సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌కు కోపమొచ్చింది. విలేఖరి అడిగిన ప్రశ్న తనను అవమానించేలా ఉందంటూ అతడు తీవ్ర అసహనానికి లోనయ్యాడు. జొకోవిచ్ ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఓపెన్-2026తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
అదృష్టవశాత్తూ..
ఈ క్రమంలో పురుషుల సింగిల్స్ విభాగంలో అతడు సెమీ ఫైనల్‌కు చేరాడు. ఇప్పటికే ఈ టోర్నీలో పదిసార్లు చాంపియన్‌గా నిలిచిన జొకోవిచ్ (Novak Djokovic) బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో ఇటలీ స్టార్ లొరెంజో ముసెట్టితో తలపడ్డాడు.
ముసెట్టితో జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ తొలి రెండు సెట్‌లను 4–6, 3–6తో కోల్పోయాడు. మూడో సెట్‌లో మాత్రం 3–1తో ఆధిక్యంలో ఉన్నాడు. ఈ దశలో ముసెట్టి కాలికి గాయం కావడంతో అతడు వైదొలిగాడు. దాంతో ఓడిపోయే అవకాశాలున్న చోట జొకోవిచ్ అదృష్టవశాత్తూ విజయతీరానికి చేరాడు.
సెమీస్‌లో సినెర్‌తో జొకోవిచ్
మరోవైపు... డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినెర్ (ఇటలీ) కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో 6–3, 6–4, 6–4తో ఎనిమిదో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా)పై సినెర్ విజయం సాధించాడు. ఈ క్రమంలో శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో జ్వెరెవ్ (జర్మనీ)తో అల్‌కరాజ్; సినెర్‌తో జొకోవిచ్ తలపడతారు.
టెన్నిస్ దిగ్గజం ఫైర్
అయితే, సెమీస్ చేరిన తర్వాత మీడియాతో మాట్లాడిన జొకోవిచ్‌కు.. ఇప్పుడు సెనెర్, కార్లెస్ అల్‌కరాజ్‌లను మీరు ఛేజ్ చేస్తున్నారా? అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు చిర్రెత్తిపోయిన జొకోవిచ్.. ‘‘నేను సెనెర్, కార్లోస్‌ను ఛేజ్ చేస్తున్నానా? ఏ ఉద్దేశంతో ఈ ప్రశ్న అడిగారు?.. నేనెప్పుడూ ఛేజర్‌గానే ఉంటానా?
నన్నెవరూ ఛేజ్ చేయరా? 24 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన నాకు అంత సత్తా లేదంటారా? ఇలా అడిగి నన్ను అవమానిస్తున్నారా? మీ మాటలు నన్ను కించపరిచేవిగా ఉన్నాయి. ఒకప్పుడు రఫా (రఫెల్ నాదల్), రోజర్ ఫెడరర్‌ను ఛేజ్ చేస్తున్నా అన్నారు. ఇప్పుడు సినెర్, కార్లోస్‌లను చేస్తున్నా అంటున్నారు.
ఆ కోణంలో చూడటం లేదా?
పదిహేనేళ్ల కెరీర్‌లో గ్రాండ్‌స్లామ్‌లలో మేటి విన్నర్‌గా ఉన్నా.. మీరు ఆ కోణంలో చూడటం లేదా?’’ అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా ఆస్ట్రేలియా ఓపెన్‌లో పదిసార్లు చాంపియన్‌గా నిలిచిన ఘనత జొకోవిచ్ సొంతం. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచాడు 38 ఏళ్ల ఈ టెన్నిస్ స్టార్.
అయితే, ఆస్ట్రేలియా ఓపెన్‌లో గత రెండు పర్యాయాలుగా జొకోవిచ్‌కు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. సెనెర్ చాంపియన్‌గా అవతరించగా.. జొకోవిచ్ ఫైనల్ కూడా చేరలేకపోయాడు.
చదవండి: అల్‌కరాజ్ తొలిసారి...


