అభిప్రాయం
ప్రజా విశ్వాసాన్ని పునరుద్ధరించాలంటే రాజకీయాలు పక్షపాతాన్ని అధిగమించాలి. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు నిర్వహించడం మాత్రమే కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజలకు జవాబు దారీగా ఉండటం, పారదర్శకంగా పని చేయడం, ప్రజల ప్రయోజనాలను అన్నింటికంటే ముందు ఉంచడం కూడా అంతే ముఖ్యమైన అంశాలు. ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసం అత్యంత విలువైన సంపద. ఒకసారి ఆ విశ్వాసం దెబ్బతింటే దానిని తిరిగి సంపాదించడం చాలా కష్టం.
దేశంలో ఏదైనా పెద్ద ప్రజా వివాదం, అవినీతి ఆరోపణ లేదా ప్రజల జీవితాలను ప్రభావితం చేసే సంఘటన వెలుగులోకి వచ్చిన ప్రతిసారి దాదాపు ఒకే పరిస్థితి కనిపిస్తున్నది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటాయి. పార్లమెంట్, శాసనసభల సమావేశాలు వాగ్వాదాలతో స్తంభిస్తాయి. టెలివిజన్ చర్చలు రోజంతా వేడెక్కుతాయి. సోషల్ మీడియాలో కూడా తీవ్ర వాదోపవాదాలు సాగుతాయి. ప్రజల్లో కొంతకాలం ఆగ్రహం వ్యక్తమవుతుంది. కానీ కొద్ది రోజుల తర్వాత ఆ చర్చలు తగ్గిపోతాయి. వార్తల్లో కొత్త అంశాలు వస్తాయి. చివరకు అసలు సమస్య మాత్రం అలాగే మిగిలిపోతుంది. ఈ పరిస్థితి ప్రజల్లో వ్యవస్థపై నమ్మకాన్ని క్రమంగా తగ్గిస్తుంది.
సమాజంలో ఉన్న విద్యావంతులు, నిజాయితీ గల వ్యక్తులు, నిష్పక్షపాతులు, సమర్థులు రాజకీయాలకు దూరంగా ఉండటాన్ని ఎంచుకున్నారు. ఇది సరికాదు. ప్రజాస్వామ్యం నిజమైన అర్థంలో విజయవంతం కావాలంటే ప్రజాసేవ పట్ల నిబద్ధత ఉన్న వ్యక్తులు ప్రజా జీవితంలోకి రావాలి.
పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు మన దేశంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశంగా మారాయి. ఇవి యువతలో ప్రతిభపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. ప్రభుత్వ నియామక వ్యవస్థల విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తాయి. దేశ భవిష్యత్తుపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అయితే ఈ సమస్యను రాజకీయ కోణంలో మాత్రమే చూడటం సరైంది కాదు. అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిశీలిస్తే 2004–2014 మధ్య కాలంలో దేశంలోని అనేక రాష్ట్రాలు, కేంద్ర సంస్థల్లో కూడా ప్రశ్నపత్రాల లీకేజీ సంఘటనలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2, అరుణాచల్ ప్రదేశ్‌లో 1, అస్సాంలో 6, బిహార్‌లో 5, ఢిల్లీ, కేంద్ర సంస్థల్లో 27, గుజరాత్‌లో 8, హరియాణాలో 5, హిమాచల్ ప్రదేశ్‌లో 4, జమ్మూ కశ్మీర్‌లో 5, జార్ఖండ్‌లో 2, కర్ణాటకలో 6, కేరళలో 2, మహారాష్ట్రలో 9, మణిపూర్‌లో 1, మధ్యప్రదేశ్‌లో 7, ఒడిశాలో 3, పంజాబ్‌లో 2, రాజస్థాన్ లో 10, తమిళనాడులో 2, తెలంగాణలో 3, త్రిపురలో 1, ఉత్తరాఖండ్‌లో 3, పశ్చిమ బెంగాల్‌లో 10, ఉత్తరప్రదేశ్‌లో 9 సంఘటనలు నమోదైనట్లు సమాచారం. ఈ వివరాలు చూస్తే ప్రశ్నపత్రాల లీకేజీ సమస్య ఏ ఒక్క రాష్ట్రానికి, ఏ ఒక్క ప్రభుత్వానికి లేదా ఏ ఒక్క రాజకీయ పార్టీకి మాత్రమే పరిమితం కాదని అర్థమవుతుంది.
అందువల్ల ఈ అంశంపై రాజకీయ విమర్శలు చేయడం కంటే శాశ్వత పరిష్కారాలపై దృష్టి పెట్టడం అవసరం. ప్రతి ప్రభుత్వం నేరస్థులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఆధునిక సాంకేతిక భద్రతా వ్యవస్థలు, డిజిటల్ రక్షణ, స్వతంత్ర పర్యవేక్షణ, కఠిన చట్టాలు, పారదర్శక నియామక విధానాలు అమలు చేయాలి. పరీక్షల నిర్వహణలో ప్రతి దశను అత్యంత భద్రతతో నిర్వహించే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలి.
దేశ నిర్మాణంలో ప్రభుత్వాల పాత్ర ఎంత ముఖ్యమో, బాధ్యత గల పౌరుల పాత్ర కూడా అంతే ముఖ్యమైనది. ఉపాధ్యాయులు, మాజీ న్యాయమూర్తులు, పదవీ విరమణ పొందిన అధికారులు, పాత్రికేయులు, మేధావులు, పారిశ్రామికవేత్తలు, సామాజిక సంస్థలు తమ అనుభవాన్ని దేశ ప్రయోజనాల కోసం వినియోగించాలి. సమస్యలను మాత్రమే చూపించడం కాకుండా వాటికి ఆచరణాత్మక పరిష్కారాలను కూడా సూచించాలి. సమాజం మొత్తం కలిసి పని చేసినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది.
- పి. వేణుగోపాల్ రెడ్డి, వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్


