జైపూర్: రాజస్థాన్‌లోని జైపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో తయారు చేసుకున్న నూడుల్స్ తిన్న ఏడేళ్ల బాలిక మృతిచెందగా, ఆమె అక్క అస్వస్థతకు గురైంది. నవంబర్ 19న పిహు కుమావత్, దివ్యాంశి అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇంట్లో ఎవరూ లేని సమయంలో నూడుల్స్ వండుకుని తిన్నారు. అనంతరం నిద్రపోయారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటికి వచ్చిన తల్లి వారిని గమనించింది.
అప్పటికే అనారోగ్యానికి గురైన దివ్యాంశి మేల్కొనగా.. పిహు మాత్రం అపస్మారక స్థితిలో ఉంది. కుటుంబ సభ్యులు ఇద్దరినీ సమీప ఆస్పత్రికి తరలించగా.. పిహు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దివ్యాంశికు చికిత్స అందించి శుక్రవారం ఉదయం డిశ్చార్జి చేశారు. ప్రాథమిక విచారణలో ఫుడ్ పాయిజనింగ్ అయ్యిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే పోస్టుమార్టం నివేదికలోనే మృతికి అసలు కారణం వెల్లడికానుంది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కర్ధాని పోలీసులు నూడుల్స్ నమూనాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. బాలిక సోదరుడు గోవింద్ గత రెండు నెలలుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: ఉత్కంఠ: అమ్మమ్మ అంత్యక్రియలకు అమృత్‌పాల్ సింగ్


