breaking news
p venugopal reddy
-
ఆన్లైన్ ఆంక్షలతో అడవి బిడ్డల ఆవేదన
ఇటీవలి కాలంలో భారతదేశ ప్రజా పరిపాలనలో డిజిటల్ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తున్నది. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకతను పెంచడానికీ, అవినీతిని అరికట్టడానికీ, జవాబుదారీ తనాన్ని పెంపొందించడానికీ డిజిటల్ గవర్నెన్స్ ఒక ముఖ్యమైన సాధనంగా మారింది. ఇందులో భాగంగానే మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, జియో– ట్యాగింగ్, మొబైల్ యాప్‌లు, ఆన్లైన్ బయోమెట్రిక్ లేదా ముఖ గుర్తింపు హాజరు వ్యవస్థలు, కృత్రిమ మేధస్సు వంటి ఆధునిక సాంకేతికతలను ప్రభుత్వాలు విస్తృతంగా అమలు చేస్తున్నాయి. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, అక్కడి సంక్షేమ పథకాల పర్యవేక్షణ కూడా ప్రస్తుతం ఈ డిజిటల్ వ్యవస్థల పరిధిలోకి వచ్చాయి. సాంకేతిక వెలివేతఆంధ్రప్రదేశ్లోని పాడేరు, చింతూరు, కె.ఆర్.పురం, శ్రీశైలం వంటి ప్రాంతాలలోని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లు ఇప్పుడు విద్య, వైద్యం, జీవనోపాధి కార్యక్రమాలు; ఇంకా మౌలిక సదుపాయాల పనులను పర్యవేక్షించడానికి పూర్తిగా మొబైల్ యాప్ లపైనే ఆధారపడుతున్నాయి. అయితే, ఈ సాంకేతిక పరిజ్ఞానం ఆచరణలో గిరిజన ప్రజల జీవితాలను సులభతరం చేయాల్సింది పోయి, వారిని వ్యవస్థ నుండి మరింత దూరం చేస్తున్నది. విధాన రూపకర్తల ఆలోచనలకూ, క్షేత్రస్థాయిలోని భౌగోళిక వాస్తవాలకూ మధ్య ఉన్న భారీ వ్యత్యాసం కారణంగా డిజిటల్ పరిపాలన గిరిజన సమాజాలలో ఒక కొత్త రకమైన సామాజిక వెలివేతకు దారి తీస్తున్నది.ఈ వెలివేతకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో (ప్రస్తుతం ‘వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్ –గ్రామీణ’) ప్రవేశపెట్టిన ‘ఫేస్ ఆథెంటి కేషన్’ (ముఖ గుర్తింపు ద్వారా హాజరు) విధానం ఒక ఉదాహరణ. క్షేత్రస్థాయిలో అవకతవకలను అరికట్టడానికి తెచ్చిన ఈ యాప్, గిరిజన కూలీలకు శాపంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లోని మారు మూల గిరిజన గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం సరిగ్గా లేదు. మొబైల్ నెట్వర్క్ సిగ్నల్స్ దొరక్కపోవడం, తరచూ విద్యుత్ నిలిచిపోవడం వంటి కారణాల వల్ల పని స్థలాల్లో ఈ యాప్ పనిచేయడం లేదు.దీనివల్ల రోజంతా కష్టపడి పనిచేసిన గిరిజన కార్మికులు తమ హాజరును సకాలంలో నమోదు చేసుకోలేకపోతున్నారు. నెట్వర్క్ సిగ్నల్ కోసం గంటల తరబడి వేచిచూడటం, కొన్నిసార్లు సిగ్నల్స్ కోసం ఎత్తయిన కొండలు ఎక్కడం వంటి వింత పరిస్థితులు నెల కొన్నాయి. సాంకేతిక లోపాల కారణంగా హాజరు నమోదు కాక పోతే, వారు చేసిన పనికి వేతనం లభించడం లేదు. రోజువారీ కూలీ పైనే ఆధారపడి బతికే పేద కుటుంబాలకు ఇది కేవలం సాంకేతిక ఇబ్బంది మాత్రమే కాదు, వారి ఆహార భద్రతను, జీవనాధారాన్ని దెబ్బతీసే తీవ్రమైన మానవీయ సమస్య.రియల్ టైమ్‌లో ఎలా?పట్టణ ప్రాంతాల మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించే డిజిటల్ నమూనాలను, ఎటువంటి వసతులు లేని అటవీ ప్రాంతాలపై రుద్దడం ప్రధాన లోపం. గిరిజన గ్రామాలు సాధారణంగా దట్టమైన అడవులు, లోతైన లోయలు, కొండ ప్రాంతాలలో ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ గ్రామాలకు రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిచిపోతాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ‘రియల్ టైమ్ డేటా’ (వెనువెంటనే సమాచారాన్ని పంపడం) ఆశించడం క్షేత్రస్థాయి వాస్తవాలకు పూర్తిగా విరుద్ధం. నెట్వర్క్ లేని కారణంగా ఆన్లైన్ నిర్ధారణలు, జియో–ట్యాగింగ్ వంటివి గిరిజన ప్రాంతాలలో అసాధ్యంగా మారు తున్నాయి. సాంకేతికత విఫలమైనప్పుడు ప్రత్యా మ్నాయంగా పాత కాగితాల ఆధారిత రికార్డులను అనుమతించకపోవడం వల్ల వ్యవస్థ మొత్తం స్థంభించిపోతున్నది.డిజిటల్ పరిపాలన విజయవంతం కావాలంటే సాంకేతికతతో పాటు శిక్షణ పొందిన సిబ్బంది అవసరం. కానీ గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ శాఖల్లో తీవ్రమైన సిబ్బంది కొరత ఉంది. ఉన్న కొద్దిమంది ఉపాధ్యాయులు, ఆరోగ్య కార్యకర్తలు, మండల స్థాయి అధికారులు కఠినమైన భౌగోళిక పరిస్థితుల మధ్య ఇప్పటికే అదనపు బాధ్యత లతో సతమతమవుతున్నారు. ప్రభుత్వ పోర్టల్స్, రిపోర్టింగ్ నమూనాలు తరచూ మారుతుండటం వల్ల క్షేత్రస్థాయి సిబ్బంది గందరగోళానికి గురవుతున్నారు. సాంకేతిక సమస్యల వల్ల ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. సరైన ఇంటర్నెట్ లేని కారణంగా సేకరిస్తున్న డేటా కూడా అసంపూర్ణంగా ఉంటున్నది. ఉన్న తాధికారులకు చేరే సమాచారంలో విశ్వసనీయత లోపించి, భవి ష్యత్తు ప్రణాళికల రూపకల్పనపై సరైన అవగాహన రావడం లేదు.కొత్తది కానప్పుడు పాతది!ఆధునిక పరిజ్ఞానం, సాంకేతికత మనిషి దైనందిన జీవనాన్ని సులభతరం చేయాలి. వారి సంక్షేమానికి సాధనంగా ఉండాలి తప్ప, అదే ఒక అవరోధంగా మారకూడదు. ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతా లలో డిజిటల్ పరిపాలన ఆశించిన ఫలితాలను ఇవ్వాలంటే కొన్ని తక్షణ చర్యలు అవసరం:సహేతుకమైన ప్రత్యామ్నాయాలు: ఇంటర్నెట్, నెట్వర్క్ లేని మారుమూల ‘షాడో ఏరియా’ గ్రామాలలో ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా డేటా సేకరించే సదుపాయం ఉండాలి లేదా పాత రికార్డుల పద్ధతిని అనుమతించాలి. మౌలిక వసతుల కల్పన: గిరిజన ప్రాంతాల్లో డిజి టల్ విప్లవం విజయవంతం కావాలంటే ముందుగా అక్కడ నిరంతర విద్యుత్ సరఫరా, మొబైల్ టవర్ల ఏర్పాటు వంటి ప్రాథమిక వసతులను మెరుగుపరచాలి. సరళీకృత వ్యవస్థలు: క్షేత్రస్థాయి కార్మి కులు, సిబ్బంది సులువుగా అర్థం చేసుకునేలా యాప్‌ల రూపకల్పన సరళంగా ఉండాలి. స్థానిక భాషలలో శిక్షణ ఇవ్వాలి. వికేంద్రీకరణ: గిరిజన ప్రాంతాల ప్రత్యేక భౌగోళిక పరిస్థితులను బట్టి స్థానిక ఐటీడీఏ అధికారులకు నిబంధనలను సవరించే స్వయంప్రతిపత్తిని కల్పించాలి.సాంకేతిక పరిజ్ఞానాన్ని అట్టడుగు వర్గాల ప్రయోజనాల కోసం ఉపయోగించినప్పుడే ప్రజాస్వామ్య పరిపాలనకు నిజమైన అర్థం చేకూరుతుంది. గిరిజన సంస్కృతి, జీవన విధానం, వారి భౌగోళిక పరిమితులను గౌరవిస్తూ సాగే సమతుల్య పరిపాలన మాత్రమే గిరిజన సమాజాల హక్కులను కాపాడగలదు.పి. వేణుగోపాల్ రెడ్డి వ్యాసకర్త ‘ఏకలవ్య ఫౌండేషన్’ వ్యవస్థాపకులు -
సామాన్యునికి సేంద్రియ ఉత్పత్తులు
సందర్భం శుభ్రమైన పరిసరాలు, ఆరో గ్యవంతమైన ఆహారాలను ప్రతి ఒక్కరికి అందుబాటు లోకి తీసుకురావడం ప్రభు త్వాల బాధ్యత. సాగుకు ఉప యోగిస్తున్న రసాయనాల కార ణంగా నేల, నీరు, పరిసరాలు విషపూరితం అయిపోయా యన్నది నేడు రుజువైన వాస్తవం. 30 ఏళ్ల క్రితం మన మధ్యలో మెసిలిన వేలాది జీవరాసులు అంతరించి పోవడం వేదనతో మనం గమనిస్తున్న దృశ్యం. ఈ పరిస్థితి మారి తీరాలన్నది ప్రపంచ దేశాల, కోట్లాది ప్రజల అభిమతం. సేంద్రియ విధానంలో సాగును అమలు చేయడం ఇందుకు పరిష్కార మార్గమనేది అందరూ ఆమోదించిన అంశం. అయితే జరుగుతున్నదేమిటి? సేంద్రియ ఎరు వులు, పురుగు మందులు, విత్తనాలు ఇబ్బడిముబ్బడిగా బజారులో ప్రత్యక్షమయ్యాయి. రసాయనిక ఎరువులు, మందులతో నడుం విరిగిన రైతుకు ఊరట లభించక పోగా మరింత భారం పెరిగింది. ఆరోగ్యవంతమైన ఉత్పత్తులతోబాటు రైతు సౌభాగ్యం కూడా అత్యంత అవసరం అనే అంశాన్ని మనం మరువకూడదు. సుభాష్ పాలేకర్ విధానం ఇందుకు పరిష్కారాన్ని చూపింది. రసాయనాల వినియోగంతో నిర్జీవమైన మట్టికి, జీవరాసులకు నాటు ఆవు పేడ, మూత్రాలతో తిరిగి జీవం పోయవచ్చు అనేది వారి మొదటి సూత్రం. అదనపు ఎరువులు వేయకపోయినా ప్రకృతి పరిణా మాల కారణంగానే నేల సారాన్ని పొంది, పంటలకు అందించగలుగుతుంది. అందుబాటులోని వనరుల నుండి తయారు చేసుకునే కషాయాల ద్వారా పంటలకు పట్టే చీడపీడలను వదిలించుకోవచ్చు. ఇది వారి రెండవ సూత్రం. రైతు తన ఉత్పత్తులను అమ్మాలి తప్ప, విత్త నాలతో సహా ఏ వస్తువును బయటి నుండి కొనకూడదు అన్నది వారి మూడవ సూత్రం. అయితే గత 30 ఏళ్లుగా రసాయన ఎరువులతో సేద్యానికి అలవాటుపడిన రైతుకు ఈ కొత్త దారికి రావడం అంత సులువేమీ కాదు. సేంద్రియ వ్యవసాయం సమగ్ర అమలుకోసం గ్రామాల్లో కులాలు, పార్టీలకు అతీతంగా రైతు సంఘాలు నిర్మాణం కావాలి. శాస్త్ర సాంకేతిక పద్ధతుల అవగాహనతో నేల పరీక్షలు, పంటల ఎంపికలు, విత్తనాల తయారీలు ఈ సంఘాల ద్వారా జరగడం మొదటి మెట్టు. కొన్ని రైతు సంఘాలు కలసి ఒక రైతు సమాఖ్యగా ఏర్పడాలి. వ్యవసాయ పరిశోధనలను గ్రామాల్లోని రైతుకు అందజేసే బాధ్యతలను ఇవి చేపడ తాయి. రైతు తప్పనిసరి అని భావించే ఎరువులు, పురుగుమందుల తయారీలను కూడా ఇవి చేయగలు గుతాయి. వీలైనంత వరకు రైతు తన అవసరాలను తానే తీర్చుకోగలగాలి. తప్పనిసరైతే తాను సభ్యునిగా ఉన్న రైతు సమాఖ్య నుండే సరుకులను కొనుగోలు చేయాలి. ఇక్కడ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం మరొక టున్నది. రైతు కాని, గ్రామంలోని రైతు సంఘం కాని చేయలేని పనిని రైతు సమాఖ్య సమర్థతతో నిర్వహించ గలుగుతుంది. వ్యవసాయ ఉత్పత్తులను కొని, టోకు గాను, చిల్లరగాను వ్యాపారులకు అమ్ముతుంది. అవస రాన్ని బట్టి బజారులో అమ్మక కేంద్రాలను నిర్వహి స్తుంది. ఇంటింటికీ సరుకులను అందజేసే వ్యవస్థలను రూపొందించుకుంటుంది. వ్యవసాయ ఉత్పత్తుల మెరుగుదల, అమ్మకాలను రైతు సమాఖ్య నిర్వహిం చడం ద్వారా, దళారీ వ్యవస్థను పరిమితం చేస్తుంది. అయితే గ్రామాల్లో రైతు సంఘాలను, ఆపై రైతు సమాఖ్యలను స్వచ్ఛంద సంస్థలే నిర్మాణం చేయాలి. ఒక మున్సిపాలిటీలోని ప్రజలకు ఆరోగ్యకరమైన తిండి గింజలను, కూరగాయలను అందించే లక్ష్యంతో చుట్టుపక్కల గ్రామాల రైతులను సంఘటితపరిచే బాధ్యతలను ఒక స్వచ్ఛంద సంస్థ చేపట్టాలి. మూడు నుండి ఐదేళ్ల సమయంలో ఈ లక్ష్యాన్ని అది చేరుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని 23 జిల్లాల్లోని 109 మున్సిపాలిటీలలో ఈ బాధ్యతలను చేపట్టడానికి వివిధ స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. కార్పొరేట్ సంస్థలు తమ సామాజిక బాధ్యతగా 2% ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టవలసిన బాధ్యత ఎలాగూ ఉన్నది. వారు ఇందులో కనీసం 50% మొత్తాన్ని సేంద్రియ వ్యవసాయ విస్తరణకు కేటాయిం చడం ద్వారా ఈ ఉద్యమానికి సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపల్ కేంద్రాలలో సేంద్రియ ఉత్పత్తుల అమ్మక కేంద్రాలకు ఉచితంగా దుకాణాలను కేటాయించాలి. వ్యవసాయ విశ్వ విద్యాలయాలలోను, పరిశోధనా కేంద్రాలలోను రుజువైన ఫలితాలను పేటెంట్ చేయకుండా బహిరంగ పరచాలి. సాంకేతిక పరంగా యోగ్యమైన గిడ్డంగులను రైతు ఫెడరేషన్లకు ప్రభుత్వమే ఉచితంగా కట్టించి ఇవ్వాలి. సేంద్రియ ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ ఉత్పత్తుల పరీక్షలకు అవసరమైన ల్యాబ్ లను జిల్లాస్థాయి రైతు సమాఖ్యలకు ఉచితంగా ప్రభుత్వం అందజేయాలి. సంపూర్ణ సేంద్రియ వ్యవసాయ రాష్ట్రంగా సిక్కిం ప్రకటించుకున్నది. మరో ఐదేళ్లలో తాము కూడా అదే స్థానంలో నిలుస్తామని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. దేశమంతటా ఇది ఆచరణ యోగ్యం కావడానికి ప్రతి వ్యవసాయ విశ్వవిద్యాలయంలోను ‘సేంద్రియ వ్యవ సాయం’ ఒక ప్రధాన విభాగంగా ప్రారంభం కావాలి. కేవలం సేంద్రియ వ్యవసాయ శిక్షణ కోసమే కొన్ని వ్యవసాయ పరిశోధనా కేంద్రాలను, కృషి విజ్ఞాన కేంద్రాలను ప్రారంభించాలి. ఒక గింజను విత్తితే పదివేల గింజలను అంది స్తుంది నేలతల్లి. అతి తక్కువ ఖర్చుతో, అత్యంత ఆరోగ్యకరమైన ఉత్పత్తులను అందజేయడమే సేంద్రి య వ్యవసాయ లక్ష్యం కావాలి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చినప్పుడు, తన పంటలకు అదనపు ధర కావాలని రైతు కోరడు. ప్రస్తుతం శ్రీమం తులకే అందుతున్న సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు సామాన్యులకు కూడా సరసమైన ధరలకు అందు బాటులోకి రావాలి. అందుకు రైతులు సమాయత్తం కావాలి; స్వచ్ఛంద సంస్థలు నడుం కట్టుకోవాలి; వ్యాపార, పారిశ్రామికవేత్తలు సహకరించాలి. ప్రభుత్వం తన విధానాలను సవరించుకోవాలి. (మార్చి 19-20న హైదరాబాద్‌లో ‘సేంద్రియ వ్యవసాయంతో రైతు సౌభాగ్యం’ అంశంపై జాతీయ సదస్సు సందర్భంగా) - పి. వేణుగోపాల్‌రెడ్డి వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ మొబైల్: 94904 70064


