అజింక్యా రహానే (Courtesy: IPL 2025)
ఐపీఎల్ 2025 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) దారుణ ప్రదర్శన కనబరిచింది. 14 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలకు మాత్రమే పరిమితమయిన కేకేఆర్ 8వ స్థానంలో నిలిచింది. ఆ సీజన్‌లో కేకేఆర్ కెప్టెన్‌గా అజింక్యా రహానే వ్యవహరించాడు. నాయకుడిగా జట్టును నడిపించడంలో విఫలైనప్పటికీ బ్యాటర్‌గా మాత్రం రహానే సూపర్ సక్సెస్‌అయ్యాడని చెప్పొచ్చు.
37 ఏళ్ల రహానే 13 మ్యాచ్‌లాడి 390 పరుగులు సాధించాడు. కేకేఆర్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కూడా రహానేనే కావడం విశేషం. గత సీజన్‌లో ఎక్కువగా వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రహానే తొలి బంతి నుంచే దూకుడుగా ఆడడం అలవాటు చేసుకున్నాడు. తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు సాధించే స్ట్రాటజీతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు.
అందుకే ఈసారి కూడా రహానేకే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలనే కృతనిశ్చయంతో కేకేఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి మరో 13 రోజులు సమయం ఉండడంతో ఈలోగా కేకేఆర్ కెప్టెన్ పేరును ఖరారు చేయనుంది. అయితే రహానే ఈ సీజన్‌లోనూ వన్‌డౌన్‌లోనే బ్యాటింగ్‌కు రానున్నాడు.
ఐపీఎల్‌లో రెండు పర్యాయాలు (2012, 2014) గంభీర్ సారధ్యంలో ఐపీఎల్ ట్రోఫీలు సాధించిన కేకేఆర్ 2024లో శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో మూడో టైటిల్ అందుకుంది. అయితే అనూహ్యంగా గతేడాది సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన వేలంలో శ్రేయస్ అయ్యర్ సహా పలు కీలక ఆటగాళ్లను వదులుకొని కేకేఆర్ మూల్యం చెల్లించుకుంది.
కానీ ఈసారి మాత్రం ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నంలో తమ బ్యాటింగ్ లైనప్‌ను బలోపేతం చేసుకుంది. ఇటీవలే టీ20 వరల్డ్‌కప్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఫిన్ అలెన్ సహా టిమ్ సీఫెర్ట్, రచిన్ రవీంద్ర, కామెరున్ గ్రీన్‌లను సొంతం చేసుకుంది.
అయితే ఇప్పటికే విదేశీ కోటాలో సునీల్ నరైన్, బ్లెస్సింగ్ ముజరబాని, రోవ్‌మెన్ పావెల్, పతిరానా ఉన్నారు. మరి ఇంతమందిలో ఎవరికి అవకాశం వస్తుందనేది చూడాలి. ఇక పేసర్ హర్షిత్ రాణా గాయంతో ఈ సీజన్‌కు దూరమైనట్లు వార్తలు వచ్చాయి. కానీ కేకేఆర్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మార్చి 28న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్‌లో కేకేఆర్ తమ తొలి మ్యాచ్ మార్చి 29న ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది.


