ముంబై: ప్రియురాలికి మరొక వ్యక్తితో సన్నిహిత సంబంధం ఉందని అనుమానించి, ఆమెను గొంతు నులిమి చంపేశాడు 40 ఏళ్ల ఓ వ్యక్తి. అనంతరం ఆమె మృతదేహాన్ని కారులో పెట్టుకుని కొల్హాపూర్ నుంచి థానే వరకు 350 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాడు.
నిందితుడి పేరు ప్రకాశ్ ఆనంద పాటిల్ (40). ఇతడు మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా షిర్‌గావ్ గ్రామానికి చెందినవాడు. బాధితురాలు సురేఖ శివాజినే ఆరే (40). ఆమె అదే గ్రామానికి చెందిన వితంతువు. ఆమెతో పాటిల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు.
పోలీసుల సమాచారం ప్రకారం.. సురేఖకు మరొక వ్యక్తితో సంబంధం ఉందని పాటిల్ అనుమానించాడు. ఆదివారం ఉదయం షిర్‌గావ్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆమెను గొంతు నులిమి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్య తర్వాత నిందితుడు మృతదేహాన్ని చుట్టి కారులో ఉంచి, నేరం జరిగిన ప్రాంతం నుంచి 350 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న థానే జిల్లా భివాండిలోని కసేలీ వైపు రాత్రంతా కారు నడిపాడు.
సోమవారం ఉదయం భివాండిలో ఓ స్థానికుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. వాహనాన్ని గుర్తించి పాటిల్‌ను అదుపులోకి తీసుకుని, కారులో ఉన్న మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 103(1) కింద జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కోసం నేరం జరిగిన ప్రాంత పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. థానే చేరుకున్న తర్వాత మృతదేహంతో నిందితుడు ఏం చేయాలనుకున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.


