కాలిఫోర్నియా: టీనేజర్ల భద్రతా ఫీచర్లను ఎంతమంది వినియోగిస్తున్నారనే వాస్తవాన్ని వెల్లడించకుండానే వాటిని ప్రచారం చేశామని ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరి కాలిఫోర్నియా న్యాయస్థానంలో అంగీకరించారు. పిల్లలను సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మార్చడంతో పాటు వారి వ్యక్తిగత డేటాను సేకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందంటూ మెటా సంస్థపై అమెరికాలోని 29 రాష్ట్రాలు దాఖలు చేసిన దావా విచారణ సందర్భంగా ఈ విషయం వెలుగుచూసింది.
టీనేజర్లు స్క్రీన్ సమయాన్ని తగ్గించుకునేందుకు ప్రవేశపెట్టిన ‘టేక్ ఏ బ్రేక్’ (2021), ‘క్వైట్ మోడ్’ (2023) ఫీచర్లపై మొస్సేరిని న్యాయవాదులు ప్రశ్నించారు. మెటా అంతర్గత పత్రాల ప్రకారం ‘టేక్ ఏ బ్రేక్’ వినియోగం కేవలం 1.8 శాతంగా, ‘క్వైట్ మోడ్’ వినియోగం 8.7 శాతంగా నమోదైంది. ప్రారంభ దశలో మొత్తం ఖాతాల్లో 1 నుంచి 2 శాతం మాత్రమే వీటిని వినియోగించినప్పటికీ, ఆ వివరాలను బహిర్గతం చేయలేదని మొస్సేరి ఒప్పుకున్నారు. అయితే 2024లో తీసుకొచ్చిన ‘టీన్ అకౌంట్స్’ ద్వారా ఈ పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని ఆయన పేర్కొన్నారు.
2021లో మొస్సేరి రాసిన బ్లాగ్‌లో ‘90 శాతానికి పైగా టీనేజర్లు రిమైండర్లను కొనసాగిస్తున్నారు’ అని పేర్కొనడంపై కోర్టులో చర్చ జరిగింది. ఈ ఫీచర్‌ను ఇప్పటికే యాక్టివేట్ చేసుకున్నవారికి మాత్రమే ఆ 90 శాతం వర్తిస్తుందని, మొత్తం టీనేజర్లలో 90 శాతం మంది వినియోగించినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, మెటా మాజీ ఇంజినీరింగ్ డైరెక్టర్ ఆర్టురో బెజార్ సాక్ష్యమిస్తూ.. ‘టేక్ ఏ బ్రేక్’ విఫలమయ్యేలా రూపొందించిన ఫీచర్ అని ఆరోపించారు. పిల్లల ఎంగేజ్‌మెంట్ తగ్గుతుందనే ఉద్దేశంతోనే ‘క్వైట్ మోడ్’ను డిఫాల్ట్‌గా ఉంచడానికి యాజమాన్యం నిరాకరించిందని మాజీ డేటా సైంటిస్ట్ జార్జ్ వోలిచెంకో తెలిపారు. ఈ కేసులో మెటాపై అభియోగాలు రుజువైతే సుమారు 200 బిలియన్ డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశముంది.
ఇది కూడా చదవండి: మథురలో అరుదైన రాఖీ సంప్రదాయం!


