న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ ర్యాలీ సమయంలో పోలీసులపై దాడులు జరిగాయని ఆరోపిస్తూ ఢిల్లీ మాజీ పోలీసు అధికారులు జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగనున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలో సంఘ వ్యతిరేక శక్తులు చొరబడి పోలీసు సిబ్బందిపై దాడి చేశాయని, ఆ ఘటనలో 100 మందికి పైగా పోలీసు సిబ్బంది గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.
జులై 20న కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. జనాన్ని నియంత్రించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. భద్రతా సిబ్బంది హద్దులు దాటారని నిరసనకారులు ఆరోపిస్తుండగా, సంఘ వ్యతిరేక శక్తులు తమపై దాడి చేశాయని పోలీసులు చెబుతున్నారు.
ఇప్పుడు.. పదవీ విరమణ చేసిన అధికారుల సంఘం ఢిల్లీ పోలీసు ఫెడరేషన్ జులై 31న జంతర్ మంతర్ వద్ద ఒక రోజు నిరసన చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని ఢిల్లీ పోలీసు కమిషనర్ అనురాగ్ కుమార్‌కు లేఖ రాసింది. తమ దరఖాస్తులో ఫెడరేషన్ ఇలా పేర్కొంది.. ‘‘జూలై 20న జంతర్ మంతర్ పరిసరాల్లో చట్టబద్ధ విధులు నిర్వహిస్తున్న సమయంలో పెద్ద సంఖ్యలో పోలీసు, పారామిలిటరీ దళాల అధికారులు, సిబ్బంది గాయపడ్డారు. పోలీసు దళానికి సంఘీభావం తెలియజేసేందుకు జులై 31న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధర్నా చేపట్టేందుకు అనుమతి ఇవ్వండి’’ అని కోరింది.
శాంతి భద్రతలు కాపాడే సమయంలో భద్రతా సిబ్బంది చేసిన త్యాగాలను ప్రస్తావించేందుకు ఈ ధర్నాకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ ధర్నాను పదవీ విరమణ చేసిన ఢిల్లీ పోలీసు సిబ్బంది అంతా కలిసి చట్టాన్ని గౌరవించే పౌరుల తరఫున నిర్వహిస్తున్నామని, ఇది పూర్తిగా శాంతియుతంగా, అహింసాత్మకంగా సాగుతుందని ఫెడరేషన్ తెలిపింది.
మరోవైపు, జులై 20న జరిగిన పోలీసు చర్యపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా మంగళవారం సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. "నిరసనల సమయంలో పోలీసులకు కొత్త ప్రోటోకాల్ అవసరం" అని సుప్రీంకోర్టు పేర్కొంది. కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలోని విద్యార్థుల నిరసనల సమయంలో పోలీసులు గతంలో నిర్దేశించిన నిబంధనలు పాటించలేదని కోర్టు సూచించింది.


