సాక్షి, చెన్నై: తమిళనాడు పారిశ్రామిక రంగంలో భారీ కలకలం రేగింది. రాష్ట్రానికి రావాల్సిన కొత్త పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులకు లీక్ చేశారన్న వ్యవహారంలో గైడెన్స్ తమిళనాడు సంస్థకు చెందిన 15 మంది సీనియర్ అధికారులను ప్రభుత్వం తొలగించింది. వారిలో ముగ్గురు అధికారులు వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బోర్డులో చేరిన సమాచారంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి, ఇప్పుడు తమిళనాడు మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కీర్తనపై ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.
అసలేం జరిగిందంటే..
తమిళనాడు పరిశ్రమల శాఖ నియంత్రణలో పనిచేసే గైడెన్స్ సంస్థ తమిళనాడు రాష్ట్రానికి దేశవిదేశాల నుంచి కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో తమిళనాడులో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్న కంపెనీల వివరాలు, ఒప్పందాలకు సంబంధించిన కీలక సమాచారం ఆంధ్రప్రదేశ్ అధికారులకు చేరినట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీనిపై పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ అంతర్గత విచారణ జరిపి సమాచారం లీక్ అయినట్లు నిర్ధారించినట్లు తెలిసింది. దీంతో 15 మంది ఉన్నతాధికారులపై వేటు వేశారు. ఈ వ్యవహారం శుక్రవారం వెలుగులోకి రావడం తమిళనాట తీవ్ర చర్చకు దారి తీసింది.
కాగా, నిపుణులతో ఎన్నో ఏళ్లుగా నిరి్మంచిన ఒక కీలక వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వం నాశనం చేస్తోందని పరిశ్రమల శాఖ మాజీ మంత్రి టీఆర్‌బీ రాజా మండిపడ్డారు. దీనికి ప్రభుత్వం, పరిశ్రమల శాఖ మంత్రి నిర్లక్ష్య వైఖరే కారణం అనిఅన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం రాష్ట్రానికి తీవ్ర ద్రోహం అని.. చోరీకి పాల్పడిన వారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలిలో చేరారంటే అర్థమేంటని పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాసు నిలదీశారు.
ఇదీ చదవండి: సుప్రీంకోర్టులో విజయ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ


