సాహస క్రీడలు
విహారం ఆహ్లాదాన్నిస్తుంది.. సాహసం ధైర్యాన్నిస్తుంది. కానీ ఒక చిన్న ఏమరపాటు ప్రాణాలమీదికి తెస్తుంది. మన దేశపు యువతలో కూడా ట్రెక్కింగ్ కల్చర్ పెరుగుతోంది. రిషికేశ్‌లో వైట్–వాటర్ రాఫ్టింగ్, బీర్ బిల్లింగ్‌లో పారాగ్లైడింగ్, దాండేలిలో జిప్‌లైన్, హిమాలయాల్లో ట్రెక్కింగ్.. ఇలా సాహస క్రీడల వైపు పర్యాటకులు క్యూ కడుతున్నారు. అయితే, ఈ క్రేజ్‌కు తగినట్లుగా పర్యాటకుల భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఇటీవల కర్ణాటకలోని దాండేలి రిసార్ట్‌లో జరిగిన ఒక తీవ్రమైన ప్రమాదం ఈ భద్రతా లోపాలను మరోసారి కళ్లకుకట్టింది. జూలై 3న 24 ఏళ్ల కుబేర్ సుర్పూర్ అనే యువకుడు దాండేలిలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో జిప్‌లైన్ చేస్తుండగా, సగం దూరంలో ఉండగానే ‘సేఫ్టీ లాక్’ ఊడిపోయింది. దాదాపు 40 అడుగుల ఎత్తు నుంచి అతను కిందపడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
వెళ్లే‘ముందు’ జాగ్రత్తలు..
గుడ్డిగా నమ్మవద్దు: మీరు ఎంచుకున్న ఆపరేటర్ పర్యాటక శాఖ లేదా అడ్వెంచర్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయ్యాడో లేదో తెలుసుకోండి. వెబ్‌సైట్‌లో రాసింది నమ్మకుండా, వారి ఒరిజినల్ భద్రతా సర్టిఫికెట్లను చూపించమని అడగండి.
స్వయంగా చూడండి: బెల్టులు, హెల్మెట్లు, తాళ్లు, లాకింగ్ సిస్టమ్స్ పాతబడిపోయాయా లేదా తుప్పు పట్టి ఉన్నాయా అనేది స్వయంగా చూసుకోండి. అనుమానం వస్తే ఆ రైడ్ మానడమే మంచిది.
సేఫ్టీ బ్రీఫింగ్: యాక్టివిటీ మొదలయ్యే ముందు నిపుణులైన ఇన్ స్ట్రక్టర్ ఇచ్చే భద్రతా సూచనలు స్పష్టంగా వినండి. సేఫ్టీ లాక్స్, ఎమర్జెన్సీ బ్రేక్స్ ఎలా పనిచేస్తాయో అడిగి తెలుసుకోండి.
దాచవద్దు: మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు, ఇటీవలి ఆపరేషన్ల వివరాలను ముందే చెప్పండి. బరువు, ఎత్తు పరిమితులను కచ్చితంగా పాటించండి.
ప్యాకేజీలకు మోసపోవద్దు: తక్కువ ధరకే ప్యాకేజీలు ఇస్తున్నారంటే వారు పరికరాల నిర్వహణ, సిబ్బంది శిక్షణలో లోపం ఉందేమో అని గమనించాలి.
వాతావరణం బాగున్నప్పుడే: భారీ వర్షం, బలమైన ఈదురు గాలులు ఉన్నప్పుడు ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి యాక్టివిటీలు చేయవద్దు. ప్రతికూల వాతావరణం వల్ల రోప్‌ల పట్టు సడలి ప్రమాదాలు జరుగుతాయి.
రివ్యూలు ముఖ్యం: కేవలం పక్కన ఉన్న లొకేషన్ బాగుందని కాకుండా, ఆపరేటర్ భద్రతా పద్ధతులు, ఇన్స్‌ట్రక్టర్ల ప్రవర్తనపై ఇతర పర్యాటకులు ఇచ్చిన రివ్యూలను చదవండి.
స్టంట్స్ వద్దు: రైడ్ లేదా రాఫ్టింగ్ మధ్యలో బెల్టులు తీయడం, స్టంట్స్ చేయడం వంటివి ప్రాణాలకే ప్రమాదం తెస్తాయి.
సరదాగా గడిపే క్షణాలు జీవితాంతం బాధింపకూడదంటే సాహస యాత్రల్లో ఉత్సాహంతో పాటు కాస్త అప్రమత్తత కూడా చాలా అవసరం. థ్రిల్ కన్నా మీ ప్రాణాల భద్రతే ముఖ్యం!
అమలులో లోపం!
భారత పర్యాటక శాఖ, అడ్వెంచర్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కలిపి నేల, నీరు, ఆకాశంలో చేసే సాహస క్రీడలకు కఠిన నిబంధనలు రూపొందించాయి. కానీ ఇవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. క్రమం తప్పకుండా పరికరాల తనిఖీలు, సర్టిఫైడ్ గైడ్‌లు, క్వాలిటీ హార్నెస్ సిస్టమ్స్ వాడాలని నిబంధనలు చెప్తున్నాయి. కానీ స్థానిక స్థాయిలో వీటి పర్యవేక్షణ చాలా బలహీనంగా ఉంది. దీనివల్ల అనుమతులు, భద్రతా తనిఖీలు లేని ఆపరేటర్లు పర్యాటకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.


