ఇది ప్రజాస్వామ్యమా.. ఆటవిక రాజ్యమా? | Intellectuals and analysts are outraged over the conduct of local elections in the state | Sakshi
Sakshi News home page

ఇది ప్రజాస్వామ్యమా.. ఆటవిక రాజ్యమా?

Nov 21 2026 5:40 AM | Updated on Nov 21 2026 5:40 AM

Intellectuals and analysts are outraged over the conduct of local elections in the state

ఏపీలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందా? జాతీయ స్థాయిలో విస్మయం 

రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను నిర్వహిస్తున్న తీరుపై మండిపడుతున్న మేధావులు, విశ్లేషకులు 

రాష్ట్రంలో చట్టబద్ధ పాలన సాగుతోందా అని నిలదీత 

ఊరేదైనా ఒకటే స్క్రిప్ట్‌.. ముందు దాడి, ఆపై బాధితులపైనే కేసులు 

దాడులు చేసేది టీడీపీ మూకలు.. నిందలు, కేసులు వైఎస్సార్‌సీపీపై 

వైఎస్సార్‌ కడప జిల్లాలో ఎంపీ అవినాశ్‌రెడ్డిపై హత్యాయత్నం.. ఆపై ఆయనే అరెస్టు 

తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇంటిపై దాడి.. ఆయన్ని కదలనివ్వని వైనం 

ఖాకీ చొక్కాలు టీడీపీకి తాకట్టు.. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అపహాస్యం 

సాక్షి, అమరావతి: ఏపీలో ఉన్నది ప్రజాస్వామ్యమా.. ఆటవిక రాజ్యమా? రాష్ట్ర ప్రజలే కాదు.. దేశమంతా వేస్తున్న ప్రశ్న ఇది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ సాగిస్తున్న అరాచకాన్ని చూసి జాతీయ స్థాయిలో మేధావులు, విశ్లేషకులు, రాజకీయ పండితులు విస్తుపోతున్నారు. ఊరేదైనా ఒకే స్క్రిప్ట్‌ ఎలా నడుస్తోందని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు కూటమి భాగస్వామి అయిన బీజేపీకే చెందిన సీనియర్‌ నేత సుబ్రమణ్య స్వామి ఏపీలో ప్రజాస్వామ్యమే చచ్చిపోయిందా అని నిలదీసే పరిస్థితి వచ్చింది. అయినా చంద్రబాబు, లోకేశ్‌ అరాచకాలు ఆగలేదు. పట్టణ, పరిషత్‌ ఎన్నికల్లో చంద్రబాబు, లోకేశ్‌ సాగించిన దౌర్జన్యకాండ పంచాయతీ ఎన్నికల్లో మరింతగా పెచ్చుమీరింది. 

చివరకు టీడీపీ కూటమి అరాచకాలు వైఎస్సార్‌సీపీ ఎంపీపైన, ఓ సీనియర్‌ నేతపైనే హత్యాయత్నం చేసే వరకు చేరాయి. శుక్రవారం వైఎస్సార్‌ కడప జిల్లాలో పట్టపగలే, నడిరోడ్డుపై పోలీసుల ఎదుటే కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపైనా దాడి చేశారు. ఈ దాడులు చంద్రబాబు కూటమి బరితెగింపునకు పరాకాష్ట అని మేధావులు మండిపడుతున్నారు. 

దేశమంతా చూస్తోంది 
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న తీరుపై జాతీయ స్థాయిలో మేధావులు, పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికలు నిర్వహిస్తున్న తీరుపై చంద్రబాబు ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీజేపీ సీనియర్‌ నేత సుబ్రమణ్య స్వామి అన్నారు. ఏపీలో చట్టబద్ధ పాలన స్థానంలో జంగిల్‌ రాజ్‌ (ఆటవిక రాజ్యం) వస్తోందా అని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనలపై కోర్టును ఆశ్రయిస్తానని ప్రకటించారు. కాక్రోచ్‌ జనతా పార్టీ కో–కనీ్వనర్‌ ఆశుతోష్‌ రంకా ఏపీలో బూత్‌ క్యాప్చరింగ్, రిగ్గింగ్‌ దృశ్యాలను ఇటీవల ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

 ‘ఒకవైపు అమిత్‌ షా హైదరాబాద్‌లో లోక్‌తంత్ర బచావో ర్యాలీ చేస్తుంటే.. పక్కనే ఉన్న ఏపీలో పరిస్థితి ఇదీ’ అని ఎద్దేవా చేశారు. ప్రశాంత్‌ కనోజియా, అనుషా రవి సూద్, సందీప్‌ మనుధనే వంటి జాతీయ జర్నలిస్టులు నామినేషన్ల అడ్డగింత వీడియోలను షేర్‌ చేస్తూ ఏపీలో ఏం జరుగుతోందని ప్రశ్నిస్తున్నారు. తాను దేశానికే దిక్సూచినని చెప్పుకునే చంద్రబాబు పాలనలో ఏపీ పరువు జాతీయ స్థాయిలో గంగపాలవుతోందని మేధావులు మండిపడుతున్నారు. 

భయమే అసలు అస్త్రం 
ఈ దాడుల లక్ష్యం ఒక్క ఎంపీనో, ఒక్క మాజీ ఎమ్మెల్యేనో కాదన్నది స్పష్టం. గ్రామాల్లో నామినేషన్‌ వేయాలనుకునే ప్రతి సామాన్య కార్యకర్తా వారి లక్ష్యం. సిట్టింగ్‌ ఎంపీకే రక్షణ లేనప్పుడు తమకెక్కడ రక్షణ అని ఊర్లో కార్యకర్తలు వెనకడుగు వేయాలనేది వారి వ్యూహం. గ్రామాల్లో అభ్యర్థులు భయపడి పోటీకి దూరమవ్వాలని, తద్వారా ఆ పంచాయతీలన్నీ టీడీపీ ఖాతాలో పడతాయనేది వారి కుట్ర పూరిత ఆలోచన.  

బాధితులే నిందితులు  
ఈ స్క్రిప్ట్‌లో అత్యంత ప్రమాదకరమైన భాగం పోలీసులదే. దాడి జరిగితే దాడి చేసిన వారిని పట్టుకోవడం పోలీసుల బాధ్యత. ఇక్కడ మాత్రం శాంతిభద్రతలు, 144 సెక్షన్‌ పేరుతో బాధితులనే అదుపులోకి తీసుకుంటున్నారు. అదే తరహాలో ఎంపీ అవినాశ్‌రెడ్డిని స్టేషన్‌కు తరలించారు. దాడి చేసిన టీడీపీ నేతలు, గూండాలను వదిలేసి, బాధితుడైన ఎంపీ అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేయడం దేశాన్ని విస్తుగొలిపింది. 

అదే విధంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో దాడికి గురైన మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని ఇంటి నుంచి కదలనివ్వలేదు. దాడి చేసినవారు దర్జాగా బయట తిరుగుతున్నారు. ఖాకీ చొక్కాలు టీడీపీకి తాకట్టు పెట్టారనడానికి ఇంతకంటే రుజువు అక్కర్లేదని విశ్లేషకులు మండిపడుతున్నారు. ఇక వైఎస్సార్‌సీపీ మద్దతు ఉన్న అభ్యర్థులకు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశించినా పోలీసులు, అధికారులు పట్టించుకోవడంలేదు. ఆ ఆదేశాలను అమలు చేయించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రేక్షకపాత్రకే పరిమితమైంది. 

సదస్సులతో కాలక్షేపం.. పల్లెల్లో విధ్వంసం 
సీఐఐ సదస్సులు, క్వాంటం వ్యాలీ కబుర్లు, పెట్టుబడుల ప్రగల్బాలతో కాలం గడుపుతున్న చంద్రబాబు.. పచ్చటి గ్రామాల్లో ప్రజల నెత్తురు కళ్లజూస్తున్నారు. పచ్చమూకలను వదిలి పెట్రోల్‌ బాంబులు, రాళ్ల దాడులతో గ్రామాలను రక్తసిక్తం  చేస్తున్నారు.

విశ్వాసం కోల్పోవడంతోబరితెగింపు 
పార్టీ గుర్తు లేని పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల ఓటర్ల అసలు మనోగతం బయటపడుతుంది. సూపర్‌ సిక్స్‌ సహా ఏ హామీ అమలు చేయకుండా, ప్రజలకు ఏ మేలూ చేయకుండా మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాలను మోసం చేస్తున్న చంద్రబాబు ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు. పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు చంద్రబాబు సర్కారుపై రగిలిపోతున్నారు. మున్సిపల్, పరిషత్‌ ఎన్నికల్లో అది ప్రస్ఫుటంగా కనిపించింది. అందుకే దౌర్జన్యాలు, అరాచకాలతో వాటిని ఏకపక్షం చేసుకున్నారు. అయినా వైఎస్సార్‌సీపీ ఎదురొడ్డి తన బలాన్ని చాటుకుంది. 

ఇప్పుడు పంచాయతీల్లోనూ వ్యతిరేక ఓటుతో కూటమి ప్రభుత్వంపై తమ వ్యతిరేకతను చాటుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దీంతో పంచాయతీలను ఏకగ్రీవం చేసుకొనేందుకు చంద్రబాబు, లోకేశ్‌ తమ కుట్రలకు మరింతగా పదును పెట్టారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన నాయకుడే ఇలా పోటీని ఓటింగ్‌ దాకా రానివ్వకుండా నామినేషన్‌ దశలోనే తుంచేయాలని చూస్తాడని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. దౌర్జన్యంతో నామినేషన్లను అడ్డుకోవచ్చు గానీ ప్రజల తీర్పును శాశ్వతంగా అడ్డుకోలేరన్న సంగతి చంద్రబాబు, లోకేశ్‌ గుర్తుంచుకోవాలని వారు హెచ్చరిస్తున్నారు.  

నంగనాచి మాటలే.. 
చంద్రబాబు అరాచకాలను దేశమంతా తప్పుపడుతున్నా, ఆయన మాత్రం నంగనాచి మాటలు చెబుతున్నారు. తెరవెనుక చేయాల్సిందంతా చేయిస్తున్నారు. దాడి జరిగిన ప్రతిసారీ ఆ నేరాన్ని వైఎస్సార్‌సీపీపై నెట్టేందుకు ఎల్లో మీడియాను, టీడీపీ సోషల్‌ మీడియా సైన్యాన్ని రంగంలోకి దించుతున్నారు. ఎంపీపై దాడి జరిగిన కొద్ది సేపటికే అవినాశ్‌ డ్రామా అంటూ ఎదురుదాడి మొదలుపెట్టారు. తాడిపత్రిలో ఇల్లు ధ్వంసమైంది పెద్దారెడ్డిది. వాహనాలు కాలిపోయింది ఆయన మనుషులవి. అయినా రాళ్లు ఆయన ఇంటి పై నుంచే ముందు పడ్డాయంటూ పచ్చ పత్రికలు కట్టుకథలు అల్లాయి. వైఎస్సార్‌సీపీయే దాడి చేసి ఉంటే స్టేషన్‌కు వెళ్లింది ఎవరు? కాలిపోయింది ఎవరి వాహనాలు? ఒకే అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారన్నది బాబు ఎత్తుగడ. దొంగే దొంగా అని అరిచినట్టు చేయడంలో చంద్రబాబు మహా నేర్పరి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement