364 రోజుల నిరీక్షణ.. కార్తీక పౌర్ణమికే కార్తికేయుని దర్శనం! | Kartikeya Swami Temple open only one day | Sakshi
Sakshi News home page

364 రోజుల నిరీక్షణ.. కార్తీక పౌర్ణమికే కార్తికేయుని దర్శనం!

Nov 21 2026 8:44 AM | Updated on Nov 21 2026 8:44 AM

Kartikeya Swami Temple open only one day

గ్వాలియర్‌: ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే 417 ఏళ్ల పురాతన కార్తికేయ స్వామి ఆలయం తెరుచుకోనుంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జీవాజిగంజ్‌లో ఉన్న ఈ ఆలయ ద్వారాలు కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్‌ 24న తెరవనున్నారు. ఈ అరుదైన దర్శనం కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలిరానున్నారు.

నవంబర్‌ 23న అర్ధరాత్రి 12 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేస్తారు. బృందావనానికి చెందిన కేశవ శాస్త్రితో పాటు 11 మంది పండితులు అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం బాణసంచా కాలుస్తారు. నవంబర్‌ 24 తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. ఉదయం 9 గంటలకు సుందరకాండ పారాయణం, సాయంత్రం భజన కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలు, నైవేద్యాలు, దీపాలంకరణ కార్యక్రమాలు ఉంటాయి. నవంబర్‌ 25 తెల్లవారుజామున 4 గంటలకు ఆలయ ద్వారాలు తిరిగి మూసివేస్తారు.

ఈ ఆలయంలో తమ కోరికలు నెరవేరిన తర్వాత భక్తులు 364 వత్తులతో కూడిన దీపాన్ని స్వామివారికి సమర్పిస్తారు. ఏడాదిలో 364 రోజుల నిరీక్షణకు, ఒక్కరోజు లభించే అరుదైన దర్శనానికి గుర్తుగా ఈ దీపాన్ని భావిస్తారు. ఆలయ నిర్వహణ బాధ్యతలను శర్మ కుటుంబానికి చెందిన ఆరో తరానికి చెందినవారు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.

పురాణ కథనం ప్రకారం.. ఒకసారి శివపార్వతులు తమ కుమారులైన గణేశుడు, కార్తికేయుడికి మూడు లోకాలను చుట్టి ముందుగా తిరిగి వచ్చిన వారికి ప్రత్యేక వరం ఇస్తామని చెప్పారు. గణేశుడు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసి విజయం సాధించాడు. దీంతో ఆయనకు ప్రథమ పూజ్యుడిగా వరం లభించింది. ఈ విషయం తెలుసుకున్న కార్తికేయుడు ఆగ్రహంతో తన దర్శనానికి సంబంధించి కఠినమైన శాపం ఇచ్చినట్లు చెబుతారు. అనంతరం శివపార్వతుల వివరణతో శాంతించిన ఆయన.. కార్తిక పౌర్ణమి రోజున తనను పూజించే భక్తుల కోరికలు నెరవేరుతాయని, కష్టాలు తొలగిపోతాయని వరమిచ్చినట్లు పురాణగాథ చెబుతోంది.

ఇదీ చదవండి: Peru: 6.9 తీవ్రతతో భూకంపం.. వీధుల్లోకి జనం పరుగులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement