- సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేకు పెళ్లి సంబంధాల వెల్లువ
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే (30)కి వరుసగా పెళ్లి సంబంధాలు వస్తున్నాయని ఆయన తల్లిదండ్రులు తెలిపారు. అభిజీత్ దిప్కే తల్లి అనితా దీప్కే మీడియాతో మాట్లాడుతూ.. నీట్ ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలపై సీజేపీ ఆందోళన ప్రారంభం కాకముందు కూడా పెళ్లి సంబంధాలు కొన్ని వచ్చాయని, జంతర్ మంతర్ వద్ద ఆందోళన తర్వాత వాటి సంఖ్య బాగా పెరిగిందని తెలిపారు.
అభిజీత్ బోస్టన్‌లో ఉన్న సమయంలో అతడి గురించి పెళ్లి విషయం గురించి కుటుంబ సభ్యులు మాట్లాడారని, కానీ తన ప్లాన్స్ గురించి ఆయన పెద్దగా చెప్పలేదని ఆమె తెలిపారు. "దాని గురించి ఆయన ఎక్కువగా మాట్లాడలేదు. చిరునవ్వు మాత్రమే నవ్వాడు. తల్లిదండ్రులుగా పెళ్లి చేసుకోవాలని మేము ఒత్తిడి చేస్తున్నాం. ఇంకొన్ని రోజుల్లో ఆయన ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని మళ్లీ ప్రస్తావించి, తుది నిర్ణయం ఆయనకే వదిలేస్తాం" అని ఆమె తెలిపారు. ఇప్పుడు దీప్కే అంటే చాలా మంది అమ్మాయిలు పడిచస్తుండడంతో ఆయన జంతర్ మంతర్ నుంచి నేరుగా పెళ్లి మండపానికే వెళ్తాడేమోనని నెటినన్లు అంటున్నారు.
ఉద్యమం కొనసాగుతుంది..
సీజేపీ ఉద్యమం కొనసాగుతుందని ఆ సంస్థ నేతలు అంటున్నారు. ఆందోళన విరమించడం ఉద్యమానికి ముగింపు కాదని దీప్కే తెలిపారు. ఎక్స్‌లో చేసిన పోస్టులో, సీజేపీ "ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది" అని పేర్కొంటూ, నిరసన ముగింపు "కేవలం ఆరంభం మాత్రమే" అని చెప్పారు.
పరీక్షల వివాదం సమయంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అయితే బాధిత కుటుంబాలకు సాధ్యమైనంత గరిష్ఠ పరిహారం అందిస్తామని కేంద్రం తెలిపింది.
విద్యా సంస్కరణల కోసం సీజేపీ ప్రచారం కొనసాగిస్తుందని, ఉద్యమాన్ని గ్రామీణ స్థాయికి తీసుకెళ్తామని కూడా సీజేపీ నాయకులు సూచించారు. సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థ, పాలనలో సంస్కరణల కోసం ప్రయత్నిస్తూనే యువతను ప్రభావితం చేసే అంశాలను సంస్థ ప్రస్తావిస్తుందని చెప్పారు.
ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించడం ప్రస్తుతం తమ ప్రాధాన్యం కాదని, యువత సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించేలా చూడటంపైనే దృష్టి ఉందని కూడా దాస్ తెలిపారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశాన్ని సీజేపీ నాయకుడు రాంకా పూర్తిగా తోసిపుచ్చనప్పటికీ, దేశ విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఒత్తిడి కొనసాగించడమే తక్షణ లక్ష్యమని చెప్పారు.


