ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ధరణి కృష్ణ ఫిర్యాదు
తన ప్రైవేట్ భాగాలపై దాడిచేశారంటూ ఆవేదన
ఫిర్యాదులో కేకే, కోట రుక్మిణిలపైనా ఆరోపణలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగాల పేరిట రూ.ఏడుకోట్లు వసూలు చేశారన్న కేసులో పోలీసులు నిందితురాలుగా పేర్కొంటున్న ధరణికృష్ణ జాతీయ మానవహక్కుల సంఘాన్ని (ఎన్‌హెచ్‌ఆర్‌సీని) ఆశ్రయించారు. పోలీసులు తనను సుమారు 56 గంటల పాటు అక్రమంగా నిర్బంధించి, విచక్షణరహితంగా కొట్టడంతో పాటు ప్రైవేట్ భాగాలపైన కూడా దాడిచేశారని ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు కాపీ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తన అక్రమ నిర్భందం వెనుక ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్ (కేకే), ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ వ్యక్తిగత కార్యదర్శి కోట రుక్మిణి, డాక్టర్ నరేష్, నిమ్మకాయల పెద్దిరాజు తదితరుల ప్రమేయం ఉందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ నెల 13న డాక్టర్ నరేష్ ఫోన్‌చేసి మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు రావాలని చెప్పడంతో వెళ్లిన తనను అక్కడే నిర్బంధించారని తెలిపారు. తనను సీఐ గదిలో బంధించి రబ్బరు బెల్టులు, కర్రలతో చేతులు, కాళ్లు, శరీరంలోని ఇతర భాగాలతో పాటు ప్రైవేట్ భాగాలపై కూడా కొట్టారని పేర్కొన్నారు. ఆ సమయంలో కేకే వీడియో కాల్‌లో ఉండి దాడిని గమనిస్తూ సూచనలిచ్చారని, ఆయనకు నచ్చిన విధంగా ఇతరుల పేర్లు చెప్పాలని ఒత్తిడి చేశారని తెలిపారు. నవంబర్ 14న తనను గ్రీన్ కలర్ హ్యుందాయ్ ఎక్స్టర్ వాహనంలో హైదరాబాద్ తీసుకెళ్లి పలు ప్రాంతాల్లో తిప్పుతూ వేధించారని తెలిపారు.
అనంతరం గుంటూరులోని పోలీస్ క్వార్టర్స్‌తో పాటు గుర్తుతెలియని ప్రాంతాలకు తీసుకెళ్లి మళ్లీ చిత్రహింసలకు గురిచేశారని.. అక్కడ తనను చంపి, ఆ మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు. తన ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. నవంబర్ 13 ఉదయం నుంచి నవంబర్ 15 సాయంత్రం వరకు సుమారు 56 గంటల పాటు నిర్బంధంలో ఉంచారని, తన తల్లి నాగమణి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన అనంతరం తనను విడుదల చేశారని పేర్కొన్నారు.
తనపై జరిగిన దాడికి సంబంధించి వైద్య నివేదికతో సహా పెనమలూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే.. మంత్రి నాదెండ్ల పేరును పేర్కొంటూ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించారని తెలిపారు. ఫిర్యాదులో పలువురు పోలీసు అధికారుల పేర్లను పేర్కొన్నారు. పోలీసుల నిర్బంధం నుంచి విడుదలైన అనంతరం ఈ నెల 16న విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న పత్రాలు, కేసుకు సంబందించి వివిధ డాక్యుమెంట్లను ఆమె ఫిర్యాదుకు జతచేశారు.


