రూ.ఏడు కోట్లు.. ఎక్కడ? | Rs 7 crore collected from victims with promises of securing government jobs for them | Sakshi
Sakshi News home page

రూ.ఏడు కోట్లు.. ఎక్కడ?

Nov 21 2026 5:12 AM | Updated on Nov 21 2026 5:12 AM

Rs 7 crore collected from victims with promises of securing government jobs for them

ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసగించిన కేసు దర్యాప్తులో అన్నీ అనుమానాలే

లావాదేవీల గుట్టు విప్పకుండా నిజాలు తేలేదెలా?  

డబ్బులిచ్చి న బాధితుల వివరాలన్నీ గోప్యమే 

జనసేన నేతల ఫిర్యాదు కోణంలోనే కొనసాగుతున్న పోలీసుల విచారణ  

నిందితురాలు ధరణికృష్ణ ఆరోపించినట్లుగా జనసేన కార్యాలయంలో కార్యకలాపాలపై విచారించరా? 

తూతూ మంత్రంగా విచారించి కేసు ముగించేలా ఒత్తిళ్లు 

ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వారిని కాపాడే యత్నాలు జరుగుతున్నాయంటున్న పరిశీలకులు

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బాధితుల నుంచి రూ.ఏడు కోట్ల మేర వసూళ్లకు పాల్పడిన కేసులో అసలు నిజాలు వెలికి తీసే దిశగా దర్యాప్తు జరుగుతోందా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. డబ్బుల చెల్లింపులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల గుట్టు విప్పకుండా ఈ కేసులో వాస్తవాలు బయటకు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో అవే కీలకమని స్పష్టం చేస్తున్నారు.

మోసపోయిన బాధిత నిరుద్యోగుల సమాచారాన్ని గోప్యంగా ఉంచడం.. జనసేనలో  కీలకంగా ఉన్న కోట రుక్మిణి, కళ్యాణం శివ శ్రీనివాసరావు (కేకే) ఇచ్చి న ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టిన నేపథ్యంలో దర్యాప్తు ఏకపక్షంగా కొనసాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం కోట రుక్మిణి, కేకే ఇచ్చి న ఫిర్యాదు కోణంలోనే దర్యాప్తు సాగుతుండటం దీనికి బలం చేకూరుస్తోంది. ఇక పోలీసులు ఈ కేసులో నిందితురాలిగా చెబుతున్న ధరణి కృష్ణ  తనను బలిపశువుగా మార్చారని... నిజానికి ఫిర్యాదుదారులే అక్రమాలకు పాల్పడ్డారని సెల్ఫీ వీడియోల ద్వారా వెల్లడించడం గమనార్హం.  

లండన్‌ లావాదేవీలు..?
జనసేనలో కీలకంగా వ్యవహరించే కోట రుక్మిణి, కేకే ఈ నెల 11న రాత్రి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయగా.. నిందితురాలిగా పేర్కొన్న ధరణి కృష్ణ తనను పోలీసులు 13న అదుపులోకి తీసుకొని మూడు రోజుల పాటు తీవ్రంగా హింసించినట్లు ఆరోపించింది. ధరణి కృష్ణ ఆచూకీ కోసం ఆమె తల్లి హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు తర్వాతే బయటకు వచ్చారు. ఇప్పుడు పోలీసులు ధరణికృష్ణ పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13న  ధరణి కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకోవడం వాస్తవమా.. కాదా..? పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని ఉంటే ఎందుకు వదిలేసినట్లు? ఇప్పుడు పరారీలో ఉన్నట్లు ప్రకటించడం ఏమిటి? అనే సందేహాలు వెంటాడుతున్నాయి. 

ధరణి కృష్ణ సెల్ఫీ వీడియోలో ఆరోపించినట్లుగా ఈ కేసులో రాజకీయ ఒత్తిళ్లతో పోలీసుల దర్యాప్తు సాగుతోందా? సమగ్ర విచారణ చేపట్టకుండా ధరణి కృష్ణను బలి పశువుగా మార్చి వాస్తవాలు వెలుగులోకి రాకుండా కేసును ముగించే యత్నాలు జరుగుతున్నాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఫిర్యాదులో లండన్‌ కార్యకలాపాల ప్రస్తావన కూడా ఉన్న నేపథ్యంలో ఈ వ్యవహారంలో అక్రమంగా డబ్బు తరలింపు, విదేశీ లావాదేవీలు అనే కోణంలో దర్యాప్తు సాగడం లేదనే విమర్శలున్నాయి.  

అధారాలు తారుమారు!
జనసేన కేంద్ర కార్యాలయంలో కీలకంగా వ్యవహరించే కోట రుక్మిణి, రాష్ట్ర పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ హోదాలో ఉన్న కేకే  తమ ఫిర్యాదుల్లో ధరణి కృష్ణను ఓ సాధారణ ఉద్యోగిగా మాత్రమే పేర్కొనగా... ధరణి కృష్ణ మాత్రం సెల్ఫీ వీడియోలో తాను జనసేన కోసం పని చేస్తున్నానని, పార్టీ కోసం స్థానిక ఎన్నికల్లో యాప్‌ తయారీలో పాల్గొన్నట్లు వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. తన వద్ద తగిన ఆధారాలున్నట్లు ఆమె స్పష్టం చేసింది. రూ. ఏడు కోట్ల మేర మోసం కేసులో తనకు ఎవరూ డబ్బులివ్వలేదని.. డబ్బులెవరికి, ఎవరిచ్చారో తేల్చాలని ధరణికృష్ణ సెల్ఫీ వీడియోల్లో డిమాండ్‌ చేసింది. 

ఈ నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తే కీలక అంశాలు వెలుగు చూడటం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. జనసేన కార్యాలయం కేంద్రంగా ఈ వ్యవహారం సాగగా.. దర్యాప్తు సంస్థలు మాత్రం దీంతో ఆ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా విచారణ కొనసాగించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇదే రీతిలో దర్యాప్తు కొనసాగితే ఆధారాలు తారుమారయ్యే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వారిని కాపాడే యత్నాలు జరుగుతున్నాయని పేర్కొంటున్నారు.

పెద్ద తలకాయల పాత్ర? 
డబ్బుల చెల్లింపుల లావాదేవీలు బయట­కు వస్తే బాధితులు  ఎవరెవరికి ఇచ్చారు? ఎంత ఇచ్చారు? కేవలం రూ.ఏడు కోట్లు మాత్రమేనా?  ఇంకా ఎక్కువ వసూళ్లకు పాల్పడ్డారా? అనే విషయాలు బహిర్గతమవుతాయి. తద్వారా సూత్రధారులు, పాత్రధారులు, ప్రధాన నిందితుల వివరాలు వెలుగులోకి వస్తాయని పేర్కొంటున్నారు. దీన్ని చేధిస్తే ఈ వ్యవహారంలో ధరణి కృష్ణ, పెద్దిరాజు లాంటి వారితో పాటు పెద్ద తలకాయల పాత్ర కూడా ఉందా? అనే కీలక సమాచారం వెలుగులోకి రానుంది. అయితే పోలీసులు, దర్యాప్తు సంస్థలు ఇప్పటి వరకు ఈ దిశగా దృష్టి సారించిన దాఖలాలు లేవనే చర్చ జరుగుతోంది.

సాధారణ ప్రైవేట్‌ ఉద్యోగికి సాధ్యమేనా? 
అసలు ఓ సాధారణ ప్రైవేట్‌ కంపెనీ ఉద్యోగి ఇలాంటి స్కామ్‌కు పాల్పడే అవకాశం ఉంటుందా? ప్రైవేట్‌ కంపెనీ ఉద్యోగి మాటలు నమ్మి బాధితులు రూ.కోట్లలో లంచాలు ఇచ్చే పరిస్థితి ఉంటుందా? అనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. మొత్తం 36 మంది బాధితులలో ఇప్పటి వరకు ఎంతమందిని గుర్తించారో పోలీసులు అధికారికంగా వెల్లడించకుండా గోప్యంగా ఉంచడం అనుమానాలు రేకెత్తిస్తోంది. 

ఉద్యోగాల మోసం కేసుపై స్పందించని ప్రభుత్వ పెద్దలు..!
ప్రభుత్వ ఉద్యోగాలంటూ భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. దేవదాయ శాఖ, పోలీసు శాఖల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ నిరుద్యోగులను రూ. ఏడు కోట్ల మేర మోసగించారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల పేరిట ఇంత భారీ స్కామ్‌ జరిగితే ఈ కేసు విషయంలో ప్రభుత్వ పెద్దలు గుంభనంగా వ్యవహరిస్తూ ఇంతవరకూ స్పందించకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement