మీ పేరుతో సిమ్ కార్డు ఉందా.. జాగ్రత్త! | SIM Card Misuse Can Attract Rs 50 Lakh Fine 3 Year Jail DoT Warns Users | Sakshi
Sakshi News home page

మీ పేరుతో సిమ్ కార్డు ఉందా.. జాగ్రత్త!

Sep 27 2026 8:52 PM | Updated on Sep 27 2026 9:16 PM

SIM Card Misuse Can Attract Rs 50 Lakh Fine 3 Year Jail DoT Warns Users

మన పేరుతో సిమ్ తీసుకోవడం, దాన్ని అవసరం లేనప్పుడు వేరే వ్యక్తికి ఇవ్వడం సాధారణంగానే అనిపిస్తుంది. కానీ.. ఇకపై ఈ విషయంలో తప్పకుండా కొంత జాగ్రత్త వహించాల్సిందే. నిర్లక్ష్యం వహిస్తే మాత్రం.. భారీ జరిమానా చెల్లించడంతో పాటు, మూడేళ్లు జైలుపాలయ్యే అవకాశం కూడా ఉంటుంది.

సెప్టెంబర్ 21న జారీ చేసిన అడ్వైజరీలో టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT) పలు కీలక విషయాలను వెల్లడించింది. నకిలీ పత్రాలతో సిమ్ తీసుకోవడం, టెలికాం ఐడెంటిఫైయర్లను దుర్వినియోగం చేయడం, మొబైల్ ఫోన్‌లోని IMEI నంబర్‌ను మార్చడం లేదా ట్యాంపర్ చేయడం వంటి వాటికి.. తీవ్రమైన పరిణామాలు ఉంటాయని వెల్లడించింది.

మూడేళ్లు జైలు శిక్ష
టెలికమ్యూనికేషన్స్ చట్టం, 2023 ప్రకారం.. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా పడే అవకాశం ఉంది.

ఇటీవల సైబర్ క్రైమ్ దర్యాప్తులో ఛత్తీస్‌గఢ్‌లో ఒక ఘటన బయటపడింది. అక్కడ ఒక పాయింట్ ఆఫ్ సేల్ (PoS) ఏజెంట్ కొంతమంది పౌరుల గుర్తింపు పత్రాలను వారి అనుమతి లేకుండా ఉపయోగించి 25 మొబైల్ కనెక్షన్లను యాక్టివేట్ చేసినట్లు గుర్తించారు. ఈ విషయం బయటపడిన తర్వాత DoT, టెలికాం కంపెనీలు ఆ PoS ఏజెంట్‌ను బ్లాక్ చేశాయి. అలాగే ఆ 25 మొబైల్ నంబర్లను డిజిటల్ ఇంటెలిజెన్స్ ద్వారా పరిశీలించారు. అనుమానాస్పదంగా ఉన్న కనెక్షన్లను మళ్లీ వెరిఫికేషన్‌కు పంపగా, ఆ ప్రక్రియలో సరైన వివరాలు నిర్ధారించలేని నంబర్లను డీయాక్టివేట్ చేశారు.దీంతో మనకు తెలియకుండానే మన గుర్తింపు పత్రాలతో ఎవరో సిమ్ తీసుకునే అవకాశం ఉందనే విషయం మరోసారి స్పష్టమైంది.

DoT సూచన
మీ పేరుతో రిజిస్టర్ అయిన సిమ్‌ కార్డును.. మరో వ్యక్తికి ఇచ్చినా కూడా సమస్యలు తలెత్తవచ్చు. ఉదాహరణకు, మీ పేరుతో ఉన్న సిమ్‌ను మీరు ఎవరికైనా ఇచ్చారు. ఆ వ్యక్తి దాన్ని ఉపయోగించి సైబర్ మోసం లేదా మరేదైనా అక్రమ కార్యకలాపానికి పాల్పడితే, దర్యాప్తులో ఆ సిమ్ ఎవరి పేరుపై ఉందనే విషయం కూడా బయటకు వస్తుంది. అందుకే.. మీ పేరుతో తీసుకున్న సిమ్‌ను అప్పుగా ఇవ్వడం, అద్దెకు ఇవ్వడం, అమ్మడం లేదా మరొకరి కోసం ఉపయోగించడం వంటి వాటికి దూరంగా ఉండాలని DoT సూచించింది.

DoT సిమ్ కార్డులతో పాటు మొబైల్ ఫోన్‌లోని ఐఎంఈఐ నంబర్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. ఎందుకంటే.. ఈ నంబర్ ఒక మొబైల్ పరికరాన్ని గుర్తించడానికి ఉపయోగిస్తారు. దీన్ని మార్చడం లేదా ట్యాంపర్ చేయడం చట్టపరమైన సమస్యలకు దారితీయవచ్చు. అంతేకాకుండా.. కాలింగ్ లైన్ ఐడెంటిటీ (CLI), ఇతర టెలికాం ఐడెంటిఫైయర్లను మార్చేందుకు యాప్స్, వెబ్‌సైట్లు లేదా ఇతర సాధనాలను ఉపయోగించకూడదని DoT సూచించింది.

ఇదీ చదవండి: మొబైల్‌ రీఛార్జ్‌లపై కేంద్రం శుభవార్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement