స్కూల్ బస్సును ఢీకొన్న లారీ.. నలుగురు చిన్నారులు మృతి! | 4 children killed 32 injured as truck rams school bus | Sakshi
Sakshi News home page

స్కూల్ బస్సును ఢీకొన్న లారీ.. నలుగురు చిన్నారులు మృతి!

Nov 24 2026 1:45 PM | Updated on Nov 24 2026 1:55 PM

4 children killed 32 injured as truck rams school bus

కన్నౌజ్: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు పక్కన నిలిపి ఉంచిన స్కూల్ బస్సును వేగంగా వచ్చిన ట్రక్కు వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందగా, మరో 32 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 24 మంది విద్యార్థులు, ఎనిమిది మంది పాఠశాల సిబ్బంది ఉన్నారు.

మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో కన్నౌజ్ జిల్లాలోని థాథియా ప్రాంతం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి ప్రాంతానికి చెందిన ఓరియంటల్ పబ్లిక్ స్కూల్ బస్సు సుమారు 50 మందితో ఆగ్రాలోని తాజ్‌మహల్ సందర్శన ముగించుకుని తిరిగి వస్తోంది. మార్గమధ్యలో విద్యార్థులు టాయిలెట్‌కు వెళ్లేందుకు బస్సును ఎక్స్‌ప్రెస్‌వే పక్కన నిలిపారు. అదే సమయంలో వేగంగా వచ్చిన ట్రక్కు ఈ బస్సును వెనుక నుంచి ఢీకొంది.

ఈ ఘటనలో బస్సు వెనుక భాగం తీవ్రంగా దెబ్బతింది. ప్రమాదాన్ని గమనించిన పోలీసులు, ఉత్తరప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వేస్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ సిబ్బంది, అటుగా వెళ్తున్న వాహనదారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. దెబ్బతిన్న బస్సులో చిక్కుకున్న చిన్నారులను బయటకు తీసి, అంబులెన్స్‌లలో సమీపంలోని మెడికల్ కాలేజీకి తరలించారు. అయితే అప్పటికే నలుగురు విద్యార్థులు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

మృతులను ఆర్యన్ చౌరాసియా (14), రజియుల్లా (16), అర్మాన్ (17), జైద్ మీర్జా (17)గా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పాఠశాల మేనేజర్ సల్మాన్‌తో పాటు ఓ విద్యార్థిని మెరుగైన చికిత్స కోసం కాన్పూర్‌కు తరలించారు. మిగిలిన క్షతగాత్రులకు మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ ఆశుతోష్ మోహన్ అగ్నిహోత్రి, ఎస్పీ వినోద్ కుమార్ ఆసుపత్రికి చేరుకుని బాధితుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన విద్యార్థులను మరో బస్సులో వారి ఇళ్లకు పంపించే ఏర్పాట్లు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement