న్యూయార్క్‌లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొననున్న కార్యక్రమం రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 29న న్యూయార్క్‌లోని ప్రతిష్ఠాత్మక మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి తాను మద్దతు ఇవ్వడం లేదని న్యూయార్క్ నగర మేయర్ జొహ్రాన్ మమ్దానీ స్పష్టం చేశారు. అయితే అది ప్రైవేట్ కార్యక్రమం కావడంతో దాన్ని రద్దు చేసే అధికారం నగర పాలక సంస్థకు ఉందో లేదో తనకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు.
ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా చేపట్టిన ప్రపంచవ్యాప్త కార్యక్రమాల్లో భాగంగా మోహన్ భగవత్ అమెరికా పర్యటనకు వచ్చారు. న్యూయార్క్‌లో ఆయన ‘యూనివర్సల్ వన్‌నెస్’ కార్యక్రమంలో పాల్గొని, సుమారు 5,000 మంది భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో శనివారం జరగనుంది. ఈ నేపథ్యంలో మోహన్ భగవత్ కార్యక్రమాన్ని ఉద్దేశించి న్యూయార్క్ మేయర్ మమ్దానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన స్పందిస్తూ.. ‘నేను ఈ ర్యాలీకి మద్దతు ఇవ్వను. అయితే ఇది ప్రైవేట్ కార్యక్రమం కాబట్టి దాన్ని రద్దు చేసే అధికార పరిధి నగరానికి ఉందో లేదో నాకు తెలియదు’ అంటూ వ్యాఖ్యానించారు.
అలాగే, తాను న్యూయార్క్ చరిత్రలో తొలి భారతీయ అమెరికన్ మేయర్‌నని మమ్దానీ గుర్తుచేశారు. తన తల్లి కుటుంబ సభ్యులు ఇప్పటికీ భారత్‌లోనే ఉన్నారని తెలిపారు. భారత్ అంటే బహుళత్వాన్ని గౌరవించే సమాజం, లౌకిక గణతంత్రం, ప్రతి ఒక్కరికీ సమానంగా చోటు కల్పించే దేశమనే భావనతో తాను పెరిగానని చెప్పారు. అలాంటి దేశంలో మినహాయింపు, విభజన ఆధారిత భావజాలం పెరుగుతుండటం తనను తీవ్రంగా కలవరపెడుతోందని అన్నారు. ఏ దేశమైనా సరే ప్రజలను మినహాయించే, విభజించే ఆలోచనలకు తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. భారతీయ అమెరికన్‌గా మాత్రమే కాకుండా.. ప్రతీ ఒక్కరికీ చోటు కల్పించాలనే విలువలను నమ్మే నగర మేయర్‌గా కూడా తాను ఈ భావజాలాన్ని వ్యతిరేకిస్తున్నానని చెప్పారు.
మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వద్ద నిరసనలు
మోహన్ భగవత్ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ న్యూయార్క్‌లోని పలు మతాంతర, పౌరహక్కుల సంఘాలు రంగంలోకి దిగాయి. న్యూయార్క్ సిటీ హాల్ వెలుపల మీడియా సమావేశం నిర్వహించిన ఆయా సంస్థలు కార్యక్రమాన్ని రద్దు చేయాలని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ యాజమాన్యాన్ని కోరాయి. మరోవైపు మోహన్ భగవత్ పాల్గొనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ‘AHEAD Forum’ సోషల్ మీడియా వేదికగా కార్యక్రమ వివరాలను వెల్లడించింది. ‘యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్’ పేరుతో జరిగే ఈ కార్యక్రమం ‘ప్రపంచమంతా ఒకే కుటుంబం’ అనే సందేశాన్ని చాటుతుందని నిర్వాహకులు తెలిపారు.
చదవండి: భారత కంపెనీలకు షాకిచ్చిన ట్రంప్


