (ఫ్రాన్స్)పై గెలుపొందింది. ఈ మ్యాచ్‌ను టెన్నిస్ దిగ్గజాలు రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాడ్ లేవర్ (ఆస్ట్రేలియా) ప్రత్యక్షంగా తిలకించారు. 76 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సబలెంకా ఆరంభంలో తడబడింది.వెంటనే తేరుకునితొలి మూడు పాయింట్లు కోల్పోవడంతోపాటు తన తొలి సర్వీస్ గేమ్‌ను చేజార్చుకుంది. అయితే వెంటనే తేరుకున్న రెండుసార్లు (2023, 2024) చాంపియన్, గత ఏడాది రన్నరప్ పదో గేమ్‌లో టియాంట్సోవా సర్వీస్‌ను బ్రేక్ చేసి తొలి సెట్‌ను సొంతం చేసుకుంది.రెండో సెట్లో మాత్రం సబలెంకా జోరు పెంచగా... ‘వైల్డ్ కార్డు’తో ఈ టోర్నీలో బరిలోకి దిగిన టియాంట్సోవా తేలిపోయింది. 23 విన్నర్స్ కొట్టిన సబలెంకా 20 అనవసర తప్పిదాలు కూడా చేసింది. మ్యాచ్ మొత్తంలో ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో పావోలిని 6–1, 6–2తో క్వాలిఫయర్ సస్నోవిచ్ (రష్యా)పై, స్వితోలినా 6–4, 6–1తో క్రిస్టినా బుక్సా (స్పెయిన్)పై, 28వ సీడ్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్) 6–4, 6–1తో మనన్‌చాయ సావంగ్కె (థాయ్‌లాండ్)పై నెగ్గి రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. వీనస్ తొలి రౌండ్లోనే అవుట్ మరోవైపు అమెరికా వెటరన్ స్టార్ వీనస్ విలియమ్స్‌తోపాటు 11వ సీడ్ అలెగ్జాండ్రోవా (రష్యా), 20వ సీడ్ మార్టా కొస్టుక్ (ఉక్రెయిన్), 26వ సీడ్ డయానా యాస్ట్రెమ్స్కా (ఉక్రెయిన్) తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో ఆడిన అతి పెద్ద వయస్కురాలిగా రికార్డు నెలకొల్పిన 45 ఏళ్ల వీనస్ తీవ్రంగా పోరాడినా తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించలేకపోయింది.రెండు గంటల 17 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో వీనస్ 7–6 (7/5), 3–6, 4–6తో ఓల్గా డానిలోవిచ్ (సెర్బియా) చేతిలో ఓడింది. ఇతర మ్యాచ్‌ల్లో క్వాలిఫయర్ జెనెప్ సోన్మెజ్ (టర్కీ) 2 గంటల 37 నిమిషాల్లో 7–5, 4–6, 6–4తో అలెగ్జాండ్రోవాపై, 3 గంటల 31 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ఎల్సా జాక్వెమోట్ (ఫ్రాన్స్) 6–7 (4/7), 7–6 (7/4), 7–6 (10/7)తో మార్టా కొస్టుక్‌పై, ఎలీనా గాబ్రియేలా రుస్ (రొమేనియా) 6–4, 7–5తో యాస్ట్రెమ్స్కాపై సంచలన విజయాలు నమోదు చేశారు. అల్కరాజ్ శుభారంభం పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ అల్కరాజ్ (స్పెయిన్), మూడో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ), పదో సీడ్ బుబ్లిక్ (కజకిస్తాన్) తొలి రౌండ్లో నెగ్గి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను తొలిసారి గెలిచి ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ పూర్తి చేసుకోవాలని భావిస్తున్న అల్కరాజ్ 6–3, 7–6 (7/2), 6–2తో ఆడమ్ వాల్టన్ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. చదవండి: ఆమె మనిషి కాదు! -
‘గ్రాండ్’ సమరానికి సిద్ధం
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ‘ఆస్ట్రేలియన్ ఓపెన్’కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి జరిగే ఈ టెన్నిస్ టోర్నీ కోసం సూపర్ స్టార్లు అల్కరాజ్, సినెర్లతో పాటు 25వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన టెన్నిస్ దిగ్గజం జొకోవిచ్ బరిలోకి దిగుతున్నాడు. మహిళల సింగిల్స్‌లో రెండుసార్లు తుది మెట్టుపై టైటిల్ చేజార్చుకున్న స్వియాటెక్ ఫేవరెట్‌గా సమరానికి సై అంటోంది.మెల్బోర్న్: స్పానిష్ సంచలనం కార్లొస్ అల్కరాజ్ ఆస్ట్రేలియా గడ్డపై బోణీ కోసం సిద్ధమవుతుంటే సెర్బియన్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ తనకు అచ్చొచి్చన ఓపెన్లోనే 25వ గ్రాండ్‌స్లామ్ సాకారం చేసుకోవాలని చూస్తున్నాడు. వీళ్లిద్దరిని దాటేసి వరుసగా మూడో ఏడాది కూడా టైటిల్ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఇటలీ స్టార్, వరల్డ్ నంబర్‌వన్ యానిక్ సినెర్ పట్టుదలతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో నేడు మొదలయ్యే ఆ్రస్టేలియన్ ఓపెన్ టెన్నిస్ టోరీ్నలో ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఆసక్తికరం. ‘హ్యాట్రిక్’ వేటలో సినెర్... తొలి రౌండ్లో గ్యాస్టన్ (ఫ్రాన్స్)ను ఎదుర్కొంటాడు. 22 ఏళ్ల స్పెయిన్ స్టార్ అల్కరాజ్ ఇక్కడ తప్ప మిగతా మూడు గ్రాండ్‌స్లామ్‌లు ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్లను రెండేసి సార్లు చేజిక్కించుకున్నాడు. ఆరు గ్రాండ్‌స్లామ్‌లను సాధించినప్పటికీ ఈ స్పెయిన్ టాప్‌సీడ్‌కు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఇంకా వెలితిగానే ఉంది. గత రెండేళ్లుగా (2024, 2025) క్వార్టర్ ఫైనల్ అంచెను దాటని అతను ఈసారైనా ట్రోఫీని అందుకోవాలని ఆశిస్తున్నాడు. కెరీర్ చరమాంకంలో ఉన్న జొకోవిచ్ చిరస్మరణీయమైన 25వ టైటిల్ కోసం రాకెట్‌కు పదును పెడుతున్నాడు. ఇక్కడ పది టైటిల్స్ సాధించిన జొకో 11వ టైటిల్ సాధిస్తే తన కెరీర్‌కు గ్రాండ్‌గా వీడ్కోలు పలికే అవకాశముంది. మూడేళ్ల క్రితం 2023లో చివరిసారిగా ఆ్రస్టేలియా ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. అదే ఏడాది ఫ్రెంచ్, యూఎస్ ఓపెన్లను గెలిచిన ఈ సెర్బియన్ ఆల్‌టైమ్ గ్రేట్... రెండేళ్లుగా ‘25వ గ్రాండ్‌స్లామ్’ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. ఈ హేమాహేమీలతో పాటు రెండు సార్లు (2020, 2024) రన్నరప్‌తోనే సరిపెట్టుకున్న జర్మనీ ప్లేయర్, మూడో సీడ్ జ్వెరెవ్, ఐదో సీడ్ లోరెంజొ మ్యూసెటి (ఇటలీ), రష్యన్ స్టార్లు రుబ్లెవ్, మెద్వెదెవ్, 2014 చాంపియన్, స్విట్జర్లాండ్ వెటరన్ స్టార్ వావ్రింకా సైతం ఆసీస్ బరిలోకి దిగుతున్నారు. వావ్రింకాకు వీనస్ విలియమ్స్‌కు ఇచి్చనట్లే నిర్వాహకులు వైల్డ్‌కార్ట్ ఎంట్రీ ఇచ్చారు. స్వియాటెక్ ఈసారైనా! పోలండ్ స్టార్ ఇగా స్వియాటెక్‌ను ఆ్రస్టేలియన్ ఓపెన్ ఆఖరి దాకా ఊరించి చివరకు నిరాశపరుస్తోంది. 2022తో పాటు గతేడాది కూడా రన్నరప్‌తోనే సరిపెట్టుకున్న స్వియాటెక్ ఈ సారి ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో ఉంది. అమెరికన్ టెన్నిస్ స్టార్ మాడిసన్ కీస్ డిఫెండింగ్ చాంపియన్ హోదాతో టైటల్ వేటకు సిద్ధమవగా, జెస్సికా పెగూలా (అమెరికా), ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్), 2021 రన్నరప్ కరొలినా మ్యుచొవా (చెక్ రిపబ్లిక్), 2024 రన్నరప్ కోకో గాఫ్ (అమెరికా), రెండుసార్లు ఆ్రస్టేలియన్ ఓపెన్ (2023, 2024) సాధించిన బెలారస్ స్టార్, టాప్ సీడ్ సబలెంక టోర్నీ ఫేవరేట్లుగా ఉన్నారు. -
ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రైజ్‌మనీ రూ. 675 కోట్లు
మెల్బోర్న్: ఈ సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పోటీపడే టెన్నిస్ ప్లేయర్ల ప్రైజ్‌మనీ చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ 111.5 మిలియన్ ఆసీస్ డాలర్లు. అంటే మన కరెన్సీలో అక్షరాల రూ. 675 కోట్లు. గత ఏడాది ప్రైజ్‌మనీ 96.5 మిలియన్ ఆసీస్ డాలర్ల (రూ.584 కోట్లు)తో పోల్చితే 16 శాతం పెరిగిందని టెన్నిస్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటీవ్ క్రెయిగ్ టిలే వెల్లడించారు. పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 4.15 మిలియన్ ఆసీస్ డాలర్లు (రూ.25.15 కోట్లు) చొప్పున అందజేస్తారు. సింగిల్స్ విజేతల ప్రైజ్‌మనీ ఏకంగా 19 శాతం పెంచారు. అలాగే మెయిన్ డ్రా ఆడే సింగిల్స్, డబుల్స్ ఆటగాళ్ల ప్రైజ్‌మనీ కూడా 10 శాతం మేర పెంచినట్లు నిర్వాహకులు ఆయన తెలిపారు. 2023 నుంచి టెన్నిస్ ప్లేయర్లకు ప్రోత్సాహకాలను భారీ పెంచుతున్నామని ఆయన చెప్పారు. ఈ నెల 18 నుంచి మెల్బోర్న్ ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ జరుగుతుంది. క్వార్టర్స్‌లో సాకేత్ జోడీ బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకెత్ మైనేని బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో మంగళవారం సాకేత్ మైనేని–ఆదిల్ కల్యాణ్‌పూర్ జోడీ 7–6 (7/3), 4–6, 13–11తో సుమిత్ నగాల్ (భారత్)–లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా) ద్వయంపై పోరాడి గెలిచింది. ఈ మ్యాచ్‌లో సాకేత్ జంట 3 ఏస్‌లు బాదగా... సుమిత్ నగాల్ ద్వయం 8 ఏస్‌లు సంధించింది. 3 డబుల్ ఫాల్ట్‌లు చేసిన సాకేత్–ఆదిల్ జోడీ... ఒక బ్రేక్ పాయింట్ సాధించింది. సాకేత్ జంట మొత్తం 78 పాయింట్లు గెలుచుకోగా... నగాల్ ద్వయం 69 పాయింట్లకు పరిమితమైంది. గురువారం జరగనున్న క్వార్టర్ ఫైనల్లో ఆర్థర్ రేమాండ్–లుకా సాంచెజ్ (ఫ్రాన్స్) ద్వయంతో... సాకేత్–ఆదిల్ జంట అమీతుమీ తేల్చుకోనుంది.


