అల్కరాజ్‌కు ఊహించని షాక్‌! | Medvedev Ends Carlos Alcaraz Winning Streak Indian Wells Semi Final | Sakshi
Sakshi News home page

Indian Wells: అల్కరాజ్‌కు ఊహించని షాక్‌!

Mar 15 2026 3:33 PM | Updated on Mar 15 2026 4:56 PM

Medvedev Ends Carlos Alcaraz Winning Streak Indian Wells Semi Final

స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ ఆటగాడు, ప్రపంచ నంబర్‌వన్‌ కార్లోస్‌ అల్కరాజ్‌ వరుస విజయాలకు బ్రేక్‌ పడింది. ఇండియానా వెల్స్‌ టోర్నీలో భాగంగా శనివారం రాత్రి జరిగిన పురుషుల సెమీఫైనల్లో రష్యా స్టార్‌ డానిల్‌ మెద్వదెవ్‌ చేతిలో 6-3, 7-6(7/3)తో అల్కరాజ్‌ ఓటమి చవిచూశాడు. 

కేవలం రెండు సెట్ల పాటు జరిగిన మ్యాచ్‌లో మెద్వదెవ్‌ను అల్కరాజ్‌ ప్రతిఘటించలేకపోయాడు. తొలి సెట్‌ను మెద్వదెవ్‌ సులువుగా కైవసం చేసుకున్నాడు. అయితే రెండో సెట్‌లో అల్కరాజ్, మెద్వదెవ్‌ మధ్య రసవత్తరపోరు సాగింది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ టైబ్రేక్‌కు దారి తీసింది. 

అయితే టైబ్రేక్‌లో మెద్వదెవ్‌ మరోసారి తన స్ట్రోక్‌ పవర్‌ చూపించి అల్కరాజ్‌ దెబ్బకొట్టడంతో పాటు టోర్నీ ఫైనల్లో ప్రవేశించాడు. అయితే అల్కరాజ్‌ ఇండియన్‌ వెల్స్‌  టోర్నీ సెమీఫైనల్‌ వరకు వరుసగా 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఒక టైటిల్‌ ఫెవరెట్‌గా నిలిచాడు. ఈ ఏడాది వరుస విజయాలతో దుమ్మురేపిన అల్కరాజ్‌ కాలిఫోర్నియన్‌ డెసెర్ట్‌లో వరుసగా మూడో టైటిల్‌ సాధిస్తాడని అనుకన్నప్పటికీ అతని ఆశలకు మెద్వదెవ్‌ గండి కొట్టాడు. 

మరోవైపు మెద్వదెవ్‌కు ఇది వరుసగా తొమ్మిదో విజయం కావడం విశేషం. గత నెలలో దుబాయ్‌ వేదికగా జరిగిన టోర్నీలో మెద్వదెవ్‌ విజయం సాధించాడు. ఇక ఇండియన్‌ వెల్స్‌ టోర్నీలో మెద్వదెవ్‌ ఫైనల్‌ చేరడం ఇది మూడోసారి. గతంలో 2023, 2024లో ఫైనల్‌ చేరినప్పటికీ రన్నరప్‌కే పరిమితమయ్యాడు. 

తాజాగా మూడో ప్రయత్నంలోనైనా టైటిల్‌ సాధించాలనే కసితో మెద్వదెవ్‌ ఉన్నాడు. మరో సెమీస్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ జానిక్‌ సిన్నర్‌ 6-2, 6-4తో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ను ఓడించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించాడు. సోమవారం జరగనున్న పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో సిన్నర్‌తో మెద్వదెవ్‌ అమీతుమీ తేల్చుకోనున్నాడు.

చదవండి: ‘పాక్‌, బంగ్లా నాటకం ఫలించలేదు’

Advertisement
 
Advertisement
Advertisement