ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరిన అల్‌కరాజ్
క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ డిమినార్‌పై విజయం
టోర్నీలో ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోని వరల్డ్ నంబర్‌వన్
మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సబలెంకా, స్వితోలినా
మెల్‌బోర్న్: తనకు అచ్చిరాని గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో ప్రపంచ నంబర్‌వన్ కార్లోస్ అల్‌కరాజ్ తొలిసారి క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించాడు. గత రెండేళ్లు క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగిన ఈ స్పెయిన్ స్టార్ ఈసారి మాత్రం సాధికారిక ఆటతీరుతో తొలిసారి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు.
మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ అల్‌కరాజ్ 7–5, 6–2, 6–1తో ఆరో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆస్ట్రేలియా)పై గెలుపొందాడు. 2 గంటల 16 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్‌కరాజ్ ఐదు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తొలి సర్వీస్‌లో 48 పాయింట్లకు 37... రెండో సర్వీస్‌లో 35 పాయింట్లకు 19 పాయింట్లు సంపాదించాడు. 26 విన్నర్స్ కొట్టిన ఈ స్పెయిన్ స్టార్ 32 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు.
నెట్ వద్దకు 22 సార్లు దూసుకొచ్చి 18 సార్లు పాయింట్లు సాధించాడు. సెమీఫైనల్ చేరే క్రమంలో అల్‌కరాజ్ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. ఫైనల్లో చోటు కోసం సెమీఫైనల్లో మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో అల్‌కరాజ్ ఆడతాడు. మరో క్వార్టర్ ఫైనల్లో జ్వెరెవ్ 6–3, 6–7 (5/7), 6–1, 7–6 (7/3)తో లెర్నర్ టియెన్ (అమెరికా)పై విజయం సాధించాడు. 3 గంటల 10 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్ ఏకంగా 24 ఏస్‌లు సంధించడం విశేషం.
ఒక్క డబుల్ ఫాల్ట్ మాత్రమే చేసిన జ్వెరెవ్ 56 విన్నర్స్ కొట్టాడు. 22 అనవసర తప్పిదాలు చేశాడు. తనసర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోని జ్వెరెవ్ ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. నెట్ వద్దకు 31 సార్లు దూసుకొచ్చి 23 సార్లు పాయింట్లు గెలిచాడు. మరోవైపు లెర్నర్ 53 విన్నర్స్ కొట్టి, 43 అనవసర తప్పిదాలు చేశాడు. 11 ఏస్‌లు కొట్టిన లెర్నర్ 9 డబుల్ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకున్నాడు.
కోకో గాఫ్‌కు షాక్
మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా (బెలారస్), 12వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. క్వార్టర్ ఫైనల్లో సబలెంకా 6–3, 6–0తో ఇవా జోవిచ్ (అమెరికా)ను అలవోకగా ఓడించగా ... స్వితోలినా 6–1, 6–2తో మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా)ను బోల్తా కొట్టించడం విశేషం. కోకో గాఫ్‌తో 59 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో స్వితోలినా ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. వరుసగా నాలుగో ఏడాది సెమీఫైనల్ చేరిన సబలెంకా క్వార్టర్ ఫైనల్లో కేవలం మూడు గేమ్‌లు కోల్పోయింది.
2 మిర్యానా లూసిచ్ (2017లో; 34 ఏళ్ల 313 రోజులు) తర్వాత ఆ్రస్టేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్ చేరిన రెండో అతి పెద్ద వయసు్కరాలిగా స్వితోలినా (31 ఏళ్ల 218 రోజులు) నిలిచింది.
13 ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో 13వ ప్రయత్నంలో స్వితోలినా తొలిసారి సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. ఎలీనా దెమెంతియెవా (రష్యా; 2009లో 11వ ప్రయత్నంలో) పేరిట ఉన్న రికార్డును స్వితోలినా అధిగమించింది.
10 గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సెమీఫైనల్‌కు చేరడం అల్‌కరాజ్‌కిది పదోసారి. ఓపెన్ శకంలో (1968 నుంచి) పది గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సెమీఫైనల్‌కు చేరిన రెండో అతి పిన్న వయసు్కడిగా అల్‌కరాజ్ (22 ఏళ్ల 258 రోజులు) గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో రాఫెల్ నాదల్ (2009లో; 22 ఏళ్ల 7 నెలల 25 రోజులు) అగ్రస్థానంలో ఉన్నాడు.
3 టెన్నిస్‌లోని నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ సెమీఫైనల్ చేరిన మూడో అతి పిన్న వయసు్కడిగా అల్‌కరాజ్ నిలిచాడు. ఈ జాబితాలో నొవాక్ జొకోవిచ్ (20 ఏళ్ల 237 రోజులు), రాఫెల్ నాదల్ (22 ఏళ్ల 83 రోజులు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.


