న్యూఢిల్లీ: నీట్ నిరసనల కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. జంతర్ మంతర్‌తో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనల్లో అరెస్టైన, అదుపులోకి తీసుకున్న మైనర్లను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది.
18 ఏళ్లలోపు వాళ్లతో పాటు ఎలాంటి క్రిమినల్ రికార్డు లేని వారిని తక్షణమే విడుదల చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల విషయంలో తదుపరి బలవంతపు చర్యలు (coercive action) తీసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
వాళ్లకు వర్తించదు
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే క్రిమినల్ నేపథ్యం ఉన్నవారికి ఈ రక్షణ వర్తించదని స్పష్టం చేసింది. నిరసనల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ ఒకే విధంగా చూడలేమని, మైనర్లు, గతంలో ఎలాంటి నేర చరిత్ర లేని విద్యార్థుల విషయంలో ప్రత్యేకంగా పరిశీలన అవసరమని కోర్టు అభిప్రాయపడింది.
FIRలపై తాత్కాలిక రక్షణ
జంతర్ మంతర్‌లో CJP నేతృత్వంలో జరిగిన నిరసనలు, ఇతర రాష్ట్రాల్లో నమోదైన కేసులపై కూడా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఇప్పటికే అరెస్టులు, నిర్బంధాలు ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఈ ఆదేశాలు తాత్కాలిక ఉపశమనాన్ని కల్పించనున్నాయి.
పోలీసుల చర్యలపై విచారణకు సంకేతాలు
విద్యార్థులపై పోలీసులు అతిగా బలప్రయోగం చేశారన్న ఆరోపణలపై ఉన్నతస్థాయి కమిటీతో దర్యాప్తు జరిపించే అంశాన్ని కూడా సుప్రీంకోర్టు పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ విచారణలో పోలీసులపై వచ్చిన ఆరోపణలతో పాటు.. నిరసనకారుల నుంచి పోలీసులపై జరిగిన దాడుల ఆరోపణలను కూడా పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది.
కేంద్రం, ఏడు రాష్ట్రాలకు నోటీసులు
ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర, బిహార్, అసోం, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. విద్యార్థుల నిరసనల సమయంలో నమోదైన కేసులు, పోలీసు చర్యలు, అరెస్టులపై ఆయా ప్రభుత్వాల నుంచి వివరణ కోరింది.
విద్యార్థి ఉద్యమానికి కీలక మలుపు
నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై ప్రారంభమైన ఉద్యమంలో పలువురు విద్యార్థులపై కేసులు నమోదయ్యాయి. అరెస్టులు, పోలీసు చర్యలపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు విద్యార్థులకు కొంత ఊరటనిచ్చాయి. అయితే క్రిమినల్ నేపథ్యం ఉన్నవారిపై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేయడంతో.. ఈ వ్యవహారంలో తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.


