పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సెలెక్టర్ ఆకిబ్ జావేద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాను పాక్ వివాదాస్పద బౌలర్ ఉస్మాన్ తారిఖ్‌తో పోల్చడం క్రికెట్‌లో చర్చనీయాంశంగా మారింది. శనివారం మీడియా సమావేశంలో ఆకిబ్ జావేద్ మాట్లాడుతూ.. ‘నేటి తరంలో బుమ్రా ఒక అసాధారణ బౌలర్. అతని బౌలింగ్ యాక్షన్ కూడా భిన్నంగానే ఉంటుంది.
బుమ్రా బౌలింగ్ చేయడానికి వచ్చినప్పుడల్లా మా పాక్ ఫాస్ట్ బౌలర్లలో ఉస్మాన్ తారిఖ్‌లాగే కనిపిస్తాడు. బంతిని చాలా వేగంతో వేయడంలో దిట్ట అయినప్పటికీ అతని బౌలింగ్ శైలి ప్రత్యర్థి బ్యాటర్లను గందరగోళానికి గురి చేస్తుంది. ఉస్మాన్ తారిఖ్ కూడా బ్యాటర్లను తికమక పెట్టేందుకే బంతిని కాస్త ఆలస్యంగా విసురుతుంటాడు. ఈ టెక్నిక్‌ను ఉపయోగించే తారిఖ్ టీ20 ప్రపంచకప్‌లో 10 వికెట్ల పడగొట్టాడు.
ఇక టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా కాకుండా వేరే బౌలర్ ఎవరైనా మంచి ప్రదర్శన చేశారని చెప్పడం కష్టమే. ముఖ్యంగా టోర్నీ సెకండ్ హాఫ్‌లో భారీ స్కోర్లు నమోదైనప్పటికీ బుమ్రా మాత్రం తన వినూత్న బౌలింగ్‌తో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అంతేకాదు బుమ్రా తన బౌలింగ్‌తో మేటి బౌలర్లు వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్‌ల ప్రతిబింబాన్ని గుర్తుకు తెచ్చాడని చెప్పొచ్చు. ఇకపై బుమ్రా లాంటి బౌలర్ దొరకడు’ అని పేర్కొన్నాడు.
కాగా ఆకిబ్ జావేద్ బుమ్రాను పొగడడం వరకు బాగానే ఉన్నప్పటికీ తన స్థాయికి ఏమాత్రం తూగని ఉస్మాన్ తారిఖ్‌తో పోల్చడమే క్రికెట్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ‘బుమ్రాతో అతడికి పోలికేంటి?’, ‘బుమ్రా ఎక్కడ.. తారిఖ్ ఎక్కడ? స్థాయి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందేమో’, ‘బుమ్రా లాంటి నంబర్‌వన్ బౌలర్‌ను పెద్దగా గుర్తింపు లేని ప్లేయర్‌తో పోల్చడానికి సిగ్గు ఉండాలి’ అని కామెంట్లు చేశారు.
ఇక టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా స్పీడస్టర్ జస్‌ప్రీత్ బుమ్రా 14 వికెట్లు పడగొట్టి మరో భారత స్పిన్నర్ వరుణ్‌చక్రవర్తితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. మరోవైపు వివాదాస్పద బౌలర్‌గా పేరు పొందిన ఉస్మాన్ తారిఖ్ టీ20 ప్రపంచకప్‌లో 10 వికెట్లు పడగొట్టాడు.
Jasprit Bumrah Is The Usman Tariq Of Fast Bowling. Aqib Javed #pakistancricketteam pic.twitter.com/eEotIXvyt5
— Shreyas Iyer Fan Page (@IyerFanPage) March 14, 2026


