డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావమే కారణం
దేశంలో మొబైల్ డేటా వినియోగంపై ప్రత్యేక పన్ను (డేటా టాక్స్) విధించాలనే ప్రతిపాదనను ఉపసంహరించుకోవడానికి కేంద్ర టెలికాం శాఖ (డాట్) సన్నాహాలు చేస్తోంది. ఈ పన్ను అమలులో ఎదురయ్యే సాంకేతిక చిక్కులు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరణపై పడే ప్రతికూల ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్లు అధికారిక వర్గాల సమాచారం.
నేపథ్యం.. ప్రతిపాదన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో భాగంగా డేటా వినియోగం ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడంతో పాటు చిన్నారుల్లో పెరుగుతున్న డిజిటల్ వ్యసనాన్ని తగ్గించడమే లక్ష్యంగా డేటాపై పన్ను ప్రతిపాదనను పరిశీలించాలని డాట్‌ని ఆదేశించారు. గిగాబైట్‌కు(జీబీ) రూ.1 చొప్పున పన్ను విధించే మోడల్‌ను సెప్టెంబర్ 30 నాటికి రూపొందించాలని తొలుత భావించారు.
ఎదురైన సవాళ్లు
డేటా పన్ను అమల్లో ప్రాథమికంగా కొన్ని సమస్యలు గుర్తించారు. ప్రతి వినియోగదారుడి డేటా వాడకాన్ని సూక్ష్మ స్థాయిలో పర్యవేక్షించడం ఆచరణాత్మకంగా అసాధ్యం. ఒకవేళ రీఛార్జ్ ప్యాక్‌లపై నేరుగా పన్ను వేస్తే తక్కువగా వినియోగించే వారికి కూడా అదనపు భారం పడుతుంది. యూపీఐ చెల్లింపులు, ఆన్‌లైన్ విద్య, ఆరోగ్య సేవలు, ఈ-కామర్స్ వంటి నిత్య జీవితంలో డేటా అత్యవసరంగా మారింది. ఉత్పత్తికి ఉపయోగపడే డేటా, ఎంటర్‌టైన్‌మెంట్ డేటాను వేరు చేయడం వీలుపడదు. ఇప్పటికే రీఛార్జ్‌లపై 18% జీఎస్టీ చెల్లిస్తున్న వినియోగదారులపై మరింత భారం మోపడం డిజిటల్ ఇండియా ఆశయాలకు విఘాతం కలిగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
డేటా వినియోగ గణాంకాలు
డాట్ అధికారిక డేటా ప్రకారం, భారతదేశంలో మొబైల్ డేటా వాడకం భారీగా పెరిగింది. ఆర్థిక సంవత్సరం 2025లోని 229 బిలియన్ జీబీతో పోలిస్తే ఆర్థిక సంవత్సరం 2026 నాటికి డేటా వినియోగం 24.5% పెరిగి 285 బిలియన్ జీబీకి చేరుకుంది. డిజిటల్ వ్యసనం, చిన్నారుల్లో స్క్రీన్ టైమ్ తగ్గించేందుకు పన్నులు విధించడం సరికాదని నిపుణులు స్పష్టం చేశారు. వయస్సు నిర్ధారణ ప్రక్రియ, పేరెంటల్ కంట్రోల్స్, కంటెంట్ నియంత్రణ వంటి సాంకేతిక చర్యల ద్వారా మాత్రమే ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించవచ్చని అధికారులు ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తుంది.
ఇదీ చదవండి: బోణీ కొట్టిన ‘గణేష్’ ఎకానమీ


