బంగారం, వెండిపై భారీగా ఉన్న దిగుమతి సుంకాలను తగ్గించే అంశంపై కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న అధిక పన్నుల కారణంగా.. చట్టబద్ధంగా దిగుమతి చేసుకునే బంగారం కంటే, అక్రమ మార్గాల్లో వచ్చే బంగారం చౌకగా మారే పరిస్థితి ఏర్పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. సుంకం తగ్గిస్తే స్మగ్లింగ్‌ను అడ్డుకోవచ్చా?, అనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే.. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. బులియన్ వ్యాపారులు, జ్యువెలరీ రంగం మాత్రం ప్రస్తుత 15 శాతం సుంకాన్ని.. 6 శాతానికి తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. ఇదే జరిగితే ధరలు కొంత తగ్గే అవకాశం ఉంటుంది.
సుంకం ఎందుకు పెంచారు?
బంగారం దిగుమతులు భారీగా పెరగడంతో దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుందన్న ఆందోళనతో ప్రభుత్వం మే 13, 2026న దిగుమతి సుంకాన్ని పెంచింది. భారత్ ప్రతి ఏడాది సుమారు 700-800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. సుంకం పెంచడానికి ముందు ఏప్రిల్‌లో బంగారం దిగుమతులు ఏకంగా 82 శాతం పెరిగాయి. ఎక్కువగా బంగారం దిగుమతి చేసుకుంటే డాలర్లకు డిమాండ్ పెరగడంతో పాటు కరెంట్ అకౌంట్ లోటు కూడా పెరుగుతుంది. దీంతో రూపాయిపై ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది.
పన్ను పెంచినా దిగుమతులు తగ్గలేదే?
ప్రభుత్వం సుంకాన్ని పెంచినప్పటికీ బంగారం దిగుమతులు పూర్తిగా తగ్గలేదు. మేలో దిగుమతులు దాదాపు 34 శాతం పెరిగాయి. ఆ తర్వాత జూన్, జూలై నెలల్లో కలిపి బంగారం దిగుమతుల విలువ 5.5 శాతం పెరిగి 6.13 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో అధిక సుంకం విధించడం ద్వారా దిగుమతులను నియంత్రించాలన్న ప్రభుత్వ లక్ష్యం ఎంతవరకు నెరవేరిందనే ప్రశ్నలు వస్తున్నాయి.
స్మగ్లింగ్ ఎందుకు పెరుగుతోంది?
పరిశ్రమ వర్గాల వాదన ప్రకారం.. అధిక పన్ను కారణంగా చట్టబద్ధంగా దిగుమతి చేసుకునే బంగారం ఖరీదుగా మారుతుంది. అదే సమయంలో అక్రమ మార్గంలో వచ్చే బంగారంపై ఇలాంటి పన్ను ఉండదు. దీంతో రెండు మార్గాల మధ్య ధర వ్యత్యాసం పెరుగుతుంది. ఈ పరిస్థితి స్మగ్లింగ్‌కు ప్రోత్సాహం ఇవ్వొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అందుకే సుంకాన్ని తగ్గిస్తే చట్టబద్ధమైన దిగుమతులు పెరగడంతో పాటు అక్రమ మార్గాల్లో బంగారం వచ్చే ప్రోత్సాహం కూడా తగ్గవచ్చని వారు భావిస్తున్నారు.
వెండి, ప్లాటినంపైనా ప్రభావం
కేంద్రం కేవలం బంగారం గురించే కాకుండా వెండి, ప్లాటినం దిగుమతి సుంకాలపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. వీటికి ఆభరణాల రంగంతో పాటు పారిశ్రామికంగా కూడా భారీ డిమాండ్ ఉంది. వెండిని సౌర విద్యుత్ పరికరాలు, ఎలక్ట్రానిక్స్ తయారీలో ఉపయోగిస్తారు. ప్లాటినం ఆటోమొబైల్, వైద్య రంగాల్లో కీలకంగా ఉంటుంది. కాబట్టి వీటిపై అధిక సుంకాలు విధించడం వల్ల పరిశ్రమలకు ముడి పదార్థాల ఖర్చులు పెరిగి, చివరకు ఉత్పత్తుల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.
ప్రస్తుతం ప్రభుత్వం ఒకవైపు దేశ విదేశీ మారక నిల్వలను కాపాడుకోవాలని చూస్తోంది. మరోవైపు అధిక పన్నుల వల్ల స్మగ్లింగ్ పెరగడం, పరిశ్రమల ఖర్చులు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే.. సుంకాలను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 15 శాతం నుంచి 6 శాతానికి సుంకం తగ్గిస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ సుంకం తగ్గిస్తే అధికారిక మార్గంలో బంగారం దిగుమతులు పెరగవచ్చు. అదే సమయంలో స్మగ్లింగ్ తగ్గుతుందా, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి ఎలా ఉంటుంది అనేది కీలకంగా మారనుంది.
ఇదీ చదవండి: బంగారం ధరలకు బ్రేక్.. ఒక్కరోజులో భారీ పతనం!


