5జీ రావడం లేదని.. టెక్నీషియన్‌ను టవర్‌కు కట్టేసి.. | Villagers Tie Telecom Technician to Tower Over Poor 5G | Sakshi
Sakshi News home page

5జీ రావడం లేదని.. టెక్నీషియన్‌ను టవర్‌కు కట్టేసి..

Sep 12 2026 11:22 AM | Updated on Sep 12 2026 11:22 AM

Villagers Tie Telecom Technician to Tower Over Poor 5G

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేపూర్‌ జిల్లాలో 5జీ నెట్‌వర్క్‌ సరిగా పనిచేయడం లేదన్న ఆగ్రహంతో గ్రామస్థులు ఓ టెలికాం సాంకేతిక నిపుణుడిని మొబైల్‌ టవర్‌కు కట్టేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. బింద్కీ ప్రాంతంలోని హర్దౌలి గ్రామంలో గురువారం ఈ ఘటన జరిగింది. టెలికాం టెక్నీషియన్‌గా గుర్తించిన ఆదిత్య భాన్‌ సింగ్‌ మొబైల్‌ నెట్‌వర్క్‌ సమస్యను పరిశీలించేందుకు గ్రామానికి వెళ్లారు. ఈ సమయంలో కొందరు గ్రామస్థులు ఆయనను నిర్బంధించి, మొబైల్‌ టవర్‌కు కట్టేసినట్లు ఫతేపూర్‌ ఎస్పీ అభిమన్యు మాంగ్లిక్ తెలిపాకరి పీటీఐ పేర్కొంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఓ వీడియోలో టెక్నీషియన్‌ను టవర్‌కు కట్టేసి, చుట్టూ గ్రామస్థులు ఉన్న దృశ్యాలు కనిపించాయి.

సీనియర్‌ కంపెనీ అధికారులు వచ్చి సమస్యను పరిష్కరించే వరకు టెక్నీషియన్‌ను విడిచిపెట్టబోమని ఓ గ్రామస్థుడు వీడియోలో చెప్పినట్లు తెలుస్తోంది. దాదాపు రెండేళ్లుగా తమ ప్రాంతంలో మొబైల్‌ కనెక్టివిటీ, ముఖ్యంగా 5జీ సేవలు సరిగా అందడం లేదని గ్రామస్థులు ఆరోపించారు. ప్రైవేటు టెలికాం టవర్‌ ఏర్పాటు చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదని పేర్కొన్నారు.

విద్యుత్‌ అందుబాటులో ఉన్న సమయంలోనూ నెట్‌వర్క్‌ తరచూ పనిచేయడం లేదని, దీంతో ఫోన్‌ కాల్స్‌, ఇంటర్నెట్‌ సేవలకు అంతరాయం కలుగుతోందని స్థానికులు ఫిర్యాదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. మెరుగైన కనెక్టివిటీ లేకపోయినా 5జీ సేవలకు తాము చెల్లింపులు చేస్తున్నామని గ్రామస్థులు పేర్కొన్నట్లు చెప్పారు.

సింగ్‌ ఫిర్యాదు మేరకు శుక్రవారం గుర్తుతెలియని గ్రామస్థులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అనంతరం రాహుల్‌ పటేల్‌ (28), సూరజ్‌ యాదవ్‌ (21), అలోక్‌ పటేల్‌ (29), యోగేంద్ర పటేల్‌ (36), అలోక్‌ యాదవ్‌ (31), సచిన్‌ పటేల్‌ (30)లను అరెస్టు చేశారు. వారిని మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచగా, అనంతరం బెయిల్‌పై విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఇదీ చదవండి: కుటుంబం మొత్తాన్ని ‘లేపేసి’.. తండ్రికి టీ ఇచ్చి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement