విజయ్‌ ఎఫెక్ట్‌.. స్టాలిన్‌ కళ్లు తెరిపించిన నివేదిక | DMK Defeat Cause report Given To MK Stalin | Sakshi
Sakshi News home page

విజయ్‌ ఎఫెక్ట్‌.. స్టాలిన్‌ కళ్లు తెరిపించిన నివేదిక

Jun 13 2026 7:33 AM | Updated on Jun 13 2026 7:33 AM

DMK Defeat Cause report Given To MK Stalin

సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠాన్ని కోల్పోవడంపై  నియోజకవర్గాల వారీగా తెప్పించుకున్న క్షేత్రస్థాయి విచారణ నివేదికలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌కు షాక్‌ తగిలే విధంగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్నికల్లో ఘోర పరాజయానికి గల కారణాలను విశ్లేషిస్తూ పార్టీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీలు రెండు రోజుల క్రితమే ఒక సమగ్ర నివేదికను స్టాలిన్‌కు సమర్పించాయి.

తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్‌ ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయడం, మహిళల్లో వ్యక్తమైన తీవ్ర అసంతృప్తి పార్టీని పూర్తిగా ముంచేసిందని ఈ నివేదిక తేల్చిచెప్పింది. శుక్రవారం డీఎంకే కార్యాలయం అన్నా అరివాలయంలో ఈ ప్రత్యేక కమిటీతో స్టాలిన్‌ సమావేశమయ్యారు. ఇందులోని అంశాలను పరిశీలించి, నియోజకవర్గాల వారీగా చర్చించారు. ఓటమికి ప్రధాన కారణాలు తాజా నివేదిక మేరకు వెలుగులోకి వచ్చాయి.

విజయ్‌ను తక్కువగా అంచనా  
విజయ్‌ క్షేత్రస్థాయిలో సాధిస్తున్న ప్రజాదరణను, ఆయనకు లభిస్తున్న నిశ్శబ్ద మద్దతును డీఎంకే జిల్లా అధికారులు, స్థానిక నాయకత్వం గుర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారని తేలింది. గెలుపు గుర్రాలైన స్థానిక పలుకుబడి కలిగిన పలువురు సీనియర్‌ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి, కొత్త ముఖాలను పోటీలో పెట్టడం కూడా ఓటమికి ఓ కారణంగా గుర్తించారు. నియోజకవర్గాల్లో కూటమి పార్టీల మధ్య కనీస సమన్వయం లేదని నివేదిక స్పష్టం చేసింది.

ఇక యాక్షన్‌ ప్లాన్‌ 
ఈ పరాజయం నేపథ్యంలో డీఎంకేలో భారీ సంస్థాగత మార్పునకు ఎం.కె. స్టాలిన్‌ శ్రీకారం చుట్టారు. పార్టీ పరిపాలనా యంత్రాంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం పెద్ద జిల్లాల పరిధిలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల వరకు ఒక జిల్లా కార్యదర్శి ఉండగా, ఆ నియోజకవర్గాల సంఖ్యను తగ్గించి కేవలం రెండు లేదా మూడు నియోజకవర్గాలకు ఒక జిల్లా కార్యదర్శిని నియమించేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం పార్టీ పరంగా ఉన్న 78 మంది జిల్లా కార్యదర్శుల సంఖ్యను 115కు పెంచనున్నారు. ఈ విభజన ప్రక్రియ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మరో 30 మంది పార్టీ కోసం పనిచేసే కొత్త వారికి జిల్లా కార్యదర్శులుగా అవకాశం దక్కనుంది.

దక్షిణ, కొంగు మండలాలపై దృష్టి 
డీఎంకే తీవ్రంగా దెబ్బతిన్న దక్షిణ జిల్లాలు, పశ్చిమ ప్రాంతమైన కొంగు మండలం పార్టీని పునరుద్ధరించడానికి ప్రత్యేక కమిటీని రంగంలోకి దించారు. అలాగే, పార్టీ అగ్రనాయకత్వంలో కూడా అధికార వికేంద్రీకరణ జరగబోతోందని అరివాలయం  వర్గాలు తెలిపాయి. కలైంజ్ఞర్‌ కాలం నాటి పాత రాజకీయ వ్యూహాలు ఇప్పుడు పని చేయవని, కొత్త తరం ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా సరికొత్త నాయకత్వ ఫార్ములాను స్టాలిన్‌ సిద్ధం చేసినట్టు తెలిసింది.

కనిమొళి, ఉదయనిధి: 
ఇప్పటికే యువజన విభాగంలో కీలకంగా ఉదయనిధి స్టాలిన్‌తో పాటు, ఢిల్లీ రాజకీయాల్లో అపార అనుభవం, మహిళల్లో మంచి పట్టు ఉన్న సీనియర్‌ నేత కనిమొళికి కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. వీరిద్దరిని కలిపి ద్వంద్వ బృందం పద్ధతిలో పార్టీని నడిపించేందుకు అధిష్ఠానం కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే జరగబోయే డీఎంకే జనరల్‌ సర్వసభ్య సమావేశంలో ఈ సంచలన మార్పులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి.

మహిళా లబ్దిదారుల ఆగ్రహం.. 
డీఎంకే హయాంలో ప్రవేశపెట్టిన మహిళా హక్కుల పథకం డీఎంకే ఓటమికి ప్రధాన కారణంగా నిలవడం గమనార్హం. రాష్ట్రంలో 2 కోట్ల 20 లక్షల రేషన్‌ కార్డులు ఉంటే, కేవలం ఒక వర్గానికి మాత్రమే కోటి 34 లక్షల మందికి ఈ సాయం అందించడం, ఇందులోనూ ఇతర పార్టీల వారు ఉండడంతో, మిగిలిన కోటి మంది మహిళలు డీఎంకేకు వ్యతిరేకంగా ఓటు వేశారన్నది స్పష్టం కావడం ఆలోచించ దగ్గ విషయం. అలాగే, ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు ప్రభుత్వం అందించిన రూ.5వేలు వేసవి సాయాన్ని కూడా కేవలం కొద్దిమంది అర్హులకు మాత్రమే పరిమితం చేయడం వలన సాధారణ మహిళా ఓటర్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమై ఓట్లను దూరం చేసినట్టు తేటతెల్లమైంది.

సోఫా మోడల్‌ ప్రభుత్వం.. 
మరోవైపు.. తమిళనాడులో డీఎంకే ఐదేళ్ల ద్రావిడ మోడల్‌ పాలనలో సాధించిన అద్భుత విజయాలను, అభివృద్ధిని తాజా సీఎం విజయ్‌ ఆయన ఖాతాలో వేసుకుంటున్నారని డీఎంకే యువజన నేత, ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం విజయ్‌ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఆయన సోఫా మోడల్‌ ప్రభుత్వంగా అభివర్ణించారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశంలో సీఎం విజయ్‌ చేసిన ప్రసంగంపై శుక్రవారం ఉదయనిధి తన ఎక్స్‌ పేజీలో స్పందించారు.

అవన్నీ డీఎంకే సాధించినవే.. 
ఎన్నికల ప్రచారంలో తమిళనాడు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, పాతాళానికి పడిపోయిందని అబద్దపు కథనాలను  ప్రచారం చేసిన విజయ్, ఇప్పుడు అధికారంలోకి రాగానే, ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశంలో, తమిళనాడు సాధించిన ఘనతలను ఒక పెద్ద జాబితా రూపంలో చదివి వినిపించారని గుర్తు చేశారు. తమిళనాడు రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, దేశంలో ఉద్యోగాలు చేసే మొత్తం మహిళల్లో 42 శాతం మంది తమిళనాడుకు చెందినవారేనని సీఎం విజయ్‌ అక్కడ ప్రస్తావించారని గుర్తు చేశారు. అలాగే మహిళా విద్య, రక్షణ, ఆరోగ్యం, స్వయం సహాయక సంఘాల అభివృద్ధిపై కూడా సీఎం మాట్లాడారన్నారు. ఇవన్నీ ఆయన అధికారంలోకి వచ్చిన ఈ ఒక నెల రోజుల  సోఫా మోడల్‌ పాలనలో జరిగినవా? లేక ఐదేళ్లపాటు తమ డీఎంకే ప్రభుత్వం రాత్రింబవళ్లు కష్టపడి సాధించిన ద్రావిడ మోడల్‌ విజయాలా అని ప్రశి్నస్తూ,  దీనికి సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మౌనం ఎందుకు? 
ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత విజయ్‌ తీసుకున్న యూ–టర్న్‌లపై ఉదయనిధి మండిపడ్డారు. నీట్‌ పరీక్షే ప్రపంచమా అని ఎన్నికల సమయంలో వ్యాఖ్యలు చేసిన విజయ్, ఇప్పుడు అదే నీట్‌ పరీక్ష నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఢిల్లీ వరకు వెళ్లిన సీఎం కర్ణాటకలో అధికారంలో ఉన్న తన కొత్త మిత్రపక్ష పార్టీతో కానీ, నీతి ఆయోగ్‌ సమావేశంలో కానీ, మేఘధాతు వ్యవహారంపై నోరు విప్పలేదని ఆరోపించారు. మనకెందుకులే వచ్చిన గొడవ అన్నట్లుగా ఆయన మౌనంగా తిరిగి వచ్చేశారని ఎద్దేవా చేశారు. వాస్తవానికి  నీతి ఆయోగ్‌ సమావేశంలో డీఎంకే ప్రభుత్వ విజయాలపై ఈ సోఫా మోడల్‌’ ప్రభుత్వం పూర్తిగా వారి స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకుందని ధ్వజమెత్తారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement