సర్వీస్ ప్రొవైడర్లకు డాట్ ఆదేశాలు
ఆగస్టు 24 నుంచి అమలు
సైబర్ నేరాలు, మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఒక వ్యక్తి పేరుపై తొమ్మిది మొబైల్ సిమ్ కనెక్షన్లు ఉంటే వారికి కొత్త కనెక్షన్ ఇవ్వొద్దని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను (టీఎస్‌పీలు) టెలికాం శాఖ (డాట్) ఆదేశించింది. ఈ నిబంధన ఆగస్టు 24, 2026 నుంచి అమల్లోకి రానుంది. పరిమితికి మించి కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి సబ్‌స్క్రైబర్‌ను గుర్తించేందుకు తగిన సాంకేతిక, సంస్థాగత చర్యలు తీసుకోవాలని సూచించింది.
డీఐపీతో తనిఖీలు
టెలికాం సంస్థలు అప్‌లోడ్ చేసే సబ్‌స్రై్కబర్ల వివరాల ఆధారంగా టెలికాం శాఖ ఏర్పాటు చేసిన ‘డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్’ (డీఐపీ)ను ఉపయోగించాలని డాట్ సూచించింది. ఇప్పటికే నిరీ్ణత పరిమితికి మించి మొబైల్ కనెక్షన్లు పొందిన సబ్‌స్రై్కబర్ల వివరాలు డీఐపీలో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఈ ఆగస్టు 23 నుంచి.. తమ పేరుపై ఇప్పటికే గరిష్ట సంఖ్యలో మొబైల్ కనెక్షన్లు ఉన్న సబ్‌స్క్రైబర్లను గుర్తించేందుకు వారి ఫొటోలను డీఐపీలో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. దీంతో పరిమితికి మించి మరో కనెక్షన్ పొందేందుకు ప్రయత్నించే వ్యక్తిని టెలికాం సంస్థలు సులభంగా గుర్తించి, కొత్త సిమ్ జారీని అడ్డుకోగలుగుతాయి. డీఐపీతో అనుసంధాన ప్రక్రియను నవంబర్ 30లోగా క్రమబద్ధీకరించాలని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను టెలికాం శాఖ కోరింది.
ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా బంగారం ధర..


