మెల్‌బోర్న్: ‘హ్యాట్రిక్’ టైటిల్‌పై గురి పెట్టిన ప్రపంచ రెండో ర్యాంకర్ యానిక్ సినెర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో శుభారంభం చేశాడు. 2024, 2025లలో విజేతగా నిలిచిన ఈ ఇటలీ స్టార్ ఈసారీ గెలిస్తే జొకోవిచ్ (సెర్బియా), జాక్ క్రాఫోర్డ్ (ఆస్ట్రేలియా), రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా) తర్వాత ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన నాలుగో ప్లేయర్‌గా ఘనత వహిస్తాడు.
హుగో గాస్టన్ (ఫ్రాన్స్)తో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో సినెర్ తొలి రెండు సెట్‌లను 6–2, 6–1తో సొంతం చేసుకున్నాడు. మూడో సెట్ మొదలుకావాల్సిన దశలో హుగో గాస్టన్ గాయం కారణంగా మ్యాచ్‌ను కొనసాగించలేనని చైర్ అంపైర్‌కు తెలిపాడు.
అనవసర తప్పిదాలు
దాంతో మూడో సెట్ జరగకుండానే సినెర్‌కు విజయం ఖరారైంది. 68 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సినెర్ కేవలం మూడు గేమ్‌లు మాత్రమే కోల్పోయాడు. ఆరు ఏస్‌లు సంధించిన ఈ మాజీ నంబర్‌వన్ 19 విన్నర్స్ కొట్టి, 15 అనవసర తప్పిదాలు చేశాడు. రెండో రౌండ్‌లో జేమ్స్ డక్‌వర్త్ (ఆస్ట్రేలియా)తో సినెర్ తలపడతాడు.
మరోవైపు ఐదో సీడ్ లొరెంజో ముసెట్టి (ఇటలీ), ఎనిమిదో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా), తొమ్మిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) కూడా రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. రాఫెల్ కాలిగ్నన్ (బెల్జియం)తో జరిగిన మ్యాచ్‌లో ముసెట్టి తొలి సెట్‌ను 4–6తో చేజార్చుకున్నాడు.
అనంతరం 7–6 (7/5), 7–5తో వరుసగా రెండో సెట్‌లు గెలిచి నాలుగో సెట్‌లో 3–2తో ఆధిక్యంలో ఉన్నాడు. ఈ దశలో కాలిగ్నన్ గాయంతో మ్యాచ్ నుంచి వైదొలిగాడు. బెన్ షెల్టన్ 6–3, 7–6 (7/2), 7–6 (7/5)తో యుగో హుంబెర్ట్ (ఫ్రాన్స్)పై, ఫ్రిట్జ్ 7–6 (7/5), 5–7, 6–1, 6–3తో వాలెంటిన్ రోయెర్ (ఫ్రాన్స్)లపై గెలిచారు.
ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 15వ సీడ్ ఖచనోవ్ (రష్యా) 4–6, 6–4, 6–3, 5–7, 6–3తో మిచెల్సన్ (అమెరికా)పై, 16వ సీడ్ మెన్‌సిక్ (చెక్ రిపబ్లిక్) 7–5, 4–6, 2–6, 7–6 (7/1), 6–3తో కరెనో బుస్టా (స్పెయిన్)పై, 31వ సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 4–6, 6–3, 6–2, 6–2తో షింటారో మొచిజుకీ (జపాన్)పై, 22వ సీడ్ లుసియానో దర్దెరి (ఇటలీ) 7–6 (7/5), 7–5, 7–6 (7/3)తో క్రిస్టియన్ గారిన్ (చిలీ)పై విజయం సాధించారు.
మోన్‌ఫిల్స్ ఓటమి
ఈ ఏడాది తర్వాత టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించిన ఫ్రాన్స్ సీనియర్ స్టార్ గేల్ మోన్‌ఫిల్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. 20వసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలో దిగిన 39 ఏళ్ల మోన్‌ఫిల్స్ 7–6 (7/3), 5–7, 4–6, 5–7తో డేన్ స్వీనీ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు.
3 గంటల 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మోన్‌ఫిల్స్ 14 ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 56 విన్నర్స్ కొట్టిన ఈ ఫ్రాన్స్ స్టార్ ఏకంగా 77 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు.

కీస్, ఒసాకా ముందంజ
మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ మాడిసన్ కీస్ (అమెరికా), మాజీ విజేత నయోమి ఒసాకా (జపాన్) తొలి రౌండ్ అధిగమించేందుకు శ్రమించారు. తొలి రౌండ్‌లో కీస్ 1 గంట 40 నిమిషాల్లో 7–6 (8/6), 6–1తో ఒలినికోవా (ఉక్రెయిన్)పై, ఒసాకా 2 గంటల 22 నిమిషాల్లో 6–3, 3–6, 6–4తో అంటోనియా రుజిక్ (క్రొయేషియా)పై విజయం సాధించారు.
ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) 6–4, 6–3తో కాయా యువాన్ (స్లొవేనియా)పై, పదో సీడ్ బెలిండా బెన్‌సిచ్ (స్విట్జర్లాండ్) 6–0, 7–5తో కేటీ బూల్టర్ (బ్రిటన్)పై గెలుపొందారు.


