పట్నా: బిహార్‌లోని పట్నాకు చెందిన ప్రముఖ విద్యావేత్త ఫైజల్ ఖాన్ (ఖాన్ సర్) వల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆరోపిస్తూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ పిర్‌బహోర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు తగిన రక్షణ కల్పించాలని ఆమె పోలీసులను కోరారు. బాధిత మహిళ పేర్కొన్న వివరాల ప్రకారం... 2017–18 కాలంలో పట్నాలోని తన మహిళా స్నేహితురాలి గదికి ఖాన్ సర్ తరచూ వస్తూ ఎక్కువ సమయం గడిపేవారని ఆమె ఆరోపించారు. తాను దీనిని వ్యతిరేకించగా, తనపై పోలీసు కేసు బనాయిస్తామని, చంపేస్తామని బెదిరించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఖాన్ సర్‌కు సంబంధించిన పలు రహస్యాలు తనకు తెలుసని, ఆయన ప్రమేయంతో తనకేదైనా జరగొచ్చనే భయం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తనకు తెలిసిన సమాచారాన్ని బయటకు చెప్పకుండా ఉండేందుకే తనను అంతమొందించే అవకాశం ఉందని ఆమె పోలీసులకు విన్నవించారు. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు డీఎస్పీ రాజేష్ రంజన్ తెలిపారు. ఫిర్యాదులోని అంశాలు, పూర్వాపరాలపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. గతంలో తన కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన ఘర్షణ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పొందిన ఖాన్ సర్, తాజా ఫిర్యాదుతో మరోసారి వార్తల్లో నిలిచారు.
ఇది కూడా చదవండి: డేరింగ్ ప్రపోజల్ చేసిన నెట్‌ఫ్లిక్స్ జంటపై క్రిమినల్ కేసులు!


